ETV Bharat / state

KTR Tour in America: ఎన్నారైలే రాష్ట్ర రాయబారులు... అమెరికా పర్యటనలో కేటీఆర్

author img

By

Published : Mar 21, 2022, 6:06 AM IST

KTR
KTR

KTR Tour in America: రాష్ట్రానికి భారీ పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ మేరకు లాస్​ ఏంజిల్స్​కు చేరుకున్న కేటీఆర్​కు.. అక్కడి తెరాస అభిమానులు, ప్రవాసీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. తెలంగాణ అభివృద్ధి, కార్యక్రమాలపై కేటీఆర్​ వారితో చర్చించారు.

KTR Tour in America: తెలంగాణకు దేశవిదేశాల్లోని ప్రవాసులే గొప్ప రాయబారులని.. సొంత రాష్ట్ర అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. పెట్టుబడుల సాధనకు నిరంతర కృషి చేయాలని, మన ఊరు-మన బడి కార్యక్రమానికి పెద్దఎత్తున చేయూతనివ్వాలని కోరారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చే లక్ష్యంతో అమెరికాకు వెళ్లిన కేటీఆర్‌కు ఆదివారం లాస్‌ఏంజెలెస్‌ విమానాశ్రయంలో ప్రవాసులు, తెరాస కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.శాలువాలతో సత్కరించారు. అనంతరం మంత్రి విమానాశ్రయంలో ప్రవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తన పర్యటన లక్ష్యాలను వారికి వివరించారు.

‘‘ప్రపంచంలోని 60 శాతం దేశాలకు చెందిన సంస్థలు భారీ పెట్టుబడులతో తెలంగాణలో పరిశ్రమలు, ఆర్థిక సంస్థలు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పాయి. అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలు హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాలను స్థాపించాయి. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాల దృష్ట్యా మరిన్ని సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఆయా సంస్థలతో సంప్రదింపులు జరపడంతోపాటు కొత్త వాటిని ఆకర్షించేందుకు మళ్లీ అమెరికాకు వచ్చా. తెలంగాణలో పరిశ్రమల కోసం 80 వేల ఎకరాలకుపైగా భూమి అందుబాటులో ఉంది. వాహనరంగంతో పాటు మరికొన్ని రంగాల్లో భారీ పరిశ్రమలు ఏర్పాటు కావాల్సి ఉంది. యువతకు వేల సంఖ్యలో ఉద్యోగాలు రావాలి. వీటన్నింటినీ సాధించేందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నా.

రాష్ట్ర పండగలకు అమెరికాలోనూ సందడి..

అమెరికా అభివృద్ధిలో ప్రవాస తెలంగాణీయులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వారి ద్వారా తెలంగాణ ఖ్యాతి విస్తరిస్తోంది. రాష్ట్రంలో పండగలు వస్తే.. అమెరికాలోనూ అదే వాతావరణం కనిపిస్తోంది. బతుకమ్మ, బోనాలు, దసరా, దీపావళి తదితర వేడుకలను ఇక్కడ ఘనంగా నిర్వహించి మన సంస్కృతి, సంప్రదాయాలను చాటుతున్నారు.

ఎన్నారైలతో కేటీఆర్

ప్రవాసుల సంక్షేమానికి కృషి..

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ అభివృద్ధి చేసి, వాటికి కొత్త రూపు తేవాలనే బృహత్తర సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ‘మన ఊరు-మనబడి’ పథకాన్ని చేపట్టారు. దానికి పెద్దఎత్తున విరాళాలు అందుతున్నాయి. మీరూ విరాళాలు అందించి విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయాలి. ప్రవాసుల సంక్షేమానికి పెద్దఎత్తున కృషి చేస్తున్నాం. ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే ఆదుకుంటున్నాం. మన వినతులపై హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ అధికారులు, అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు చక్కగా సహకరిస్తున్నారు’’ అని కేటీఆర్‌ తెలిపారు.

ఈ సందర్భంగా ప్రవాసులు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందరినీ ఆకర్షిస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టడం ద్వారా సీఎం కేసీఆర్‌ చరిత్ర సృష్టించారని కొనియాడారు. ‘మన ఊరు - మన బడి’కి అమెరికా నుంచి పెద్దఎత్తున విరాళాలను సమీకరిస్తామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: TET File in CM office: సీఎం కార్యాలయానికి టెట్‌ దస్త్రం


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.