ETV Bharat / state

Inter exams: ఇంటర్​లో ఈసారి అంతర్గత పరీక్షలు!

author img

By

Published : Jul 21, 2021, 5:03 AM IST

ఇంటర్మీడియట్​లో అర్ధ సంవత్సరం లేదా ఇంటర్నల్ పరీక్షల విధానం ప్రవేశపెట్టాలని బోర్డు భావిస్తోంది. ఈ విద్యా సంవత్సరం 220 పని దినాలు ఉండేలా విద్యా క్యాలెండరును ప్రణాళిక చేస్తోంది. మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దసరా, సంక్రాంతి సెలవులను కుదించాలని యోచిస్తోంది.

ఇంటర్​లో ఈసారి అంతర్గత పరీక్షలు!
ఇంటర్​లో ఈసారి అంతర్గత పరీక్షలు!

కరోనా పరిస్థితులతో చోటుచేసుకున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఇంటర్ బోర్డు పలు కీలక ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది నుంచి అర్ధ సంవత్సరం పరీక్షలు లేదా ఇంటర్నల్స్​ నిర్వహించాలని భావిస్తోంది. ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు గతేడాది కరోనా తీవ్రత కారణంగా పరీక్షలు నిర్వహించలేదు. ఆ విద్యార్థులకు పదో తరగతిలోనూ పరీక్షలు రాయకుండానే ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం ఇంటర్​ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఆగస్టు లేదా సెప్టెంబర్​లో పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఆలోచిస్తోంది. ఒకవేళ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు ఉంటే.. వారికి మార్కులు ఏ ప్రాతిపదికన వేయాలో అంతుచిక్కడం లేదు.

ఒకవేళ రెండో సంవత్సరం కూడా వార్షిక పరీక్షలు నిర్వహించలేకపోతే.. ఇంటర్ సర్టిఫికెట్ ఎలా ఇవ్వాలనే అంశంపై అంతర్గత చర్చోపచర్చలు జరిగాయి. అర్ధ సంవత్సరం పరీక్షలు నిర్వహించడం మేలనే అభిప్రాయానికి వచ్చారు. ఒకవేళ వార్షిక పరీక్షలు నిర్వహించలేకపోతే.. అర్ధ సంవత్సరం పరీక్షల్లో మార్కుల ఆధారంగానైనా ఉత్తీర్ణులను చేయవచ్చునని ఆలోచన.

ప్రభుత్వం అంగీకరిస్తే మొదటి, రెండో సంవత్సరం విద్యార్థలకు అక్టోబరు చివరి వారంలో అర్ధ సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అర్ధ సంవత్సరం పరీక్షలకు ప్రభుత్వం నిరాకరిస్తే.. ఆన్​లైన్​లోనే ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించాలనే మరో ప్రతిపాదనతో ఇంటర్ బోర్డు ఉంది.

మరోవైపు విద్యా సంవత్సరం క్యాలెండర్​ను రూపొందించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ నెల 1 నుంచి ఆన్​లైన్, టీవీ పాఠాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 1 నుంచి పరిగణనలోకి తీసుకొని.. 220 పని దినాలు ఉండేలా ప్రణాళిక చేస్తోంది. దసరా, సంక్రాంతి సెలవులను తగ్గించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించి.. మార్చి 23 నుంచి ఏప్రిల్ 12 వరకు వార్షిక పరీక్షలు జరపాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. మే చివరి వారంలో అడ్వాన్స్​డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక చేస్తున్నారు. ఈ ఏడాది కూడా 70 శాతం సిలబస్​నే ఖరారు చేయనున్నారు.

ఇదీ చూడండి: INTER BOARD: జూనియర్ కళాశాలలకు ఊరటనిచ్చిన ఇంటర్ బోర్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.