ETV Bharat / state

తెలంగాణ తొలి మహిళా సీఎస్‌గా శాంతికుమారి

author img

By

Published : Jan 11, 2023, 3:01 PM IST

Updated : Jan 11, 2023, 5:01 PM IST

TELANGANA CS
తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతి కుమారీ నియామకం

14:47 January 11

Telangana New CS Shanthi Kumari

Telangana New CS Shanti Kumari
తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారి నియామకం

Telangana New CS Shanthi Kumari : తెలంగాణకు తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరన్న దానిపై ఉత్కంఠ వీడింది. సోమేశ్‌కుమార్ స్థానంలో కొత్త సీఎస్‌గా శాంతికుమారికి బాధ్యతలు అప్పగించారు. హైకోర్టు తీర్పు కారణంగా సోమేశ్‌కుమార్ రిలీవ్ నేపథ్యంలో తదుపరి సీఎస్‌గా ముఖ్యమంత్రి కేసీఆర్‌ శాంతికుమారిని ఎంపిక చేయగా... ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

డీఓపీటీ ఆదేశాలకు అనుగుణంగా సోమేశ్‌కుమార్‌ను విధుల నుంచి రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో పాటు కొత్త సీఎస్‌ను నియమించాల్సి వచ్చింది. ఆ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై తొలి నుంచి ఆసక్తి నెలకొంది. రాష్ట్ర కేడర్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిహోదాలో వసుధామిశ్రా, రాణికుమిదిని, శాంతికుమారి, శశాంక్ గోయల్... సునీల్‌శర్మ, రజత్‌కుమార్, రామకృష్ణారావు, అశోక్‌కుమార్, అర్వింద్‌కుమార్ ఉన్నారు. వీరిలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రేసులో తొలి నుంచి రామకృష్ణా రావు, శాంతికుమారి పేర్లు బలంగా వినిపించగా.... సీనియర్‌ మహిళా అధికారి అయిన శాంతికుమారి వైపే ముఖ్యమంత్రి మొగ్గు చూపారు.

ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతికుమారి అమెరికాలో ఎంబీఏ కూడా పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా ఐఏఎస్‌గా పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్‌మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్లపాటు పనిచేశారు. సీఎం కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్‌-ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా కూడా సేవలందించారు. గతంలో కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్‌ కలెక్టర్‌గా ఆమె పనిచేశారు.

శాంతికుమారి ప్రస్తుతం అటవీశాఖలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే ముందు శాంతికుమారి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు శాంతికుమారి... కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులతో సీఎస్‌గా బీఆర్‌కే భవన్‌లో 3గంటల 15నిమిషాలకు శాంతికుమారి బాధ్యతలు స్వీకరించారు.

''సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు. తొలి మహిళా సీఎస్‌గా బాధ్యతల స్వీకరణ సంతోషకరం. ఎంతో నమ్మకంతో బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలు దేశానికే తలమానికం. ప్రాధాన్య కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాను.'' - శాంతికుమారి, నూతన సీఎస్‌

ఈ ఏడాది రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త సీఎస్‌ను నియమించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంతోపాటు ప్రస్తుతం సోమేశ్ కుమార్ చూస్తున్న రెవెన్యూ, వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, సీసీఎల్‌ఏ, గనులశాఖ బాధ్యతను ఇతర అధికారులకు అప్పగించాల్సిఉంటుంది. సీఎస్ ఎంపిక పూర్తైనందున సంబంధిత అంశాలపై సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

సోమేశ్‌కుమార్‌ను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు నిన్న సమర్థించిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు వెలువడిన కొన్ని గంటల వ్యవధిలోనే.. సోమేశ్‌కుమార్‌ తెలంగాణ నుంచి రిలీవ్‌ కావాలంటూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త సీఎస్‌ నియామకం అనివార్యం కాగా.. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసి శాంతికుమారి పేరును ఖరారు చేసింది. సీఎస్‌గా శాంతికుమారి 2025 వరకు పదవీలో కొనసాగనున్నారు.

ఇవీ చూడండి:

రేపు ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయనున్న సోమేశ్ కుమార్

Last Updated :Jan 11, 2023, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.