ETV Bharat / state

ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం ముప్పు

author img

By

Published : Oct 12, 2020, 7:36 AM IST

అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​ వ్యాప్తంగా జోరువానలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో జలాశయాలు జలకళ సంతరించుకోగా.. మరికొన్ని చోట్ల వర్షాలకు పంట నష్టం వాటిల్లింది. నేడు కూడా అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది.

heavy rains in ap
ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం ముప్పు

ముంచుకొస్తున్న తీవ్ర వాయుగుండం ముప్పు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్​లో పలు చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాను వానలు ముంచెత్తాయి. పెద్దవడుగూరు మండలం మిడుతూరులో ఎడతెరిపి లేని వానలకు వేరుశనగ, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గార్లదిన్నె మండలం కనుంపల్లిలోనూ వర్షంతో పంటలు దెబ్బతిన్నాయి. వర్ష ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ... దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఉరవకొండలోని ఐసీడీఎస్ కార్యాలయంలోకి భారీగా వర్షం నీరు చేరింది. సిబ్బంది నీటిని బయటకు ఎత్తిపోశారు. భారీ వర్షానికి పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి.

విశాఖ జిల్లా కోనాం జలాశయంలోకి ఎగువనుంచి వరద పోటెత్తుతోంది. అప్రమత్తమైన అధికారులు.. నీటిని దిగువకు వదులుతున్నారు. జలాశయంలో నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో.. 2 వేల 250 క్యూసెక్కుల నీటిని బొడ్డేరు నదిలోకి విడుదల చేశారు. దండిసురవరం సమీపంలో బొడ్డేరు నదిలో ఓ బాలుడు గల్లంతవ్వగా... ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అల్పపీడన ప్రభావంతో విశాఖ జిల్లాలో నేటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు, తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ సూచించారు.

చిత్తూరు జిల్లా పెనుమూరులోని ఎన్టీఆర్ జలాశయానికి భారీగా నీరు చేరుతోంది. ఇన్‌ప్లో ఎక్కువగా ఉండటంతో అధికారులు... మూడు గేట్లు ఎత్తి 600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. వాయుగుండం కారణంగా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు ప్రాంతాల్లో వర్షాలకు మిరప, పత్తి, మొక్కజొన్న పొలాల్లోకి నీరు చేరింది. పర్చూరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

ఇదీ చూడండి: మరో మూడు రోజుల పాటు వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.