ETV Bharat / state

New Zonal Policy: దంపతుల బదిలీల్లో వెసులుబాట్లు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

author img

By

Published : Jan 5, 2022, 7:26 AM IST

New Zonal Policy
దంపతుల బదిలీల్లో వెసులుబాట్లు

New Zonal Policy: ప్రభుత్వ ఉద్యోగ దంపతులలో ఒకరు దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఒకరు పనిచేసే చోటులో మరొకరికి లేదా కొత్త స్థలంలో ఇద్దరికీ పనిచేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించనుంది. దంపతుల బదిలీల్లో వెసులుబాట్లు చేస్తూ.. కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల, భార్యాభర్తల బదిలీలు, పోస్టింగుల కోసం అన్ని శాఖల్లో అంతర్గత కమిటీల ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చింది.

వరంగల్‌కు చెందిన కుమార్‌ ప్రభుత్వ ఉద్యోగి. ఆయన భార్య మాధురి మహబూబాబాద్‌లో ఉద్యోగినిగా ఉన్నారు. జోనల్‌ విధానంలో కేటాయింపుల్లో వేర్వేరు స్థానాలు దక్కాయి. ప్రభుత్వం దంపతుల బదిలీలకు అవకాశం కల్పించడంతో... మాధురి తన భర్త పనిచేసే వరంగల్‌లో పోస్టింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్‌లో ఖాళీ లేకపోవడంతో ఆమె బదిలీ సాధ్యం కాలేదు. ఈ తరుణంలో కుమార్‌ మహబూబాబాద్‌కు వెళ్లేందుకు అధికారులు అనుమతిస్తారు. అలా కుదరని పక్షంలో ములుగు లేదా భూపాలపల్లి జిల్లాలో ఇద్దరికీ ఖాళీ ఉంటే... వారిద్దరినీ అక్కడకు పంపుతారు.

New Zonal Policy: తెలంగాణలో నూతన జోనల్‌ విధానంలో భార్యాభర్తల (స్పౌస్‌) బదిలీల మార్గదర్శకాలపై రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేటగిరిలో ఉద్యోగ దంపతులలో ఒకరు దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఒకరు పనిచేసే చోటులో మరొకరికి లేదా కొత్త స్థలంలో ఇద్దరికీ పనిచేసే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధిపతులు, ముఖ్యకార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల స్పౌస్‌ కేటగిరీలో బదిలీ కోరుకునేవారికి మరింత వెసులుబాటు రానుంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా జోనల్‌, బహుళజోన్లకు సంబంధించి దాదాపు 6,500 వరకు దరఖాస్తులు వచ్చాయి. ఉదాహరణకు నిజామాబాద్‌లో పనిచేసే భార్య.. కామారెడ్డిలో పనిచేసే భర్త వద్దకు బదిలీ కోరుతున్నారు. ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువ భాగం ఇలాంటివే ఉన్నాయి. భార్య పనిచేసే చోటుకు భర్త బదిలీ కోరుతున్న వారి సంఖ్య తక్కువనే చెప్పాలి. ఈ ప్రాతిపదికన దాదాపు పది శాతం మందికే బదిలీలకు అవకాశం ఏర్పడుతోంది. ఈ విషయాన్ని టీఎన్జీవో, టీజీవో ఇతర ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. భార్యాభర్తల బదిలీలకు మరింత వెసులుబాటు కావాలని అభ్యర్థించారు. దీనిని పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఏం చేస్తారంటే..

  • ఒకరు అడిగినా చాలు బదిలీల ప్రక్రియ ప్రకారం భార్య దరఖాస్తు చేసుకుంటే ఆమె భర్త పనిచేస్తున్న చోట ఖాళీ ఉంటే బదిలీ అయ్యేందుకు అనుమతిస్తారు.
  • భార్య పనిచేసే చోటుకు వెళ్లాలని భర్త దరఖాస్తు చేసుకున్నారు... అక్కడ ఖాళీలేని పక్షంలో భర్త పనిచేసే చోటుకే భార్యను రప్పించే అవకాశాన్ని పరిశీలిస్తారు.
  • భార్యగానీ, భర్త గానీ పనిచేసే చోట్ల ఖాళీలు లేవు... ఇప్పుడు ఇద్దరినీ అవకాశం ఉన్న మరో కొత్త చోటుకు బదిలీ చేస్తారు.
  • భార్యాభర్తలైన ఉద్యోగుల బదిలీలకు విస్తృత అవకాశాలు కల్పించేందుకు వీలుగా... ముందుగా వారికి ఖాళీల సమాచారం ఇస్తారు. వారు దరఖాస్తు చేసుకున్నది గాక మరో రెండు అవకాశాలిస్తారు. ఈ మూడింటిలో ఒకదానికి ముందుకు వచ్చిన వారి బదిలీలకు ఆమోదం తెలుపుతారు.
  • తాజా వెసులుబాట్లతో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా బుధవారం వరకు ప్రభుత్వం గడువు పెంచింది. దీంతోపాటు తమ కేటాయింపులపై ఇంకా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారు కూడా బుధవారం వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అన్నిటినీ పరిశీలించి వెంటనే ఖాళీల్లో నియామకాలను ప్రభుత్వం చేపడుతుంది.
  • ఉద్యోగుల, భార్యాభర్తల బదిలీలు, పోస్టింగుల కోసం అన్ని శాఖల్లో అంతర్గత కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఇందులో ఆయా శాఖల ముఖ్య కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, సచివాలయ విభాగాధికారి, సహాయవిభాగాధికారి సభ్యులుగా ఉంటారు. ప్రతిపాదనలను పరిశీలించి, తనకు నివేదించాలని ప్రభుత్వం సూచించింది.

వెసులుబాట్లతో ఎంతో మేలు...

భార్యాభర్తలైన ఉద్యోగులకు ఒకేచోట పనిచేసేందుకు ప్రభుత్వం తాజాగా ఇచ్చిన వెసులుబాట్లు మేలుచేసేవిగా ఉన్నాయి. ఉద్యోగుల విన్నపాలపై స్పందించి 3 రకాల అవకాశాలను కల్పించడం ద్వారా ఎక్కువ మంది బదిలీలకు వీలవుతుంది. సీఎం కేసీఆర్‌కు ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు.

- టీఎన్జీవోల అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌

ఇదీ చూడండి: Dharani problems: తుదిదశకు ధరణి సమస్యల పరిష్కార కసరత్తు.. సీఎంకు ఉపసంఘం నివేదిక..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.