ETV Bharat / state

Fingerprint Theft Telangana : మీ వేలిముద్రలు భద్రమేనా.. ఓటీపీ లేకుండానే డబ్బులు మాయం

author img

By

Published : Aug 17, 2023, 2:17 PM IST

Aadhaar Enabled Payment System Scam
Fingerprint Theft Telangana

Fingerprint Theft Telangana : టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కడం శుభపరిణామమే. కానీ టెక్నాలజీతో పాటు సైబర్‌ దాడులు కూడా అంతే మొత్తంలో పెరుగుతున్నాయి. ఇందుకు తగిన అడ్డుకట్టలను పోలీసులు వేస్తున్న.. వారి ఆగడాలు మాత్రం తగ్గడం లేదు. రోజుకో కొత్తదారులను వెతుక్కుంటూ.. ఆధార్‌ వేలిముద్రలను కూడా విడిచిపెట్టడం లేదు. అసలు ఎలా గోప్యంగా ఉన్న ఆధార్‌ సమాచారాన్ని తస్కరిస్తున్నారనే దానిపై ప్రత్యేక కథనం.

Fingerprint Theft Telangana : సైబర్ నేరగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. రోజుకో రీతిలో కొత్త పంథాలో కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఇప్పుడు మోసగాళ్ల గురి.. వేలిముద్రలపై పడింది. వేలిముద్రలతో కూడిన పత్రాల్ని కొట్టేసి నకిలీలను సృష్టిస్తున్నారు. వాటి ఆధారంగా బ్యాంకు ఖాతాల్లోని సొమ్ము కాజేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకు సేవల్ని అందించేందుకు ఆర్‌బీఐ(RBI) ఆమోదించిన ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్(AePS)లోని లొసుగులే ఆధారంగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు.

Aadhaar Enabled Payment System Scam : హైదరాబాద్‌కు చెందిన ఓ సాప్ట్‌వేర్‌ ఇంజినీర్.. బ్యాంకు ఖాతాలో నుంచి ఇటీవల రూ.10వేలు వేరే ఖాతాకు బదిలీ అయిపోయాయి. వెంటనే 'యువర్ ఆధార్ ఐడెంటిఫికేషన్‌ ఈజ్ సక్సెస్‌ఫుల్‌' అని సెల్‌ఫోన్‌కు సంక్షిప్త సందేశం వచ్చింది. తన ప్రమేయం లేకుండానే సొమ్ము వేరే ఖాతాలో జమ కావడంతో అతను కంగుతిన్నారు. ఆధార్ బయోమెట్రిక్‌(Aadhaar Biometric)ను ఎలా వినియోగించారో తెలియక అయోమయానికి గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇవేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందల సంఖ్యలో బాధితులు ఈ తరహా మోసానికి గురవుతున్నారు.

Customer care Fraud Hyderabad : ఛాన్స్ దొరికితే చాలు.. లూటీ చేసేస్తున్నారు

Fingerprints Cloning to Clean Bank Accounts : ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్​లోని లొసుగులే ఆధారంగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ వ్యవస్థలో భాగంగా కస్టమర్ సర్వీస్ పాయింట్‌(CSP)ల ఏర్పాటుకు బ్యాంకులు అనుమతిస్తున్నాయి. ఒకరకంగా ఇవి మినీ బ్యాంకులుగా పనిచేస్తాయి. ఈ సీఎస్‌పీ ఏజెంట్లే బ్యాంకు ఖాతాదారులకు అవసరమైన నగదు బదిలీ లేదా ఉపసంహరణ ప్రక్రియల్ని పర్యవేక్షిస్తారు. ఉదాహరణకు ఎవరైనా బ్యాంకు ఖాతాదారుడికి రూ.10వేలు అవసరం ఉందనుకుంటే ఏజెంటే సమకూరుస్తాడు.

ఈ మేరకు ఏజెంట్లు.. పలు బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుని నగదు లావాదేవీలు నిర్వహిస్తారు. అయితే ఖాతాదారుడిని ధ్రువీకరించుకునేందుకు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ తీసుకుంటారు. ఖాతాదారు తన వేలిముద్రను ఏజెంట్ వద్ద గల యంత్రంలో వేస్తే.. ఆయన బ్యాంకు ఖాతాలోని నగదు వివరాలు ప్రత్యక్షమవుతాయి. అలా బ్యాంకు లావాదేవీల్ని ఏజెంట్లు నిర్వహిస్తారు. ఈ తరహాలో ప్రభుత్వరంగ బ్యాంకులు రూ.10వేల వరకు, ప్రైవేటురంగ బ్యాంకులు రూ.10లక్షల వరకు ఏఈపీఎస్‌ లావాదేవీలను అనుమతిస్తున్నాయి.

Cyber Attacks With Aadhaar Biometric : సైబర్ నేరగాళ్లు తెలివిగా.. సీఎస్‌పీ ఏజెంట్లుగా అవతారమెత్తారు. ఈక్రమంలో బ్యాంకు ఖాతా, పాన్, ఆధార్, మొబైల్ నంబర్ తదితర కేవైసీ వివరాల ధ్రువీకరణ పత్రాల్ని డబ్బుల కోసం అమ్మేవారిని ఎంచుకున్నారు. ఏజెంట్‌గా నమోదు చేసుకునేందుకు.. కరెంట్ ఖాతా అవసరం తప్పనిసరి కాకపోవడం.. కంపెనీ రిజిస్ట్రేషన్ చేయాలనే నిబంధన లేకపోవడం.. దరఖాస్తు సమయంలో ఈ ఏజెంట్ల గురించి ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేసే వ్యవస్థ లేకపోవడం మోసగాళ్లకు కలిసివస్తోంది. ఈ తరహా అక్రమ లావాదేవీల నిర్వహణకు ఆధార్‌ నంబర్‌తోపాటు బయోమెట్రిక్ ఆథెంటికేషన్ అవసరముంటుంది.

ప్రభుత్వ శాఖల్లోని లావాదేవీలపై నేరగాళ్ల కన్ను : ఈ వివరాలు సంపాదించేందుకు ప్రభుత్వశాఖల్లోని లావాదేవీలపై మోసగాళ్లు కన్నేశారు. ముఖ్యంగా భూవిక్రయ లావాదేవీలే లక్ష్యంగా ఆయా శాఖల వెబ్‌సైట్లలోకి అక్రమంగా ప్రవేశించారు. భూదస్త్రాల్లోని వేలిముద్రల(Fingerprints Theft) పత్రాల్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. సాధారణంగా యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తోనే ఈ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యే అవకాశముంటుంది. కానీ కొన్ని శాఖల్లో గెస్ట్‌గా లాగిన్ అయ్యే అవకాశముండటంతో ఆ లొసుగును ఆసరాగా చేసుకొని పత్రాల్ని కాజేస్తున్నారు. ఈ భూదస్త్రాల్లోని వేలిముద్రల ప్రింట్‌ను సేకరించేందుకు నేరస్థులు బటర్‌ పేపర్‌ను వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

Cyber Frauds in Sangareddy District : 'పార్ట్​టైం జాబ్ కావాలా'.. అంటూ మెసేజ్ వచ్చిందా.. ఐతే జాగ్రత్తగా ఉండాల్సిందే

Fingerprint Theft in Telangana 2023 : ప్రింట్‌ను తొలుత బటర్‌ పేపర్‌పైకి తీసుకుని గాజు గ్లాస్‌పై ముద్రిస్తారు. దానిపై రబ్బర్ పోస్తే.. పాలీమర్ ప్రింట్ తయారవుతుంది. అదే నకిలీ వేలిముద్రగా మారుతుంది. బయోమెట్రిక్ యంత్రంలో ఆ నకిలీ వేలిముద్రల్ని పెట్టి బాధితుడి బ్యాంకు ఖాతాలోని నగదు కాజేస్తున్నారు. సైబర్ నేరస్థులు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్‌మెంట్‌.. ఐజీఆర్‌ఎస్‌లోని భూలావాదేవీల దస్త్రాలు కాజేశారు. ఐజీఆర్‌ఎస్‌ వెబ్‌సైట్‌లోనూ పలు లొసుగుండటం గమనార్హం. వీటి ఆధారంగానే తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు మోసాలకు తెర లేపారు. రూ.14.64 లక్షల్ని నేరస్థులు ఇలా కాజేసినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ వెబ్‌సైట్‌ను బలోపేతం చేశారు.

1930 టోల్‌ఫ్రీ నంబర్‌ కాల్‌ చేస్తే చాలు : మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బోగస్ ఏజెంట్లు.. సుమారు లక్ష మంది ఫింగర్ ప్రింట్లతో 22వేల మంది ఆధార్ వివరాల్ని కాజేసినట్లు కడప పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ-ఆధార్ వినియోగించి బాధితుడి ఖాతాలోని డబ్బు కాజేస్తే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ లోకి వెళ్లి అందులో ఫిర్యాదు చేయాలి. ఒకవేళ బాధితుడి ప్రమేయం లేకుండా డబ్బు పోతే చాలా ఉదంతాల్లో ఫిర్యాదు చేసిన 45 రోజుల్లోపు తిరిగి జమ చేస్తున్నారు.

Investment Fraud Case Update : పెట్టుబడుల పేరుతో మోసం చేసిన కేసులో మరో నిందితుడు అరెస్ట్​.. ముఠా వెనుక చైనీయులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.