ETV Bharat / state

Crop Loss: చేతికొచ్చిన పంట.. నోటికందేలోపే.. అంతా వర్షార్పణం

author img

By

Published : Apr 27, 2023, 10:26 AM IST

Farmers Crop Loss
Farmers Crop Loss

Crop Loss Due To Untimely Rains: రైతులు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట వరుణుడి ప్రకోపానికి బలైంది. రూ.వేలు పెట్టుబడి పెట్టి పండించిన పంట చేతికందే దశలో నేలరాలింది. వర్షానికి వడ్ల రాశులు తడిసి ముద్దవుతున్నాయి. పొద్దంతా తడిసిన ధాన్యాన్ని ఎండకి ఆరబెట్టడం.. సాయంత్రానికి మళ్లీ వర్షం రావడంతో కర్షకులు కష్టాలు పడుతున్నారు.

Crop Loss Due To Untimely Rains: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గత నెలలో అకాల వర్షాలు కురవగా.. పంటలు దెబ్బతినడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పరిశీలించడమే కాకుండా ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ప్రకటించారు. అయితే వరుసగా మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా మళ్లీ పంటలు దెబ్బతిన్నాయి. వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా ప్రకారం.. అన్ని పంటలు కలిపి 66 వేల 987 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. కరీంనగర్‌, రామడుగు, సైదాపూర్‌, చొప్పదండి తదితర మండలాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

అకాల వర్షం.. నేలరాలిన మామిడి: ప్రభుత్వానికి త్వరితగతిన నివేదిక ఇస్తామని రైతన్నలకు భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని ఎండబెట్టుకోవడానికే సమయం సరిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈదురుగాలుల కారణంగా జగిత్యాల జిల్లాలో మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోతకు వచ్చిన మామిడి నేలరాలింది. పెద్దపల్లి జిల్లాలో 14 వేల 620 ఎకరాల్లో పంట నీటి పాలైంది. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల వద్ద సరైన టార్పాలిన్లు లేకపోవడంతో ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది.

రైతు తన పంట చేతికందే సమయంలో అకాల వర్షాలతో పంట మొత్తం నష్టపోవడం చాలా బాధకరం. మొత్తం నీటి పాలైంది. ఎకరానికి క్వింటాల్ కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యం మొత్తాన్ని మేమే కొనుగోలు చేస్తాం. తడిసిన ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. - గంగుల కమలాకర్, మంత్రి

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా?: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ భరోసానిచ్చారు. చేతికొచ్చిన పంట.. నోటికందేలోపే అకాల వర్షం నీటి పాలు చేసింది. తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదోననే ఆందోళనలో రైతన్నలు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.

నేను 6 ఎకరాలు వరి వేశాను. మొదటి పెట్టుబడి రూ.లక్షా 80 వేల దాకా అయింది. పంట కోశాక రూ.మూడున్నర లక్షల దాకా వస్తాయని ఆశ పడ్డాను. ఆశలన్నీ అడుగంటినట్టుగా అయిపోయింది. మాకు ఏం గతిలేకుండా గింజలు మొత్తం రాలిపోయాయి. - ఓ రైతు

అకాల వర్షాలు.. కల్లాల్లో తడిసిన వడ్లు.. అన్నదాతల ఇక్కట్లు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.