illegal sand mining in mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లాలో ఫిల్టర్ ఇసుక మాఫియా పెట్రేగుతోంది. నిషేధమని తెలిసినా అక్రమార్కులు ఏమాత్రం జంకకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. వాగుల వెంట ఉన్న మట్టిని రాత్రిళ్లు ట్రాక్టర్లతో తరలించుకుపోతున్నారు. పొలాల వద్ద వ్యవసాయ బోర్ల నీటితో, చెక్ డ్యామ్ నీటితో ట్రాక్టర్లలో ఉన్న మట్టిని ఫిల్టర్ చేసి ఇసుక తీస్తున్నారు. ఫిల్టర్ ఇసుకను నిర్మాణుష్య ప్రాంతాల్లో కుప్పలుగా పోసి రాత్రిళ్లు టిప్పర్ల ద్వారా భవన నిర్మాణాల కోసం పట్టణాలకు రవాణా చేస్తున్నారు. మూడు పువ్వులు- ఆరు కాయలుగా సాగుతున్న దందాకి నాయకులు, అధికారులు మద్దతిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టిప్పరు ఇసుకకు 18 వేల నుంచి 20 వేలు, ఇసుక ట్రాక్టర్‌కి 3వేల500 చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు.
ఇసుక తరలింపుతో కోతకు గురవుతున్న పొలాలు: మహబూబ్ నగర్ మండలం కోటకదిర వాగు కేంద్రంగా రోజూ లక్షల్లో ఇసుక దందా సాగుతోంది. రాంచంద్రాయపల్లి మొదలు ఓబులాయపల్లి, కోటకదిర మీదుగా దేవరకద్ర చెరువుతో అనుసంధానమై ఉన్న కోటకదిర వాగు 10 కిలోమీటర్ల పొడవునా ఉంటుంది. చాలాకాలంగా అక్రమార్కులు వాగులో మట్టిని రవాణా చేసి ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారు. ఫిల్టర్ ఇసుక తయారీదారులు రోజూ వాగు నుంచి వాహనాలతో మట్టిని తరలిస్తుండడంతో తమ పొలాలు కోతకు గురవుతున్నాయని ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ బోర్లలో నీటిమట్టం పడిపోతోందని, వాహనాల వల్ల పొలం గట్లు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిల్టర్ ఇసుక తయారీని అరికట్టి తమ పొలాలు, వాగును పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇటీవల అధికారులు దాడులు చేసి ఇసుక డంపులను స్వాధీనం చేసుకొని తెల్ల ముగ్గు వేశారు. అయినప్పటికీ రాత్రికి రాత్రే అక్రమార్కులు ఆ ఇసుకను సైతం తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అక్రమదందాకు అడ్డుకట్ట వేయాలి: కోటకదిర వాగు, గుండ్లకుంట, మాచన్‌పల్లి ఆర్వోబీ పరిసరాలు, ఓబులాయపల్లి పొలాల వెంట ఫిల్టర్ ఇసుక తయారీ దందాను ముగ్గురు వ్యక్తులు నడుపుతున్నారు. కోటకదిరకు చెందిన ఇద్దరు ఇసుక దందాకు ఆటంకాలు రాకుండా రెవెన్యూ, పోలీసు సిబ్బంది, రామచంద్రాపూర్‌కు చెందిన వ్యక్తి ప్రజాప్రతినిధుల పరంగా వ్యవహారాలు చక్కబెడుతారని సమాచారం. మీడియాలో కథనాలు వచ్చినప్పుడు వారంపాటు పొక్లెయిన్లు, టిప్పర్లు, ట్రాక్టర్లు కనిపించవు. వారం, పది రోజుల తర్వాత మళ్లీ దందా ప్రారంభిస్తుంటారు. ఈ అక్రమదందాకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు నామమాత్రంగా దాడులు నిర్వహించి ఆ తర్వాత పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: