ETV Bharat / state

tpcc: టీపీసీసీ అధ్యక్ష వేడి: ఎంపికపై వీడని ఉత్కంఠ.. త్వరలో క్లారిటీ!

author img

By

Published : Jun 20, 2021, 9:47 AM IST

తెలంగాణ ​పీసీసీ నూతన అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా ఈ ఎంపికపై రసవత్తర చర్చ సాగుతోంది. ఎవరికి వారు తమకే పీసీసీ పదవి వస్తుందని ధీమాతో ఉండగా ఏఐసీసీ స్థాయిలో కసరత్తు వేగవంతమైంది. నూతన అధ్యక్షుడితో సహా పీసీసీ కార్యవర్గాన్ని ఏ క్షణంలో అయినా ప్రకటించవొచ్చన్న ఉత్కంఠ పార్టీ వర్గాల్లో నెలకొంది.

tpcc, telangana congress
టీపీసీసీ, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. నూతన అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఏకాభిప్రాయంతో అధ్యక్షుడి ఎంపిక జరగాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్న ఏఐసీసీకి రాష్ట్ర సీనియర్ నాయకుల నుంచి అడుగడునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ముందే కొత్త పీసీసీ ప్రకటన జరగాల్సి ఉండగా మాజీ మంత్రి జానారెడ్డి లేఖతో ఆగింది. అప్పట్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చకు వచ్చింది. సాగర్ ఉపఎన్నిక తర్వాత పీసీసీ అధ్యక్షుడి ఎంపిక… కార్యవర్గ కూర్పు జరగాల్సి ఉందని ప్రచారం జరిగింది. సామాజిక సమీకరణాల వల్ల కొంత ఆలస్యమైనట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో పార్టీ నాయకత్వంలో తలెత్తిన సమస్యలతో టీపీసీసీ ఎంపిక పూర్తి చేయడంలో అధిష్ఠానం జాప్యం చేసింది.

బలాబలాలపై నివేదిక సిద్ధం

తాజాగా పీసీసీ అధ్యక్షుడు ఎంపిక అంశం మరొకసారి తెరపైకి వచ్చింది. గడిచిన మూడు, నాలుగు రోజులుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్, ఏఐసీసీ ఇంఛార్జీలు బోసురాజు, శ్రీనివాసన్ కృష్ణన్​లు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకులకు ఫోన్ చేసి పీసీసీ, కార్యవర్గ కూర్పునకు అభిప్రాయాలు తెలుసుకున్నారు. పీసీసీ అధ్యక్షుడి కోసం పోటీపడుతున్న వారితోపాటు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలతో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముఖ్య నేతల అభిప్రాయలనూ నివేదిక తయారు చేసి నివేదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీసీసీ పదవిని ఆశిస్తున్న వారి జాబితాను రాష్ట్ర ఇంఛార్జీ మాణికం ఠాగూర్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి పార్టీతో ఉన్న అనుబంధం, బలాలు, బలహీనతలు అన్ని వివరాలతో కూడిన నివేదిక తయారైనట్లు తెలుస్తోంది.

రేవంత్ రెడ్డికి అనుకూలం?

ఎంపీ రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి అయినందున పీసీసీ పదవి ఆయనకు ఇవ్వొద్దని కొందరు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నవారికే అధ్యక్ష పదవి ఇవ్వాలన్న డిమాండ్ ప్రధానంగా ఉంది. కానీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాల ఆధారంగా మాణికం ఠాగూర్ ఎంపీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా నివేదిక ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇప్పటి వరకు ఉన్న పీసీసీ అధ్యక్షుడు రెడ్డి సామాజిక వర్గం అయినందున ఇతర సామాజిక వర్గ నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆలోచన ఏఐసీసీలో వస్తే ప్రత్యామ్నాయంగా ఎమ్మెల్యే శ్రీధరబాబు, మాజీ ఎంపీ మధుయాష్కీల వివరాలతో నివేదిక సిద్ధంగా ఉంచినట్లు సమాచారం.

త్వరలో ఏకాభిప్రాయం

టీపీసీసీ కార్యవర్గం ప్రకటనతో నాయకుల్లో అసమ్మతి బయట పడకుండా సలహా కమిటీ, కార్యనిర్వాహక కమిటీ, స్ట్రాటజీ కమిటీ, ఎన్నికల కమిటీ వంటి రకరకాల కమిటీలతో అన్ని సామాజిక వర్గాల నేతలకు చోటు కల్పించాలన్న ఆలోచన ఏఐసీసీలో ఉన్నట్లు సీనియర్ నేతలు చెబుతున్నారు. నేతల అభిప్రాయాలను బేరీజు వేసుకుని సోనియా, రాహుల్ గాంధీలు ఏకాభిప్రాయానికి వచ్చి త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: TPCC: పీసీసీ అధ్యక్ష పదవిపై ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు ఏమన్నారంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.