ETV Bharat / state

రయ్​.. రయ్​.. 'వందే భారత్​'కు సర్వం సిద్ధం.. ఇక నుంచి ఆ ఆరు రోజులు బుల్లెట్​స్పీడ్​తో..

author img

By

Published : Jan 13, 2023, 11:12 AM IST

Vande Bharat Express
Vande Bharat Express

Vande Bharat Train: తెలుగు రాష్ట్రాల మధ్య మొదటి వందేభారత్ ఎక్స్​ప్రెస్ పరుగులు పెట్టనుంది. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 15న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్​లో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది.

Vande Bharat Train: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పరుగులకు సర్వం సిద్ధమైంది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఈ నెల 15వ తేదీన ఉదయం 10 గంటలకు 10వ ప్లాట్‌ఫాం నుంచి ఈ రైలు పరుగందుకోనుంది. రాత్రి 8.30 గంటలకు విశాఖపట్నం చేరుతుందని అంచనా. తొలుత వరంగల్‌, విజయవాడ, రాజమండ్రిలో మాత్రమే ఆగుతుందని అనుకున్నా ఖమ్మంలోనూ ఆపాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఉత్తరాంధ్ర వాసుల అవసరాలు తీర్చేలా: హైదరాబాద్‌ నుంచి ఉత్తరాంధ్రకు జిల్లాలకు వెళ్లాలంటే.. రైళ్లలో ఎప్పుడూ బెర్తులు దొరకని పరిస్థితి ఉంటుంది. 4 నెలల ముందు బెర్తుల రిజర్వేషన్‌ ప్రారంభమైనా కొద్ది రోజులకే రైళ్లు నిండిపోతుంటాయి. రోజూ ప్రయాణించే 9 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు తోడు.. వారంలో 1, 2, 3 రోజులు నడిచే ప్రత్యేక రైళ్లున్నా, అన్నింటిలోనూ నిరీక్షణ జాబితా చాంతాడంత కన్పిస్తుంటుంది. ఈ తరుణంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రావడాన్ని నగర ప్రయాణికులు స్వాగతిస్తున్నారు.

వారంలో 6 రోజులే.. ఆదివారం నడవదు: ప్రారంభ రోజు మినహా..మిగతా రోజుల్లో విశాఖపట్నం నుంచి ఉదయం 5.45 గంటలకు వందేభారత్‌ రైలు బయలుదేరి మధ్యాహ్నం 2.25 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. మధ్యాహ్నం 2.45 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి రాత్రి 11.25 గంటల సమయంలో విశాఖపట్నం చేరుతుందని ప్రాథమికంగా అందిన సమాచారం. వారంలో 6 రోజులే నడుస్తుంది. ఆదివారం నడవదని షెడ్యూలులో వెల్లడించారని వరంగల్‌ రైల్వే కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వామి తెలిపారు.

తొలి కూత అక్కడే: తొలుత ‘ట్రైన్‌-18’కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌(1.0)గా నామకరణం చేశారు. 2019 ఫిబ్రవరి 15న దిల్లీ-వారణాసి మధ్య తొలి రైలును ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.. 2022 సెప్టెంబర్‌ 30న గాంధీనగర్‌ - ముంబయి వందేభారత్‌ 2.0 ట్రైన్‌ను ప్రారంభించారు. 2022 నాటికే 45 రైళ్లను తయారు చేయాలని నిర్ణయించకున్నారు. కరోనా కారణంగా అది నెరవేరలేదు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌.. 2022 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతూ త్వరలో 400 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను తయారు చేస్తామని పేర్కొన్నారు.

ఈ రైళ్ల కోసం కావాల్సిన 36 వేల చక్రాలను తయారు చేసేందుకు భారత్‌.. ఉక్రెయిన్‌కు ఆర్డర్‌ ఇచ్చింది. అయితే ఉక్రెయిన్‌ - రష్యా యుద్ధం కారణంగా వాటి రాక ఆలస్యమైంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన భారత్ చెక్‌ రిపబ్లిక్‌, పోలండ్‌, మలేసియా, చైనా, అమెరికా దేశాల్లోని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. మన దేశంలోని స్టీల్‌ అథారిటీతో 1లక్ష చక్రాలు తయారు చేయాలని ఒప్పందం చేసుకుంది. దుర్గాపూర్‌ స్టీల్‌ప్లాంట్ యూనిట్‌లో వాటి ఉత్పత్తి జరుగుతోంది.

ఇవీ చదవండి: తొలిసారి విశాఖ చేరుకున్న ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’.. విశేషాలివే..

సమస్యలు వదిలేయండి.. సామరస్యంగా సాగండి.. ఠాక్రే పిలుపు

కరెన్సీ నోట్ల భద్రత పోగు సరఫరాలో అవినీతి!.. కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శిపై CBI కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.