ETV Bharat / state

ఇట్స్‌ ఓటర్‌ టైం - శాసనసభ ఎన్నికల్లో అసలైన ఘట్టానికి రంగం సిద్ధం

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 7:08 PM IST

Updated : Nov 29, 2023, 6:08 AM IST

EC Polling Arrangements in Telangana : శాసనసభ ఎన్నికల్లో అసలైన ఘట్టానికి రంగం సిద్ధమైంది. ప్రచారపర్వం ముగియడంతో ఇక పోలింగ్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2,290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3కోట్ల 26 లక్షలకు పైగా ఓటర్లు తేల్చనున్నారు. ఓటింగ్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఈసీ.. ప్రలోభాల కట్టడికి తగిన చర్యలు చేపట్టింది.

EC Focus on Arrangements of Telangana Polling
EC Observation Telangana State Wide

ఇట్స్‌ ఓటర్‌ టైం- శాసనసభ ఎన్నికల్లో అసలైన ఘట్టానికి రంగం సిద్ధం

EC Polling Arrangements in Telangana : రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకొంది. అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ నెల మూడో తేదీన నోటిఫికేషన్ వెలువడగా.. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించారు. 15వ తేదీన అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ఇవాళ్టితో ప్రచారం పరిసమాప్తమైంది. శాసనసభ ఎన్నికల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో 2,068 మంది పురుషులుండగా.. 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రారంభమవుతుంది. పోలింగ్ కంటే 90 నిమిషాలు ముందు అనగా.. ఉదయం 5 గంటల 30 నిమిషాలకు మాక్‌పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. 13 నియోజకవర్గాల్లో 30న సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగియనుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఈ జాబితాలో ఉన్నాయి. మిగతా 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారపర్వం - రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లోకి

"ఈవీఎంలు, ఎన్నికల పోలింగ్​ సామాగ్రి అంతా బుధవారం ఆ యా కేంద్రాలకు వెళ్తోంది. ప్రస్తుతం ఆ ఏర్పాట్లలోనే ఉన్నాం. 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో పురుషులు 2,068, మహిళలు 221, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు."- వికాస్‌రాజ్‌ , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

EC Focus on Arrangements of Telangana Polling : రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస సదుపాయాలన్నింటినీ ఏర్పాటు చేస్తున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి రవాణా సదుపాయంతో పాటు ప్రతి చోటా ఉండేలా 21,686 వీల్ ఛైర్లు సిద్ధం చేశారు. 80 ఏళ్లు పైబడిన వారికి కూడా ఉచిత రవాణా సదుపాయం ఉంటుంది. బ్రెయిలీ లిపిలోనూ ఓటరు స్లిప్పులు, నమూనా బ్యాలెట్లు ముద్రించారు. ఓటింగ్ శాతాన్ని పెంచే కసరత్తులో భాగంగా స్థానిక సంస్కృతిని ప్రతిబింబిస్తూ.. 644 మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

Voters in Telangana : 120 కేంద్రాలను దివ్యాంగులు, 597 కేంద్రాలను మహిళలు నిర్వహించనున్నారు. లక్షా 85వేల మంది పోలింగ్ సిబ్బంది.. 22వేల మంది మైక్రో అబ్జర్వర్లు, స్క్వాడ్స్, ఇతరులు మొత్తం కలిపి 2లక్షలకు పైగా పోలింగ్ విధుల్లో ఉండనున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3కోట్ల 26లక్షల 2వేల 799 ఉన్నాయి. వీరిలో పురుషులు కోటి 62లక్షల 98వేల 418 మంది కాగా.. మహిళలు కోటి 63లక్షల 17వంద 5 మంది ఓటర్లున్నారు. ట్రాన్స్‌జెండర్లు ఓటరు జాబితాలో 2వేల 676 మంది ఉన్నారు. సర్వీసు ఓటర్ల సంఖ్య 15వేల 406 కాగా.. ప్రవాస ఓటర్లు 2వేల 944 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయస్సు వారు 9లక్షల 99వేల 667 మంది ఉన్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది.

ప్రలోభాలకు తావులేకుండా విసృత తనిఖీలు - 24 గంటలు నిఘా : సీఈవో వికాస్ రాజ్

Polling Ballots in Telangana : పోలింగ్ కోసం ఈవీఎంలను ఎన్నికల అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని 59వేల 779 బ్యాలెట్ యూనిట్లను పోలింగ్ కోసం వినియోగిస్తున్నారు. గరిష్ఠంగా ఎల్బీనగర్‌లో 4 బ్యాలెట్ యూనిట్లు వాడనున్నారు. రిజర్వ్ బ్యాలెట్ యూనిట్లు కలిపి మొత్తం 72,931 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉండనున్నాయి. 56వేల 592 కంట్రోల్ యూనిట్లు వినియోగిస్తారు. ఈవీఎంలు తీసుకెళ్లే ప్రతి వాహనానికి, తనిఖీ బృందాల వాహనాలకు జీపీఎస్​ సౌకర్యం ఏర్పాటు చేశారు.

రాష్ట్రంలో 12వేల 311 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27వేల 51 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం ఏర్పాటు చేయనున్నారు. ఒకటికి మించి పోలింగ్ బూత్‌లు ఉన్న కేంద్రాల వద్ద బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. పోటీ తీవ్రంగా, గొడవకు అవకాశం ఉన్న చోట ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని, శాంతి భద్రతల సమస్యలు రాకుండా చూసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు.

అసెంబ్లీ సమరానికి తెలంగాణ సై - పోలింగ్ ఏర్పాట్లలో బిజీబిజీగా ఈసీ

EC Observation Telangana State Wide : మద్యం సరఫరా, పంపిణీ, నిల్వలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఎక్సైజ్ శాఖకు స్పష్టం చేశారు. పోలింగ్‌కు ముందు చివరి 48 గంటల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో ఇంటింటి ప్రచారం చేసుకునే అవకాశం ఉండగా.. ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఇతర నియోజకవర్గాలు, ప్రాంతాల వారు వెళ్లిపోవాల్సి ఉంటుంది. హోటళ్లు, లాడ్జ్‌లు, ఫంక్షన్ హాళ్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని క్షేత్రస్థాయి అధికారులు, పోలీసులను ఈసీ ఆదేశించింది. అంతరాష్ట్ర సరిహద్దుల్లోనూ తనిఖీలు మరింత కట్టుదిట్టం చేశారు.

RS.724 Crore EC Collect in Telangana : శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన అక్టోబర్ తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటివరకు తనిఖీల్లో మొత్తం రూ.724 కోట్లు విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.292 కోట్లు నగదు, రూ.122 కోట్ల విలువైన మద్యం, రూ.39 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.186 కోట్ల విలువైన బంగారం, ఇతర ఆభరణాలు, రూ.83 కోట్ల విలువైన ఇతర కానుకలు ఉన్నాయి. ప్రచారపర్వం ముగియడంతో ప్రలోభాలకు అవకాశం ఉన్నందున వాటి కట్టడిపై యంత్రాంగం దృష్టి సారించనుంది.

సమయం లేదు మిత్రమా - అసెంబ్లీ పోలింగ్​కు ఈసీ చకచకా ఏర్పాట్లు

Last Updated :Nov 29, 2023, 6:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.