ETV Bharat / state

Dharani problems: ధరణి లావాదేవీల్లో గందరగోళం.. స్లాట్ల నమోదు, రిజిస్ట్రేషన్లలో కొత్త సమస్యలు

author img

By

Published : Feb 1, 2022, 7:11 AM IST

Dharani problems: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ సమస్యలు తీర్చేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సతాయిస్తోంది. సోమవారం మరో కొత్త సమస్య తెరమీదికొచ్చింది. రైతుల ఖాతాల్లో డబ్బులు కోతపడినా ఎక్కడికెళ్లాయో తెలియని పరిస్థితి నెలకొంది. మరోపక్క మంగళవారం నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమలుకానుండటంతో తమకు పాతధరలు వర్తిస్తాయో లేదోనన్న అయోమయంలో ఉన్నారు.

dharani portal problems
ధరణి పోర్టల్ సమస్యలు

Dharani problems: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, వారసత్వ బదిలీ, గిఫ్ట్‌ డీడ్‌ తదితర లావాదేవీల్లో స్తబ్దత నెలకొంది. అయిదు రోజుల నుంచి ధరణి పోర్టల్‌ సతాయిస్తుండగా సోమవారం కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. రైతుల ఖాతాల నుంచి డబ్బులు కోతపడగా అవి ఎక్కడికి వెళ్లాయో తెలియకుండానే సైట్లు మూతపడ్డాయి. మరోపక్క మంగళవారం నుంచి కొత్త మార్కెట్‌ విలువలు అమలుకానుండటంతో తమకు పాతధరలు వర్తిస్తాయో లేదో అనే సందిగ్ధంలో వీరున్నారు. అయితే అదనపు చెల్లింపులు తప్పవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. జనవరి 25వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్లకు స్లాట్ల నమోదులో ఆటంకాలు ప్రారంభమయ్యాయి. మీసేవా, ఆన్‌లైన్‌ ద్వారా స్లాట్లు తీసుకోవడంతో గంటల తరబడి జాప్యం చోటు చేసుకుంది. మీసేవా కేంద్రాల ద్వారా చేసిన స్లాటు బుకింగ్‌లలో కొన్ని జిల్లాల్లో పేమెంట్స్‌ ప్రక్రియ పూర్తయినా లావాదేవీ సంఖ్యను సూచించే విండో తెరుచుకోలేదు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కొంపల్లి సమీపంలో ఓ భూమికి సంబంధించి అయిదు లావాదేవీలకు చెల్లింపులు చేసి స్లాటు నమోదు చేయగా, రూ.లక్ష మొత్తానికి సంబంధించిన ఒక స్లాటు మధ్యలోనే నిలిచిపోయింది. డబ్బులు ఎక్కడికి పోయాయనేది తెలియలేదు. దీంతో అతను ధరణి టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేసి ఆరాతీశారు. అయినప్పటికీ సోమవారం రాత్రి వరకు సమాచారం లేకపోవడంతో అయోమయంలో పడ్డారు. ఇదే తరహాలో జిల్లాల్లో పలు చోట్ల స్తంభించిపోవడంతో గందరగోళం చోటుచేసుకుంది.

ధరలు సవరించినపుడు గతంలోనూ ఇదే స్థితి

Dharani registration problems: భూముల మార్కెట్‌ విలువను పెంచే నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌లో మార్పుల కోసమే ధరణి పోర్టల్‌ నెమ్మదించి ఉండొచ్చని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన వెలువడనప్పటికీ గతేడాది సెప్టెంబరులో భూముల మార్కెట్‌ ధరలు సవరించిన సమయంలో ఇదే పరిస్థితి ఎదురైందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 477 తహసీల్దారు- సంయుక్త సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాల్లో పెద్ద ఎత్తున స్లాట్లు నిలిచిపోయాయి. సోమవారం కొంత వరకు సాఫ్ట్‌వేర్‌ కనికరించినా తక్కువలో తక్కువ ఒక్కోచోటగ ఇరవై వరకే రిజిస్ట్రేషన్లు జరిగినట్లు చెబుతున్నారు. కొత్త మార్కెట్‌ ధరలు అమల్లోకి వస్తే పాత ధరలు అమల్లో ఉన్న సమయంలో నమోదు చేసుకున్న స్లాట్లు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని రైతులు, భూ యజమానులు కోరుతున్నారు. ఇప్పటికే డబ్బులు కూడా తమ ఖాతాల నుంచి కోతపడిన నేపథ్యంలో పాత ధరలు వర్తించేలా చూడాలంటున్నారు. అయితే, ఇప్పటికే నిలిచిపోయిన స్లాట్లకు గతంలో మాదిరి సవరించిన ధరలు అమల్లోకి వచ్చాక పెరిగినంత మేరకు అదనపు చెల్లింపులు చేస్తే ప్రక్రియ పూర్తయ్యేలా అవకాశం ఇవ్వొచ్చని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.