ETV Bharat / state

DENGUE: కోరలు చాస్తున్న డెంగీ.. ఏజెన్సీని వణికిస్తున్న మలేరియా

author img

By

Published : Aug 16, 2021, 6:56 AM IST

DENGUE
కోరలు చాస్తున్న డెంగీ

తెలంగాణ మొత్తం మీద ఈ ఏడాది 898 మంది డెంగీ బారినపడ్డారు. కరోనా గురించి జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలో చాపకింద నీరులా డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. ప్రధానంగా గత 5 వారాలుగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లుగా వైద్యఆరోగ్యశాఖ వెల్లడించిన అధికారిక గణాంకాలను బట్టి అర్థమవుతోంది. గత 5 వారాల వ్యవధిలోనే 614 మంది డెంగీ బారినపడ్డారంటే... దీని తీవ్రత ఎంతవరకు ఉందో తెలుస్తోంది.

రాష్ట్రంలో డెంగీ కోరలు చాస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌పై ‘ఈడిస్‌ ఈజిప్టై’ దోమ విరుచుకుపడుతోంది. గతేడాది ఆగస్టు 9 వరకూ హైదరాబాద్‌లో 296 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇదే తేదీ నాటికి 329 కేసులు నిర్ధారణ అవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. ఈ సంవత్సరం జనవరి 1 నుంచి ఆగస్టు 9 వరకూ గణాంకాలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌ సహా రంగారెడ్డి(87), కరీంనగర్‌(73), మేడ్చల్‌ మల్కాజిగిరి(67), ఆదిలాబాద్‌(54), భద్రాద్రి కొత్తగూడెం(33), నిర్మల్‌(34), నిజామాబాద్‌(32) జిల్లాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రం మొత్తమ్మీద 898 మంది ఈ వ్యాధి బారినపడ్డారు. ప్రధానంగా గత 5 వారాలుగా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లుగా వైద్యఆరోగ్యశాఖ వెల్లడించిన అధికారిక గణాంకాలను బట్టి అర్థమవుతోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్‌ 30 వరకూ ఆర్నెల్ల కాలంలో 284 మంది డెంగీ బారినపడి చికిత్స పొందగా.. ఒక్క జులై నెలలోనే 317 మంది.. ఈ నెలలో(ఆగస్టు) కేవలం 9 రోజుల వ్యవధిలోనే 297 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. అంటే కేవలం గత 5 వారాల వ్యవధిలోనే 614 మంది డెంగీ బారినపడినట్లుగా తెలుస్తోంది.

ఈ ఏడాదిలో మలేరియా ఇలా..

రాష్ట్రంలో మలేరియా జ్వరాలూ ప్రబలుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలను వణికిస్తోంది. ఈఏడాదిలో ఇప్పటి వరకూ మొత్తంగా 490 మలేరియా కేసులు నమోదవగా.. ఇందులో గత నెలలో(జులై) 120 మంది, ఈ నెల 9 నాటికి 46 మంది.. గత 5 వారాల్లోనే 166 మంది కొత్తగా ఈ జ్వరం బారినపడినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ మొత్తం 213 మందికి, ములుగులో 121, జయశంకర్‌ భూపాలపల్లిలో 38, కుమురంభీం ఆసిఫాబాద్‌లో 25, వరంగల్‌ నగర జిల్లాలో 22 మందికి సోకింది.

ఫీవర్‌ ఆసుపత్రికి రోజూ అయిదారొందల జ్వర పీడితులు

ఒక పక్క సాధారణ వైరల్‌ జ్వరాలు.. మరోవైపు డెంగీ, మలేరియా జ్వరాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు బాధితుల తాకిడి పెరిగింది. హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆసుపత్రికి రోజూ సుమారు 500-600 వరకూ జ్వరాలతో ఓపీకి వస్తున్నారని వైద్యవర్గాలు తెలిపాయి. గత నెల రోజులుగా తరచూ వర్షాలు అధికంగా కురవడం, వాతావరణం చల్లబడడం.. పారిశుద్ధ్య నిర్వహణ లోపం.. వెరసి దోమలు వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా జ్వరాలతో బాధపడుతున్నవారి సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లుగా వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. సాధారణంగా ఏడాది మొత్తమ్మీద అన్ని నెలల కంటే సెప్టెంబరులో అత్యధిక జ్వరాలు నమోదవుతాయని వైద్యవర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న నెలలో డెంగీ, మలేరియా కేసులు మరింత అధికంగానమోదయ్యే అవకాశాలున్నాయి. అసలు వ్యాధుల సీజన్‌ ముందున్న క్రమంలో ఇప్పటి నుంచే నివారణ చర్యలపై దృష్టిపెట్టాల్సిన అవసరముందని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

యుద్ధప్రాతిపదికన ముందస్తు చర్యలు

కోరలు చాస్తున్న డెంగీ
డాక్టర్‌ అమర్‌సింగ్‌, అదనపు సంచాలకులు

అన్ని శాఖల సమన్వయంతో దోమల నిర్మూలనకు, రక్షిత తాగునీరు అందించేందుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నాం. 5 లక్షల ర్యాపిడ్‌ కిట్లను క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచాం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 4,84,308 తెరలను పంపిణీ చేశాం. ప్రతి శుక్రవారం నిల్వ నీటిని తొలగించడం.. పరిసరాలను శుభ్రపర్చుకోవడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. ప్రజలు కూడా తమ పరిసరాల ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

-డాక్టర్‌ అమర్‌సింగ్‌, అదనపు సంచాలకులు, ప్రజారోగ్య విభాగం.

నివారణ ఇలా...

డెంగీ కారక ‘ఈడిస్‌ ఈజిప్టై’ దోమ అన్ని దోమల్లాంటిది కాదు. పగటిపూటే కుడుతుంది. మంచినీటిలోనే పుడుతుంది.. పెరుగుతుంది.. సంతతిని వృద్ధి చేస్తుంది. పగిలిపోయిన చిన్నముంతలో ఒక వారం రోజులు కదపకుండా దోసెడు నీరున్నా చాలు. అందులో పునరుత్పత్తి ప్రక్రియ కొనసాగిస్తుంది. అందుకే ఇంట్లో, కార్యాలయాల్లో ఎక్కడైనా నీటి నిల్వలున్నాయా అని దృష్టిపెట్టాల్సిన అవసరముంది. మలేరియా దోమ మురుగునీటిలో వృద్ధి చెందుతుంది. అందుకే పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇదీ చూడండి: ncb raids: ఇళ్ల మధ్యలోనే ల్యాబ్​.. ఏళ్లుగా మత్తు పదార్థాల తయారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.