ETV Bharat / crime

ncb raids: ఇళ్ల మధ్యలోనే ల్యాబ్​.. ఏళ్లుగా మత్తు పదార్థాల తయారీ

author img

By

Published : Aug 16, 2021, 5:00 AM IST

హైదరాబాద్‌లో నివాస ప్రాంతాల మధ్య ఓ ఇంట్లో కొనసాగుతున్న ల్యాబ్‌లో నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు సోదాలు చేశారు. తనిఖీలో 3.25 కిలోల అల్ప్రాజోలం 12.75 లక్షల నగదు, పెద్ద ఎత్తున ముడి పదార్థాలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఓ ముఠాను అధికారులు అరెస్టు చేశారు.

ncb raids
ncb raids

హైదరాబాద్​ బాలానగర్‌లోని ఓ ఇంట్లో ల్యాబ్‌ నిర్వహిస్తూ అల్ప్రజోలం తయారు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో బెంగళూరు, హైదరాబాద్‌ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నివాస ప్రాంతాల మధ్య కొనసాగుతున్న ల్యాబ్‌ చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. గత అయిదేళ్లుగా ఈ ముఠా... నిషేధిత మత్తు పదార్థం తయారు చేసి పలువురికి సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు.

ఇలా బయటపడింది..

కారులో మత్తు పదార్థాలు తరలిస్తున్నట్టు సమాచారం అందుకున్న అధికారులు హైదరాబాద్‌, మెదక్‌ రహదారిపై ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా గుట్టు రట్టయింది. నిషేధిత మత్తు పదార్థాలు తయారు చేస్తున్న అయిదుగురు సభ్యుల ముఠాను నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. అధికారుల దాడుల్లో 3.25 కిలోల అల్ప్రజోలంతో పాటు 12.75 లక్షల నగదు, రెండు కార్లు, పెద్ద ఎత్తున మత్తు పదార్థ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.

ఇంట్లోనే ల్యాబ్​

బాలనగర్​కు చెందిన సుధాకర్‌, నరేశ్​, కుమార్‌, శ్రీకాంత్‌, పామర్తి కలిసి ఈ దందా కొనసాగిస్తున్నట్టు అధికారుల విచారణలో తేలింది. నివాస ప్రాంతాల మధ్య ల్యాబ్‌ కొనసాగుతున్నట్టు గుర్తించారు. నిందితుడు సుధాకర్‌ నివాసంలో ల్యాబ్‌ ఏర్పాటు చేసి దర్జాగా అల్ప్రాజోలం తయారు చేస్తున్నట్టు దర్యాప్తులో వెలుగు చూసింది. తయారైన మత్తు పదార్థాన్ని నిందితులు పలువురికి సరఫరా చేస్తున్నట్టు విచారణలో తేలింది. అయితే ఇతర రాష్ట్రాలకు కూడా అల్ప్రాజోలం సరఫరా చేస్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుడు పామర్తి వేరుగా మరో ల్యాబ్‌ నిర్వహిస్తున్నాడు. అయితే అతనికి ల్యాబ్‌ నడపడానికి అనుమతులు ఉన్నాయి. అయితే నిబంధనలు అతిక్రమించి అల్ప్రాజోలం తయారు చేస్తున్నట్లు విచారణలో తేలింది.

మరింత సమగ్రంగా విచారణ

నిందితులు ఇంకా ఎక్కడైనా ల్యాబ్‌లు కొనసాగిస్తూ మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారా..? దీనిని ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు అనే అంశాలపై అధికారులు కూలంకషంగా విచారణ జరుపుతున్నారు.

ఇదీ చూడండి: accident : లారీని ఢీకొన్న పెళ్లి బస్సు.. 30 మందికి తీవ్ర గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.