ETV Bharat / state

67కోట్ల మంది డేటా ఒక్కడే చోరీ చేశాడా..! అసలు నిందితులు ఎవరు?

author img

By

Published : Apr 4, 2023, 6:51 AM IST

data theft case
data theft case

Data theft case update: వ్యక్తిగత డేటా చౌర్యం వెనుక చాలా పెద్దముఠాలే ఉన్నాయని సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. దేశంలోని దాదాపు 67 కోట్ల మంది వ్యక్తిగత వివరాలు సేకరించిన కేసులో అసలు సూత్రధారి ఎవరనే కోణంలో ఆరాతీస్తున్నారు. ఇప్పటికే అరెస్టయిన నిందితుడు వినయ్‌ భరద్వాజ్‌ వెనుక భారీ నెట్‌వర్క్‌ ఉందని.. అతని తరహాలోనే మరింత మంది దగ్గర డేటా ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

వ్యక్తిగత డేటా చౌర్యం కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు

Data theft case update: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డేటాచౌర్యం కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ చౌర్యం వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయంపై ప్రధానంగా దృష్టిసారించారు. దాదాపు 67 కోట్ల మంది డేటా సేకరించిన కేసులో హర్యానాకి చెందిన వినయ్‌భరద్వాజని ఇప్పటికే పోలీసులు అరెస్టుచేశారు. సాధారణంగా ఒకే వ్యక్తి ఇంత పెద్దఎత్తున డేటా చౌర్యం చేయడం సాధ్యంకాదని సైబర్‌క్రైమ్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

వివిధ వ్యక్తులు, అనేక మార్గాల ద్వారా డేటా సేకరించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. నిందితుడు వినయ్‌భరద్వాజ్‌ గతంలో వెబ్‌డిజైనర్‌గా పనిచేసేవాడు. అతనికి సాంకేతిక పరిజ్ఞానంపై బాగా పట్టున్నట్లు దర్యాప్తులో తేలింది. కొందరు వ్యక్తుల నుంచి సమాచారం కొని మిగిలింది వివిధ వెబ్‌సైట్లను హ్యాక్‌చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సమాచారం కొట్టేసేందుకు అవకాశమున్న వెబ్‌సైట్లను గుర్తిస్తున్నారు. డేటాచౌర్యం కేసులో ఇప్పటికే 11 సంస్థలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

రేపటి నుంచి మూడురోజుల్లోగా ఆయాసంస్థలు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. వినియోగదారులు, ఖాతాదారుల డేటా ఎలా లీకైంది..? భద్రతా వైఫల్యం ఎక్కడ జరిగింది..? లేక సంస్థలో పనిచేసే ఉద్యోగులే దొడ్డిదారిలో సమాచారాన్ని అమ్ముకుంటున్నారా..? అనే సమాచారాన్ని సంస్థల నుంచి రాబడతామని అధికారులు స్పష్టంచేస్తున్నారు. వివిధ సంస్థల నుంచి సమాచారం లీకవ్వడం లేదా.. ఉద్దేశపూర్వకంగా బయటవారికి విక్రయించినట్లు తేలితే ఏం చేయాలనే అంశంపై అధికారులు చర్చించినట్లు తెలిసింది. ఒకవేళ ఇంటిదొంగలపనైతే వారిని కేసులో నిందితులుగా చేరుస్తారు. డేటాఎవరెవరికి విక్రయించారు? ఆ సమాచారం వినయ్‌ భరద్వాజ్‌కు ఎలా చేరిందని అంశం వెలుగులోకి వస్తుందని చెబుతున్నారు.

Person past data theft case: డేటా విక్రయించేందుకు నిందితుడు రూపొందించిన ఇన్‌స్పైర్‌ వెబ్స్‌ వెబ్‌సైట్‌ను సైబరాబద్ పోలీసులు బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ కామర్స్‌ సంస్థల తరహాలో ఆ వెబ్‌సైట్‌ ఉంది. ఆర్డర్‌పై క్లిక్‌ చేసి డబ్బు చెల్లించగానే మెయిల్‌కు క్లౌడ్‌లింక్ పంపేలా తయారుచేశాడు. గత ఎనిమిది నెలల్లో ఆ వెబ్‌సైట్‌ ద్వారా డేటా కొన్న వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరెవరు ఎంత డబ్బు చెల్లించి ఏయే సమాచారాన్ని కొన్నారు..? వారి వివరాలన్ని ఈ వెబ్‌సైట్‌లో ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు.

బ్యాంకులు, కంపెనీలకు నోటీసులు: ఈ కేసులో ఇప్పటికే పలు బ్యాంకులు, ఐటీ కంపెనీలు , ఓటీటీ సంస్థలకు పోలీసులు నోటీసులు జారీచేశారు. నోటీసులు అందుకున్న వాటిలో బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, యాక్సిస్‌ బ్యాంకులు.. టెక్‌ మహీంద్రా వంటి పలు కంపెనీలు ఉన్నాయి. వాటితో పాటుగా బిగ్‌ బాస్కెట్‌, ఫోన్‌పే, ఫేస్‌బుక్‌, పాలసీ బజార్‌ సహా పలు కంపెనీలకు నోటీసులు జారీచేశారు. క్లబ్‌ మహీంద్ర, మాట్రిక్స్‌, అస్ట్యూట్‌ గ్రూప్‌లకు నోటీసులు ఇచ్చి డేటా లీకేజీకి సంబంధించి వివరణ కోరారు.

ఇవీ చదవండి:

DATA చోరీ కేసులో ఎస్బీఐ, ఫోన్‌పే, ఫేస్‌బుక్‌ సహా పలు కంపెనీలకు నోటీసులు

వ్యక్తిగత డేటా చోరీ కేసు.. రంగంలోకి దిగిన ఈడీ

TSPSC పేపర్ లీకేజీ ఎఫెక్ట్‌.. ఆ పరీక్షనూ వాయిదా వేయాలని డిమాండ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.