ETV Bharat / state

Covid: 10 జిల్లాల్లో కరోనా ఉద్ధృతి... నియంత్రణకు సర్కార్ చర్యలు

author img

By

Published : Jun 1, 2021, 4:51 AM IST

Corona
కరోనా ఉద్ధృతి

రాష్ట్రంలో కొవిడ్‌ (Covid) విజృంభణ కాస్త మందగించినా.. ప్రధానంగా 10 జిల్లాల్లో ఇంకా ఉద్ధృతి తగ్గలేదు. ఏప్రిల్‌ తొలి వారం నుంచి మే రెండో వారం వరకు కరోనా (Corona)ఒక్కపెట్టున విరుచుకుపడగా.. గత రెండు వారాలుగా కేసులు క్రమేణా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే పాజిటివిటీ ఎక్కువగా ఉన్న 10 జిల్లాల్లో పరీక్షలను భారీగా నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించేందుకు ఉన్నతాధికారులు పర్యటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అవసరమైతే హెలికాప్టర్‌ను ఉపయోగించుకోనైనా విస్తృత పర్యటనలు చేపట్టాలని స్పష్టం చేసింది.

తొలిదశ నుంచి పరిశీలించినా.. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో ఎప్పుడూ మిగిలిన జిల్లాల కంటే పెద్దసంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పుడూ అదే తీరు! రాష్ట్రంలోని 20 జిల్లాల్లో కేసుల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గుముఖం పట్టింది. 10 జిల్లాల్లో మాత్రం నేటికీ రోజుకు సగటున 100కి పైగా కొత్త పాజిటివ్‌లు నిర్ధరణ అవుతున్నాయి. పరిస్థితి తీవ్రతను ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ (Cm kcr) సమీక్షించారు. ఈ జిల్లాల్లో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో అవసరమైతే ఉన్నతాధికారుల బృందాలూ క్షేత్రస్థాయికి వెళ్లాలని ఆయన స్పష్టీకరించడంతో ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వైరస్ విజృంభణకు ముకుతాడు...

తీవ్రత కలిగిన జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ ద్వారా వైరస్‌ విజృంభణకు ముకుతాడు వేయాలని వైద్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. కార్యాచరణ కట్టుదిట్టం మార్చిలో మొదలైన కొవిడ్‌ రెండోదశ ఉద్ధృతి ఏప్రిల్‌ నెలాఖరుకు పతాక స్థాయికి చేరుకుంది. ఒక దశలో ఒక్క రోజులోనే 10వేలకు పైగా కొత్త కేసులు నిర్ధరణయ్యాయి. మే 9 వరకూ రోజుకు సుమారు 5వేల కొత్త పాజిటివ్‌లు నమోదయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోతుందనే ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వం గత నెల 12 నుంచి లాక్‌డౌన్‌ అమల్లోకి తెచ్చింది. మే 6 నుంచి ఇంటింటి సర్వేను ప్రారంభించింది. కొవిడ్‌ (Covid)ప్రత్యేక ఓపీని నిర్వహిస్తోంది.

కిట్ల అందజేత...

తొలి విడత ఇంటింటి సర్వేల కోటికి పైగా ఇళ్లను వైద్యసిబ్బంది పరిశీలించారు. 2.18 లక్షల మందిలో లక్షణాలను గుర్తించి, ఉచితంగా ఔషధ కిట్లను అందజేశారు. రెండో విడత సర్వేలో ఇప్పటికే 65 లక్షలకు పైగా గృహాలను పరిశీలించారు. లక్ష మందికి పైగా కిట్లను అందజేశారు. ఇక కొవిడ్‌ ఓపీలోనూ సుమారు 14 లక్షల మందిని పరిశీలించారు. వీరిలో దాదాపు 3 లక్షల మందిలో కొవిడ్‌ (Covid) లక్షణాలు గుర్తించి కిట్లను అందజేశారు.

వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట...

లాక్‌డౌన్‌ (Lockdown) ఫలితంగా ఎక్కువమంది ఇళ్లకే పరిమితం కావడంతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది.. మరోవైపు జ్వర సర్వే, ప్రత్యేక ఓపీల ద్వారా కిట్ల పంపిణీతో బాధితులకు వేగంగా చికిత్స అందించినట్లయింది. కొవిడ్‌ అని ప్రత్యేకంగా నిర్ధారించకున్నా.. లక్షణాలున్న వారంతా ఔషధాలను వాడాలని సూచించగా సానుకూల ఫలితమే లభించిందని వైద్యవర్గాలు తెలిపాయి. అందుకే రాష్ట్రంలో దాదాపు 20 జిల్లాల్లో ప్రస్తుతం రోజుకు సగటున 30-50 కంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయని భావిస్తున్నాయి.

తొలి నుంచి భారీగానే...

ఆదిలాబాద్‌, కామారెడ్డి, నారాయణపేట, నిర్మల్‌ తదితర జిల్లాల్లో 20 కంటే తక్కువ సంఖ్యలో కొత్త పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. పరీక్షల సంఖ్య రెట్టింపు గత వారంలో కేసుల నమోదు సరళిని పరిశీలిస్తే.. మే 24 నుంచి 31 వరకూ జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 3,645 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 1,449, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 1,373 కొత్త పాజిటివ్‌లు తేలాయి. ఇవి రాజధాని, పరిసర జిల్లాలు కావడంతో తొలి నుంచీ భారీగానే కేసులు నమోదవుతున్నాయి.

10 జిల్లాల్లోనూ...

ఇవే తేదీల్లో ఖమ్మం, నల్గొండ, కరీంనగర్‌, సూర్యాపేట, పెద్దపల్లి, వరంగల్‌ నగర, మహబూబ్‌నగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, మహబూబాబాద్‌ జిల్లాల్లోనూ కరోనా పంజా విసురుతూనే ఉంది. 2 వారాల కిందట నాగర్‌కర్నూల్‌, యాదాద్రి జిల్లాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో.. అక్కడా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణను అమలు చేసింది. ఫలితంగా పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందని వైద్యవర్గాలు తెలిపాయి. ఇదే విధానాన్ని ఇప్పుడు ఈ 10 జిల్లాల్లోనూ అమలుచేయాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.

మరింత విస్తృతం...

ఇంటింటి సర్వేను, ప్రత్యేక కొవిడ్‌ ఓపీ సేవలను మరింత విస్తృతం చేయాలని ఆదేశాలిచ్చింది. ఒకవేళ ఇంటి వద్ద ప్రత్యేక వసతులు లేకుంటే స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాల్లో బాధితులకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించింది. తద్వారా బాధితుల నుంచి కుటుంబ సభ్యులకు వ్యాపించే అవకాశాలు తగ్గుతాయి. కొవిడ్‌ పరీక్షలను రెట్టింపు చేయాలనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో రోజుకు 50-60 వేల వరకూ పరీక్షలు చేస్తుండగా.. సాధారణ రోజుల్లో 85వేల నుంచి లక్ష వరకూ నిర్వహిస్తున్నారు. ఈ సంఖ్యను లక్షన్నర వరకూ పెంచాలనీ, ప్రధానంగా 10 జిల్లాల్లో పరీక్షలను భారీగా నిర్వహించాలని ఆరోగ్యశాఖ ఆదేశించింది.

హెలికాప్టర్‌ వినియోగించుకోనైనా...

క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించేందుకు ఉన్నతాధికారులు పర్యటించాలనీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అవసరమైతే హెలికాప్టర్‌ను ఉపయోగించుకొనైనా విస్తృత పర్యటనలు చేపట్టాలని స్పష్టీకరించినట్లుగా వైద్యవర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే సోమవారం నల్గొండ జిల్లా హాలియా, నాగార్జునసాగర్‌లలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు డా.జి.శ్రీనివాసరావు పర్యటించారు. మంగళవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి, మధిరలతో పాటు సూర్యాపేట జిల్లాలోనూ వారు హెలికాప్టర్‌ పర్యటనలు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి: Corona:రాష్ట్రంలో కొత్తగా 2,524 కరోనా కేసులు, 18 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.