ETV Bharat / state

CM KCR Review : 'వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడమే మా ప్రభుత్వ లక్ష్యం'

author img

By

Published : Jun 19, 2023, 4:15 PM IST

Updated : Jun 19, 2023, 9:06 PM IST

CM KCR
CM KCR

16:10 June 19

CM KCR Review : 'రైతులకు నీరు అందించేందుకు ఎంత ఖర్చయినా పర్వాలేదు'

CM KCR Review Meeting with Ministers : రుతుపవనాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వానాకాలం పంట సాగునీటి సరఫరాకు ముందస్తు చర్యల కోసం మంత్రులు, ప్రజాప్రతినిధులు, నీటిపారుదలశాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలు, మిషన్ భగీరథ అవసరాలను సీఎం ఆరా తీశారు. వాతావరణ శాఖ అంచనాల మేరకు జూలై మొదటి వారం వరకు వర్షాభావ పరిస్థితులు నెలకొని ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ సూచించారు.

CM KCR Latest Updates : వర్షాభావ పరిస్థితుల రోజుల్లో సాగునీటి కోసం నీటిని విడుదలకు కొద్ది రోజుల పాటు విరామం ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. జూలై మొదటి వారంలో వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలు, తదితర అంశాలను సమీక్షించుకొని, పరిస్థితులకు అనుగుణంగా సముచిత నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని జలాశయాల్లో నీటి నిల్వ వివరాలను కేసీఆర్ ఆరా తీశారు. ప్రస్తుతం రంగనాయక సాగర్​లో మూడు టీఎంసీలకుగాను 0.69 టీఎంసీల నిల్వ మాత్రమే ఉన్నాయని ఇంజనీర్లు తెలిపారు. రంగనాయక సాగర్​కు రెండు టీఎంసీల నీటిని మధ్యమానేరు జలాశయం నుంచి తక్షణమే ఎత్తిపోయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తద్వారా రంగనాయక సాగర్ జలాశయం కింద ఆయకట్టుకు వానాకాలం పంటకు నీరు అందించేందుకు వీలవుతుందని అన్నారు.

ఈ ఏడాది మల్లన్నసాగర్‌లో మరో 10 టీఎంసీలు నింపాలి : ప్రస్తుతం నిజాంసాగర్ జలాశయంలో ఉన్న 4.95 టీఎంసీల నీటి నిల్వలు ఆగష్టు చివరి వరకు మూడు తడులకు సరిపోతాయని... ఆ తర్వాత మరో మూడు తడులకు 5 టీఎంసీలు అవసరమని ఇంజనీర్లు సూచించారు. ఇందుకోసం ఆగష్టులో 5 టీఎంసీలను కొండపోచమ్మ సాగర్ ద్వారా నిజాం సాగర్​కు తరలించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆగష్టు నెలలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలను సమీక్షించుకొని, కొరత ఏర్పడిన పక్షంలో పునరుజ్జీవన పథకం ద్వారా 30 నుంచి 35 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయాలని నిర్ణయించారు. మల్లన్నసాగర్​లో ఈ ఏడాది మరో పది టీఎంసీలు నింపాలని నిర్ణయించారు. వానాకాలం ముగిసి జలాశయాల్లోకి ఇన్ ఫ్లో ఆగిపోయిన తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో కాళేశ్వరం వద్ద గణనీయంగా గోదావరి నదుల్లో ప్రవాహాలు ఉంటాయని... రెండో పంట అవసరాల కోసం ఆ నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల్లో తగినంత స్థాయిలో నింపాలని నిర్ణయించారు.

పైసలు పోయినా ఫర్వాలేదు పంటలు కాపాడాలి : ఈ ఏడాది ఏర్పడినటువంటి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు నీటిపారుదలశాఖ సన్నద్ధంగా ఉండాలని కేసీఆర్ సూచించారు. తాగునీటి అవసరాలకు నీటిని మధ్యమానేరు నుంచి గౌరవెల్లి జలాశయంలో కూడా ఎత్తిపోయాలని సీఎం అధికారులకు సూచించారు. తెలంగాణ వ్యవసాయాన్ని రైతాంగాన్ని కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. పైసలు పోయినా ఫర్వాలేదు పంటలు కాపాడాలని అధికారులను ఆదేశించారు.

అవసరమైన అన్ని పనులు త్వరగా పూర్తి చేయండి : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను సమీక్షించిన సీఎం కేసీఆర్... సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఆగస్టు చివరి నాటికి తాగునీటి కోసం నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్దండాపూర్ జలాశయాల్లోకి నీటిని ఎత్తిపోయాలని, అవసరమైన అన్ని పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తున్న గుత్తేదార్ల నుంచి పనులు తొలగించి సమర్థులైన వారికి అప్పగించాలని సూచించారు. వార్ధా బ్యారేజీ ప్రాజెక్టు పరిపాలన అనుమతి కోసం 4252 కోట్లకు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించినట్లు ఈఎన్సీ మురళీధర్ తెలిపారు. కేంద్ర జలసంఘంలో వార్ధా బ్యారేజి డీపీఆర్ పరిశీలన ప్రారంభమైనందున త్వరలో ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్​ను కోరారు. ప్రాజెక్టుకు పరిపాలన అనుమతి ప్రక్రియను పూర్తి చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated :Jun 19, 2023, 9:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.