ETV Bharat / state

ఏపీ సర్కార్​కు షాక్​.. రూ.982 కోట్లు వెనక్కి తీసుకున్న కేంద్రం

author img

By

Published : Dec 7, 2022, 9:41 AM IST

Central govt take back GST Funds from AP : ఆర్థిక కష్టాలు అతలాకుతలం అవుతున్న ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రం ఊహించని షాక్‌ ఇచ్చింది. ఇటీవలే జీఎస్టీ వాటాగా ఇచ్చిన నిధులతో పాటు వివిధ హెడ్‌ల కింద మంజూరు చేసిన 982 కోట్ల రూపాయలను పాత బకాయిల కింద.. వెనక్కు తీసేసుకుంది. అసలే జీతాలు, పింఛన్లు చెల్లించలేని దుస్థితిలో ఉన్న రాష్ట్రప్రభుత్వం.. కేంద్రం నిర్ణయంతో తలలు పట్టుకుంటోంది. జీతాలు పింఛన్లు ఎలా చెల్లించాలనే దానిపై మల్లగుల్లాలు పడుతోంది.

ap state government
ఏపీ ప్రభుత్వం

ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్న ఆంధ్రప్రదేశ్​

Central govt take back GST Funds from AP : ఇతరత్రా రూపాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి ఇచ్చిన 982 కోట్ల రూపాయలను.. కేంద్రం వెనక్కి తీసేసుకుంది. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రభుత్వానికి.. వస్తాయన్న నిధులు రాకపోయేసరికి ఊపిరి ఆడటం లేదు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ప్రతినెలా జీఎస్టీ వాటా నిధులు విడుదల చేస్తుంది. ఇటీవల అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చిన మొత్తంలో 682కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సి ఉంది. ఇవికాకుండా 300 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇస్తున్నట్లు వర్తమానం అందినా అవేవీ చేరలేదు. రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులను ఆరా తీయగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి పాత బకాయిలు రావాల్సి ఉన్నాయని.. ఆ మొత్తాన్ని సర్దుబాటు చేసుకున్నారనే సమాచారం అందింది.

రాష్ట్ర ఖజానాకు ఏ రోజు ఎంత మొత్తం ఏ రూపంలో వచ్చిందో ప్రతిరోజూ రిజర్వుబ్యాంకు నుంచి ప్రభుత్వానికి సమాచారం అందుతుంది. అందులో రాష్ట్ర ఆదాయం, అప్పులు, చెల్లింపులు, కేంద్రం నుంచి ఏ రూపంలో ఎంత మొత్తం చేరిందో వివరంగా ఉంటుంది. ఆర్థికశాఖలోని ఒకరిద్దరు ఉన్నతాధికారులకు మాత్రమే ఈ సమాచారం తెలుస్తుంది. కేంద్రం నిధులు విడుదల చేసినట్లు ఉత్తర్వులు వెలువడినా.. ఆ మొత్తాలు జమ కాలేదని గమనించిన ఉన్నతాధికారులు ఆరా తీయగా పాత బకాయిల పేరుతో మినహాయించినట్లుగా తేలింది. వాటిని మళ్లీ కేంద్రం నుంచి తెచ్చుకునే అంశం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జీతాలు చెల్లించలేని పరిస్థితిలో ఏది ఎలా సర్దుబాటు చేయాలో అర్థంకాక ఆర్థిక యంత్రాంగం తలలు పట్టుకుంటోంది.

ఏపీ రాష్ట్రం అసలే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఎవరికి, ఎప్పుడు జీతం వస్తుందో, ఎప్పుడు పింఛన్‌ అందుతుందో చెప్పలేని పరిస్థితి. ఈనెల 15వ తేదీ వచ్చేవరకు కూడా కొన్ని విభాగాల చొప్పున జీతాలు జమ చేయాల్సిన దుస్థితి. ఇలాంటి సంకట పరిస్థితుల్లో, కేంద్రం తానిచ్చిన 982 కోట్లను మినహాయించుకోవడం పెద్ద షాకే.

రాష్ట్రంలో ఉద్యోగులు, పింఛనుదారులు జీతాల కోసం రోజూ ఎదురుచూస్తున్నారు. అవి అందక, ఈఎంఐలు చెల్లించలేక, ఇతరత్రా అవసరాలు తీర్చుకోలేక అల్లాడుతున్నారు. ప్రస్తుతానికి ప్రతి రోజూ కొందరికి జీతాలను చెల్లిస్తున్నారు. రాష్ట్రంలో ఇంకా 2,900 కోట్ల రూపాయలు పింఛన్లు, జీతాలు కలిపి చెల్లించాలి. అందరికీ చెల్లింపులు పూర్తయ్యేసరికి ఈ నెల 15వ తేదీ దాటుతుందనేది అంచనా. రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్లోలో రుణం తీసుకోవాలంటే దానికీ పరిమితులు ఉన్నాయి. ఇప్పటికే ఏపీ తన పరిమితిని దాటేసింది. అంటే ఈ నెల అప్పు కూడా పుట్టదు. ఇక రోజువారీ వసూళ్లతోనే జీతాలు, పింఛన్లు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.