ETV Bharat / state

పట్టభద్రుల పోరులో అభ్యర్థుల ఓట్ల వేట

author img

By

Published : Mar 4, 2021, 8:50 PM IST

రాష్ట్రంలోని ఆరు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార, విపక్షాలకు చెందిన నేతలు ప్రజాక్షేత్రంలో నువ్వానేనా అన్నట్లు పోటీపడుతున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా పార్కులకు ఉదయపు నడకకు వచ్చే పట్టభద్రులను కలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి ఆశీర్వదించాలంటూ అభ్యర్థిస్తున్నారు. అన్ని పార్టీల తరఫున అగ్రనేతలు ముందుండి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

పట్టభద్రుల పోరులో అభ్యర్థుల ఓట్ల వేట
పట్టభద్రుల పోరులో అభ్యర్థుల ఓట్ల వేట

శాసనమండలి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి ప్రజలకు సేవ చేసే వారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టభద్రుల ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం ప్రజలను మోసం చేస్తూ.. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ.. ఉద్యోగాలు లేకుండా చేస్తోందని హైదరాబాద్‌ సనత్‌నగర్‌లో తలసాని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు.. ఎల్లప్పుడూ ముందుంటానని అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్సీగా గెలిపించాలని వాణీదేవి ఓటర్లను అభ్యర్థించారు.

దగా చేస్తోన్న ప్రభుత్వం...

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు సాధనలో భాజపా, తెరాస వైఫల్యం చెందాయని విమర్శించారు. వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయం, జిల్లా న్యాయస్థానంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వర్సిటీల్లో సమస్యలు పరిష్కరించకుండా విద్యార్థులను ప్రభుత్వం దగా చేస్తోందని మండిపడ్డారు.

బెదిరించడమేంటీ...

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్​ రావు తప్పుబట్టారు. మంత్రులు ఉద్యోగులను బెదిరించడం ఏంటని.. మహబూబ్‌నగర్ ప్రచారంలో రాంచందర్​ రావు ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రభుత్వం యువతను దగా చేస్తోందని... భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండిపడ్డారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో పాల్గొన్న ఆయన... ప్రభుత్వోద్యోగులకు పీఆర్సీ ఏమైందని ప్రశ్నించారు.

సమర్థులకే ఓటు...

భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో తెరాస శాసనమండలి అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉదయం నడకకు వచ్చిన వారిని కలిసి ఓట్లు అభ్యర్థించారు. వామపక్షాలు బలపరుస్తున్న అభ్యర్థి జయ సారథిరెడ్డి ఇల్లందులో విస్తృత ప్రచారం చేపట్టారు.

సమర్థులకే ఓటు వేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పట్టభద్రులను ఉపాధ్యాయులు కోరారు. శుక్రవారం ములుగు బహిరంగసభలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొననున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ములుగు జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ప్రస్తావించనున్నట్లు నేతలు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.