ETV Bharat / state

BJP: భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా 'ప్రజా సంగ్రామ యాత్ర'

author img

By

Published : Aug 27, 2021, 6:14 PM IST

BJP: భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా 'ప్రజా సంగ్రామ యాత్ర'
BJP: భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా 'ప్రజా సంగ్రామ యాత్ర'

తెలంగాణలో భాజపాను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో నిర్వహించే పాదయాత్ర ద్వారా తెరాస సర్కారు హామీలు, వైఫల్యాలు, కేంద్రం రాష్ట్రానికి చేసిన సాయం, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల చేసిన అనంతరం బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. తొలి విడత ప్రజా సంగ్రామ యాత్ర రేపటి నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 35 రోజుల పాటు సాగనుంది.

అధికార తెరాసకు ప్రత్యామ్నాయం భాజపా మాత్రమేనని చెబుతూ వస్తున్న కమలనాథులు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే ఉద్దేశంతో పాదయాత్ర చేయాలని భావించారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న భాజపాను గ్రామీణ ప్రాంతాల్లోనూ పటిష్టం చేసి 2023 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఈ పాదయాత్ర ద్వారా తెరాస ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఏడేళ్ల ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టనున్నారు. కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన నిధులు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. రేపు ప్రారంభమయ్యే బండి సంజయ్ పాదయాత్రను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పార్టీ జాతీయ నాయకులు హాజరుకానున్నారు.

ముమ్మరంగా ఏర్పాట్లు

దుబ్బాక, బల్దియా ఎన్నికల్లో అనుకూల ఫలితాలు సాధించడంతో కమలనాథులు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వస్తోన్న కాషాయదళం ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్‌ అవినీతి కుటుంబ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడమే లక్ష్యమంటోంది. హుజూరాబాద్‌ వరకు సాగే పాదయాత్ర కోసం ఇప్పటికే ముమ్మర ఏర్పాట్లు చేశారు. పాదయాత్రలో భాగంగా జనసమీకరణ, ప్రచారం, బస, సభలు, ప్రోటోకాల్‌, సోషల్‌ మీడియా, లీగల్‌ సెల్‌, రూట్‌ మ్యాప్​కు సంబంధించి మొత్తం 29 కమిటీలను నియమించారు. ఈ కమిటీల్లో మాజీమంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్‌ నేతలను భాగస్వామ్యం చేశారు. అక్టోబర్ 2న హుజూరాబాద్‌ గడ్డపై భారీ బహిరంగ సభతో తొలి విడత పాదయాత్ర ముగియనున్నట్లు పార్టీ రాష్ట్ర నాయకత్వం తెలిపింది. ఈ ముగింపు సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను రప్పించాలని భావిస్తోంది.

చార్మినార్​ వద్ద ప్రారంభమై..

చార్మినార్‌ వద్ధ 10 గంటలకు జరిగే సభ అనంతరం పాదయాత్ర ప్రారంభమై మదీనా, అఫ్జల్​గంజ్, బేగం బజార్, ఎంజే మార్కెట్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, మాసబ్ ట్యాంక్​, మెహదీపట్నం మీదుగా తొలి రోజు పాదయాత్ర సాగి మెహదీపట్నంలోని జి.పుల్లారెడ్డి ఫార్మసి కాలేజీలో రాత్రి బస చేయనున్నారు. రెండోరోజు పాదయాత్ర టోలిచౌకీ, షేక్ పేట, గోల్కొండ కోట, లంగర్ హౌజ్, బాపుఘాట్ వరకు యాత్ర సాగుతుంది. రెండో రోజు పాదయాత్రలో భాగంగా గోల్కొండ కోట వద్ద సభ ఏర్పాటు చేశారు. బాపూ ఘాట్​లో రాత్రి బస చేయనున్నారు.

దశల వారీగా యాత్ర

రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పాదయాత్ర కొనసాగనుంది. ఈలోపు హుజూరాబాద్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ వస్తే దాని ప్రకారం మెదక్ నుంచి పాదయాత్ర రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి పాదయాత్ర పరిధిని పెంచుకుంటూ పోవడం లేదా తగ్గించుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. పాదయాత్రకు సంఘీభావంగా కేంద్రమంత్రులతో పాటు పార్టీ జాతీయనాయకులు హాజరై రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్ర స్థాయిలో ఎండగడుతూ.. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించనున్నారు. 2023 ఎన్నికల వరకు ప్రజా సంగ్రామ యాత్ర దశల వారీగా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

అధికారమే లక్ష్యంగా...

ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజా క్షేత్రంలో తెరాస వైఫల్యాలను ఎండగట్టి 2023లో భాజపాను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కమలనాథులు. భాజపా పాదయాత్ర వ్యూహం ఫలిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

ఇదీ చదవండి: BANDI SANJAY: 'తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగుతోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.