ETV Bharat / city

BANDI SANJAY: 'తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగుతోంది'

author img

By

Published : Aug 27, 2021, 6:46 AM IST

BANDI SANJAY
BANDI SANJAY

రాష్ట్రంలో అవినీతి, అరాచక, కుటుంబ పాలన సాగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా రాక్షస ప్రభుత్వం పాలిస్తోందని మండిపడ్డారు. ఇందుకోసమే ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నానని చెప్పారు. శనివారం నుంచి ‘ప్రజా సంగ్రామయాత్ర’ పేరిట పాదయాత్ర చేపడుతున్న సంజయ్‌ ‘ఈనాడు- ఈటీవీభారత్​’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

అవినీతితో రూ.వేల కోట్లు సంపాదించుకోవడం తప్ప, ఏడేళ్ల పాలనలో తెరాస ప్రభుత్వం సాధించిందేమీ లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని కలవకుండా, ఆత్మస్థైర్యం కల్పించే పరిస్థితి లేకపోవడంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నారన్న విషయాన్ని ప్రజలు మర్చిపోయే పరిస్థితి నెలకొందని.. తెరాస పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని విమర్శించారు. ‘తెలంగాణలో అవినీతి, కుటుంబ పాలన సాగుతోంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా పాలన సాగుతుంది. దీనిపై సంగ్రామానికే మా యాత్ర’ అని తెలిపారు. నిజాం నిరంకుశుడని తెలంగాణ ఉద్యమ సమయంలో విమర్శించిన కేసీఆర్‌... ముఖ్యమంత్రి అయ్యాక నయా నిజాంలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో రూ.వేల కోట్లు ఖర్చుపెట్టే కేసీఆర్‌ ప్రయత్నం చూశాక.. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

  • ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందే పాదయాత్ర మొదలుపెడుతున్నారు?

ఈ యాత్ర ఓట్ల కోసం కాదు. కష్టాల్లో ఉన్న ప్రజలకు భరోసా ఇచ్చేందుకు. మేం 2023లో అధికారంలోకి రావడం తథ్యం. ప్రజలేం కోరుకుంటున్నారో స్వయంగా తెలుసుకుని దానికి అనుగుణంగా పార్టీ ఎన్నికల ప్రణాళికను తయారు చేస్తాం. 35 రోజుల తొలివిడత యాత్ర అక్టోబరు 2న ముగుస్తుంది. ఆ తరువాత విడతలవారీగా 2023 వరకు పాదయాత్ర చేస్తా. మిగిలిన ప్రాంతాల్లో స్తబ్దత రాకుండా, మధ్యలో అసెంబ్లీ నియోజకవర్గాలు, జిల్లాలవారీగా సమావేశాలతో పార్టీని విస్తరిస్తాం.

  • హుజూరాబాద్‌లో ఈటల పలుకుబడి, సానుభూతి కాకుండా భాజపాకు ఇంకేవైనా అంశాలు దోహదం చేస్తాయనుకుంటున్నారా?

ఒక ఎన్నికతో ప్రభుత్వం పడిపోదంటూ తెరాస పరోక్షంగా ఓటమిని ఒప్పుకుంది. దళితబంధు పథకాన్ని హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్‌, దుబ్బాక ఎన్నికలప్పుడు ఎందుకు అమలు చేయలేదు? ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ చేయట్లేదు. ఇప్పుడు ఓటమి భయంతోనే ఆ పథకాన్ని తెచ్చారు. మేం దళితబంధును వ్యతిరేకించట్లేదు కానీ.. సీఎంపై నమ్మకం లేదు. అడ్డదారిలో, రూ. వేలకోట్లతో గెలవాలని కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. హుజూరాబాద్‌లో భాజపా భారీ మెజార్టీతో గెలవబోతోంది. ఈటల ఉద్యమకారుడు. అభివృద్ధి చేశారు. ఒక్కో ఓటుకు రూ. 10, 20 వేలు ఇచ్చేందుకు తెరాస సిద్ధమవుతోంది. తమ పార్టీ నాయకుల్ని తామే కొంటున్న దుస్థితిలో తెరాస ఉంది.

  • భాజపా ఎంపీలు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని తెరాస ప్రశ్నిస్తోంది. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ వంటి పథకాలకు నీతి ఆయోగ్‌ రూ.24,500 కోట్లు ఇవ్వాలని చెప్పినా కేంద్రం పట్టించుకోలేదని, విభజన హామీల్ని అమలు చేయడం లేదన్న విమర్శలపై ఏమంటారు?

మోసపూరిత హామీలతో తెరాస అధికారంలోకి వచ్చింది. వేలానికి దొరికే భూములు దళితులకు మూడెకరాలివ్వడానికి ఉండవా? దళితుడిని సీఎం చేయకపోతే తల నరుక్కుంటానన్న కేసీఆర్‌కు ఆ పదవికి అర్హుడు దొరకలేదా? 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్‌ విగ్రహం పెట్టలేదు కానీ... 100 గదులతో ప్రగతిభవన్‌ కట్టుకున్నరు. నిరుద్యోగభృతి ఇవ్వట్లేదు. పంటల రుణమాఫీ ఏది? ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఒక్కో వ్యక్తిపై రూ.లక్ష రుణభారం మోపారు. భాజపా ఎలాంటి హామీలివ్వకపోయినా తెలంగాణ అభివృద్ధికి, సంక్షేమానికి నిధులిస్తోంది. ఉచిత వ్యాక్సిన్‌, ఉచిత బియ్యం, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ఇళ్ల నిధులు కేంద్రానివే. కేంద్రం ఇచ్చే ‘కంపా’ నిధులతో హరితహారం అమలు చేస్తున్నారు. రైల్వేలు, జాతీయ రహదారులు, గ్రామీణ రోడ్లు, ఉపాధిహామీ నిధులన్నీ కేంద్రానివే. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, దళితబంధు తప్ప పథకాల నిధులన్నీ కేంద్ర ప్రభుత్వానివే. భారత్‌ బయోటెక్‌లో వ్యాక్సిన్‌ తయారు చేస్తుంటే దిల్లీ నుంచి ప్రధాని వచ్చి చూసి వెళ్లారు. హైదరాబాద్‌లో ఉన్న సీఎంకు సోయిలేదు. కొవిడ్‌, వరదలప్పుడు గడీల నుంచి బయటకు రాలేదు. ఆ సమయాల్లో ప్రజలకు సేవ చేసింది భాజపా.

  • తెరాస, భాజపా ఒక్కటేనని... కేంద్ర ప్రభుత్వానికి అన్ని విషయాల్లో తెరాస మద్దతిస్తోందన్న రేవంత్‌రెడ్డి విమర్శలపై మీ స్పందన?

పార్లమెంటులో కొన్ని బిల్లులకు కాంగ్రెస్‌ కూడా మద్దతిచ్చింది. మరి కాంగ్రెస్‌, భాజపా ఒకటా? కాంగ్రెస్‌లో గెలిచినవారు తెరాసలోకి వెళుతున్నారు. తెరాస, భాజపా కలసి ఎన్నడూ పోటీ చేయలేదు. కాంగ్రెస్‌, తెరాస కలసి పోటీచేశాయి. తెరాసను ఎదుర్కొనే సత్తా భాజపాకే ఉంది. తెరాస, భాజపా ఒక్కటైతే, 4 ఎంపీలు, దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని ఎలా గెలుస్తాం. కాంగ్రెస్‌ ఎందుకు గెలవట్లేదు?

  • కృష్ణా జలాల వివాదంలో ఆదేశాలుండవు.. సామరస్య పరిష్కారమే కేంద్రం ఆలోచన అని కిషన్‌రెడ్డి చెబుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరెలాంటి ప్రయత్నం చేస్తారు?

కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంలో తొలి ద్రోహి ముఖ్యమంత్రి కేసీఆరే. పరీవాహక ప్రాంతం (68.5 శాతం) ప్రకారం హక్కుగా తెలంగాణకు 555 టీఎంసీల నీళ్లు దక్కాలి. 299 టీఎంసీలకే ఏపీతో ఒప్పందం చేసుకుని కేసీఆర్‌ అన్యాయం చేశారు. ఒకసారి పొరపాటు అనుకోవచ్చు. మూడు సమావేశాల్లో 299 టీఎంసీలకే అంగీకరించారు. విభజన చట్టం ప్రకారం.. వివాదాలను పరిష్కరించడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. ఏపీ అక్రమ ప్రాజెక్టులకు సహకరించింది కేసీఆరే. న్యాయమైన వాటా కోసం వచ్చే నెలలో జరిగే కృష్ణా బోర్డు సమావేశంలో గట్టివాదనలు వినిపించాలని ఇప్పుడు కేసీఆర్‌ మాట్లాడుతున్నారు.

  • దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటి ఊపును భాజపా తర్వాత కొనసాగించలేకపోతోంది. తెరాసకు ఏ విధంగా ప్రత్నామ్నాయం అవుతుంది?

గతంలో కంటే వరంగల్‌లో బలం పెరిగింది. ఖమ్మంలో ఖాతా తెరిచాం. పురపాలక ఎన్నికల్లో ఓట్ల శాతం భారీగా పెరిగింది. ఒక ఎమ్మెల్సీ స్థానం గెలిచేందుకు తెరాస రూ.100 కోట్లు ఖర్చు పెట్టింది. హుజూరాబాద్‌లో ఎన్ని రూ. వందల కోట్లయినా ఖర్చు చేసేందుకు తెగిస్తోంది. ఎన్నికలొస్తే తుపాకీ రాముడి మాటలతో మోసం చేయడం కేసీఆర్‌కు అలవాటు. అబద్ధాలు, మోసపూరిత వాగ్దానాలతో.. యాస, భాష, పిట్టకథలతో ప్రజల్ని వంచించి ఎన్నికల్లో గెలవాలనుకునే పార్టీ కాదు మాది. నాలుగు కోట్ల మంది సాధించిన తెలంగాణలో అధికారం ఒక కుటుంబానికి పరిమితమైంది. సెప్టెంబరు 17ని అధికారికంగా జరపాలని.. ఉద్యమ సమయంలో కోరిన కేసీఆర్‌, ముఖ్యమంత్రి అయ్యాక నిజాం సమాధి వద్ద మోకరిల్లారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, అమరుల ఆత్మత్యాగాన్ని నిజాం సమాధి దగ్గర తాకట్టు పెట్టారు. మజ్లిస్‌కు భయపడే సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరిపించట్లేదు. తెరాస నేతల బెదిరింపులు, కబ్జాలు, అవినీతి చూసి.. ఇందుకేనా తెలంగాణ సాధించుకున్నది.. అన్న నిరాశ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ నయా నిజాంను వచ్చే ఎన్నికల్లో గద్దె దించుతాం.

ఇదీచూడండి: Dalitha Bandhu: దళితబంధుపై సమీక్ష నిర్వహించనున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.