ETV Bharat / sports

పాక్​ ఆటగాడి వద్ద నీరజ్​ జావెలిన్​.. ఫైనల్​ ముందు ఏమైంది?

author img

By

Published : Aug 25, 2021, 3:18 PM IST

neeraj chopra javelin throw
పాక్​ ఆటగాడి వద్ద నీరజ్​ జావెలిన్​.

కీలకమైన ఫైన‌ల్‌కు ముందు జ‌రిగిన ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌నను జావెలిన్ అథ్లెట్​ నీర‌జ్ ఇప్పుడు బ‌య‌ట‌పెట్టాడు. నిజానికి తాను ఫైన‌ల్‌కు సిద్ధ‌మ‌వుతున్న స‌మ‌యంలో స‌డెన్‌గా త‌న జావెలిన్ క‌నిపించ‌కుండా పోయింద‌ని.. వెతికితే అది పాక్​ ఆటగాడి చేతిలో కనిపించిందని చెప్పుకొచ్చాడు. అప్పుడు నెలకొన్న గంద‌ర‌గోళం వ‌ల్లే తాను త‌న తొలి త్రోను హడావిడిగా విస‌రాల్సి వ‌చ్చింద‌ని నీర‌జ్ అన్నాడు.

ఒలింపిక్స్​లో తన ప్రదర్శనతో భారత్​కు బంగారు పతకాన్ని సాధించి.. జావెలిన్​ అథ్లెట్​ నీరజ్​ చోప్డా అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ విజేత.. బంగారు పతకం సాధించే కన్నా ముందు కొద్ది క్షణాలు కంగారు పడిపోయాడట. అయితే ఆ కంగారు ఆటపై ఒత్తిడి వల్ల కాదు. అసలు ఆటకే ప్రధానమైన జావెలిన్​ వల్ల. ఈ విషయాన్ని నీరజ్​ చోప్డానే స్వయంగా వెల్లడించాడు.

"జావెలిన్​ త్రో ఫైనల్​ ప్రారంభం కావడానికి కొద్ది క్షణాలే ఉంది. ఆ సమయంలో నా జావెలిన్​ కనపడలేదు. దానిని కోసం వెతుకుతూ కంగారు పడ్డాను. ఇంతలో పాకిస్థానీ ఆటగాడు ఆర్షాద్​ నదీమ్​ చేతిలో నా జావెలిన్​ను ఉండటం చూశాను. వెంటనే పరిగెత్తుకు వెళ్లి ఆ జావెలిన్​ నాది ఇచ్చేయమని అడిగాను. దానితోనే త్రో చేయాల్సి ఉందని చెప్పాను. అతను నా జావెలిన్​ ఇచ్చేశాడు. ఈ గందరగోళం వల్లే నేను మొదటిసారి జావెలిన్​ను కంగారుగా విసిరాను."

-నీరజ్​ చోప్డా, జావెలిన్​ అథ్లెట్​

అతనిలో సత్తా ఉంది..

క్వాలిఫైయింగ్​ సహా ఫైనల్​ రౌండ్​లో కూడా ఆర్షాద్​ నదీమ్​ మంచి ప్రదర్శన చేశాడని నీరజ్​ చోప్డా పేర్కొన్నాడు. ఇది పాకిస్థాన్​కు మంచి పరిణామం అని.. వాళ్లు జావెలిన్​ మీద దృష్టి సారిస్తే భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో మంచి పోటీ ఇస్తారని అభిప్రాయపడ్డాడు.

ఆ పరిస్థితి మారాలి..

ఒలింపిక్స్​లో పతకం సాధించగానే క్రీడల గురించి చర్చించుకుని ఆ తర్వాత దాని గురించి మర్చిపోయే పరిస్థితి నుంచి బయటపడాలని నీరజ్​ పేర్కొన్నాడు. క్రీడలపై ప్రభుత్వాలు నిరంతరం దృష్టి సారించాలని తెలిపాడు.

టోక్యో నుంచి తిరిగి వచ్చాక తరచూ ఎదో ఒక కార్యక్రమానికి నీరజ్​ హాజరవుతున్నాడు. దీనిపై స్పందించిన చోప్డా.. విరామం లేకుండా తిరుగుతుండటం వల్ల తాను అలసటకు గురవుతున్నానని తెలిపాడు. ఈ క్రమంలోనే తనకు జ్వరం కూడా వచ్చిందని చెప్పాడు.

ఇదీ చదవండి : ధోనీ రూ.100 కోట్ల పరువు నష్టం దావా- విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.