ETV Bharat / sports

'గురువుగా భావించిన వ్యక్తే ప్రాణాలు తీశాడు!'

author img

By

Published : May 15, 2021, 1:51 PM IST

గురువుగా భావించిన వ్యక్తే తన కొడుకు చావుకు కారణమయ్యాడని తెలిపారు రెజ్లర్​ సాగర్​ ధంకర్​ తండ్రి అశోక్​. సాగర్​ ఏదైనా తప్పు చేసి ఉంటే మందలించి వదిలేయాల్సిందని.. ప్రాణాలు తీయడం మాత్రం తగదని అతడి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

sushil kumar, indian wrestler
సుశీల్ కుమార్, భారత స్టార్ రెజ్లర్

రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ను తన కుమారుడు సాగర్ ధంకర్‌ గురువుగా భావించేవాడని అతడి తండ్రి అశోక్‌ అన్నారు. ఛత్రసాల్‌ స్టేడియంలో అతడు ఎనిమిదేళ్లుగా శిక్షణ పొందుతున్నాడని పేర్కొన్నారు. అతడిని ఎందుకు హత్య చేశారో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా తప్పు చేసుంటే స్టేడియం నుంచి పంపించేయాల్సిందని సాగర్‌ కుటుంబ సభ్యుడు నరేంద్ర ధంకర్‌ అన్నారు.

ఛత్రసాల్‌ స్టేడియం ప్రాంగణంలో మే 4న యువ రెజ్లర్‌ సాగర్‌ ధంకడ్‌పై మరికొందరు రెజ్లర్లు దాడి చేశారు. అందులో సాగర్‌ మరణించాడు. అప్పట్నుంచి సుశీల్‌ కుమార్‌ కనిపించడం లేదు. దాడిలో పాల్గొన్నట్టు పోలీసుల విచారణలో తెలియడంతో అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. కానీ సుశీల్‌ ఆనాటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. పోలీసులు 8 బృందాలుగా అతడి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యే లుకౌట్‌ నోటీసులూ జారీ చేశారు.

"ఛత్రసాల్‌లో సాగర్‌ ఎనిమిదేళ్లుగా ఉంటున్నాడు. సుశీల్‌ను అతడు గురువుగా భావించేవాడు. నా కొడుకును మహిపాల్‌ సత్పాల్‌ చేతుల్లో పెట్టాను. వాళ్లు నా కుమారుడిని మంచి రెజ్లర్‌గా రూపొందిస్తామని హామీ ఇచ్చారు. సాగర్‌ పతకాలు గెలిచాడు. అంతర్జాతీయ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఛత్రసాల్‌లో ఉన్నందుకు అతడు గర్వపడేవాడు. ఒక్కరోజూ శిక్షణ మిస్సయ్యేవాడు కాదు. తన గురువులకు మాట రానిచ్చేవాడు కాదు" అని సాగర్‌ తండ్రి అశోక్‌ అన్నారు.

"సాగర్‌ ఏదైనా తప్పు చేసుకుంటే అతడిని కొట్టాల్సింది. లేదా ఛత్రాసాల్‌ నుంచి బయటకు పంపించాల్సింది. కనీసం నన్ను లేదా అతడి తండ్రిని పిలిపించి మాట్లాడాలి. ఎందుకు అతడిని సహించలేకపోయారు? మేం సాగర్‌కు నచ్చజెప్పేవాళ్లం. కానీ అతడి ప్రాణాలు తీయడం మాత్రం అంగీకారయోగ్యం కాదు" అని సాగర్‌ కుటుంబ సభ్యుడు నరేంద్ర ధంకర్‌ అన్నారు.

ఇదీ చదవండి: టీకా ఇస్తామన్న ఫ్రాంఛైజీలు.. తిరస్కరించిన క్రికెటర్లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.