ETV Bharat / sports

క్రికెట్ ఫ్యాన్స్ మదిలో ఆ ఒక్క ప్రశ్న - పంత్‌ ఎప్పటికి వస్తాడో?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 16, 2024, 10:28 AM IST

Rishabh Pant Comeback : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్​ రిషబ్ పంత్ కమ్​బ్యాక్​ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు. అయితే తాజాగా ఈ ప్లేయర్ ఐపీఎల్​లోకి ఎంట్రీ ఇస్తాడు అన్నప్పటి నుంచి అభిమానుల మదిలో అనేక ప్రశ్నలు మొదలయ్యాయి. అవేంటంటే ?

Rishabh Pant
Rishabh Pant

Rishabh Pant Comeback : టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రిషబ్​ పంత్ ప్రస్తుతం తన క్రికెట్​ కెరీర్​ను సెట్​ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడిన ఈ ప్లేయర్ ఆ తర్వాత చికిత్స తీసుకుని ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటున్నాడు. అయితే అతడు మైదానంలో కనిపించి దాదాపు ఏడాది పైనే అయిపోతోంది. దీంతో అతడు వేగంగా కోలుకుని స్ట్రాంగ్ కమ్​బ్యాక్ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు. కానీ ఈ పోటీ క్రికెట్​లోకి వచ్చేందుకు కావాల్సిన ఫిట్‌నెస్‌ను అతడు సంతరించుకున్నాడా లేదా అన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పటి నుంచి ప్రాక్టీస్​ మొదలుపెట్టినప్పటికీ పంత్ యోయో లాంటి క్లిష్టమైన ఫిట్‌నెస్‌ పరీక్షలు అధిగమించగలడా లేదా అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో రిషబ్‌ను చూడాలనుకోవడం కూడా ఆత్యాశ అనే భావిస్తున్నారు అయితే ఒక కాలు ఫిట్‌గా ఉన్నా చాలు జట్టులో పంత్‌ను ఆడించొచ్చని, మ్యాచ్‌లు మలుపు తిప్పే అతడి సత్తానే ఇందుకు కారణమని దిగ్గజ ప్లేయర్​ సునీల్‌ గావస్కర్‌ ఇటీవలే వ్యాఖ్యానించాడు. మరి ఆ దిశగా పంత్‌ అడుగులేస్తున్నాడా లేదా అనేది అసలు ప్రశ్న?

ఐపీఎల్‌తో జర్నీ స్టార్ట్​ : 2024లో జరగనున్న ఐపీఎల్‌ 17 సీజన్​లో రిషబ్‌ పంత్‌ ఆడనున్నట్లు దిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అతడ్ని అన్ని మ్యాచ్‌లు ఆడించే సాహసం దిల్లీ చేయకపోవచ్చన్నది విశ్లేషకుల మాట. అందుకే పంత్​కు ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలో దించే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా అతడు ఏమాత్రం ఫిట్‌గా ఉన్నాడు, ఎంత మేర ఆడగలుగుతున్నాడన్న విషయాలపై ఓ క్లారిటీ రావొచ్చు. అయితే వికెట్‌ కీపింగ్‌ అంటే చాలా ఒత్తిడితో కూడిన పని. రోడ్డు ప్రమాదంలో ఒకటికి మించిన గాయాల పాలైన పంత్‌ ఈ పాత్రలో ఒదగగలడా అనేది సందేహంగా మారింది.

అందుకే అతడు పూర్తి స్థాయిలో ఫిట్​నెస్​ సాధించేంత వరకు స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా జట్టులోకి తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇటీవలే ఐపీఎల్‌ మినీ వేలం కోసం దుబాయ్‌కి వెళ్లిన పంత్‌ అక్కడ జరిగిన ఆక్షన్​లో ఎంతో ఉల్లాసంగా కనిపించాడు. అంతే కాకుండా తాను కోలుకునే ప్రక్రియ వేగాన్ని అందుకుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పాడు. దీంతో పంత్‌ త్వరగా ఫిట్‌నెస్‌ సాధిస్తే ఐపీఎల్‌ నాటికి అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఫిట్‌ అయినప్పటికీ అతడికి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉండదు. దీనికి కొంత సమయం పడుతుందని అంటున్నారు.

ప్రస్తుతం పంత్ నేషనల్ క్రికెట్‌ అకాడమీలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. బ్యాటింగ్‌తో పాటు వికెట్‌ కీపింగ్​లోనూ నెమ్మదిగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. వాస్తవానికి పంత్‌కు తగిలిన గాయాలు చాలా పెద్దవే. దీంతో ఆపరేషన్ తర్వాత అతడి శరీరం మునుపటిలా కూడా సహకరించదు. ఒకప్పుడు ఒంటి చేత్తోనే సిక్స్‌లు బాదిన ఈ స్టార్ క్రికెటర్ ఇప్పుడు అలాంటి ఫీట్‌లు చేయడం అంత తేలిక కాదు.

మరోవైపు విశ్రాంతి తీసుకోవడం వల్ల బరువు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాడు. దీంతో బాడీ కంట్రోల్​లో ఉన్నట్లు కూడా కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో అతడు ఎప్పుడు సీరియస్‌ మ్యాచ్‌ల్లోకి వస్తాడన్నది సస్పెన్స్‌గా మారింది. ఐపీఎల్‌ చాలా ఒత్తిడితో కూడిన లీగ్‌. ఇలాంటి లీగ్‌ ద్వారా పంత్ రీ ఎంట్రీ అనేది కష్టమే అని నిపుణుల మాట. అయితే దేశవాళీ టోర్నీలైన రంజీ ట్రోఫీలో ఆడితే అతడికి తన శరీరంపై ఒక అవగాహన వస్తుంది. ఆట మునుపటిలా ఉందా లేదా అనేది తెలుస్తుంది.

దూకుడైన ఆటకు మారుపేరైన రిషబ్‌ తన కమ్​బ్యాక్​లోనూ మళ్లీ అలాగే ఆడతాడన్న గ్యారెంటీ కూడా లేదు. కొన్నాళ్ల పాటు అతడు సాహసోపేతమైన షాట్లకు దూరం కావొచ్చు. ఏదేమైనప్పటికీ పంత్‌ రాక కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి అతడి గైర్హాజరుతో భారత జట్టులో శాంసన్, జితేశ్‌ శర్మలకు అవకాశం దక్కింది. రిషబ్‌ మళ్లీ ఫిట్‌నెస్‌ సాధించి సత్తా నిరూపించుకోవడమే కాదు. జట్టులో స్థానం దక్కించుకోవాలంటే శాంసన్, జితేశ్‌ లాంటి వాళ్ల నుంచి పోటీని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.