ETV Bharat / sports

వారెవ్వా కోహ్లీ​.. డబుల్​ ధమాకా.. అదరగొట్టేశావుగా

author img

By

Published : Dec 21, 2022, 4:48 PM IST

రంజీ ట్రోఫీలో కెప్టెన్​ కోహ్లీ ఆల్​రౌండ్​ ప్రదర్శనతో అదరగొట్టేశాడు. ఆ మ్యాచ్​ సంగతులు..

Kohli double century
వారెవ్వా విరాట్​.. డబుల్​ ధమాకా.. అదరగొట్టేశావుగా

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మిజోరాం కెప్టెన్‌ తరువార్‌ కోహ్లీ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. తొలుత బంతితో (4/2) ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించిన అతడు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఏకంగా డబుల్‌ సెంచరీతో (297 బంతుల్లో 203; 30 ఫోర్లు, సిక్స్‌) అదరగొట్టాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన అరుణాచల్‌ ప్రదేశ్‌.. కోహ్లీ, రాల్టే (4/21), నవీన్‌ (1/22), అవినాశ్‌ యాదవ్‌ (1/17) ధాటికి 63 పరుగులకే కుప్పకూలింది. ఏపీ ఇన్నింగ్స్‌లో ఐదుగురు డకౌట్‌ కాగా.. కుమార్‌ న్యోంపు (24), కమ్షా (17), నబమ్‌ అబొ (10) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మిజోరాం.. తరువార్‌ కోహ్లీ, గోస్వామి (50) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌటైంది. మిజోరాం ఇన్నింగ్స్‌లో కోహ్లీ, గోస్వామి, ఆండర్సన్‌ (28) మినహా అందరూ దారుణంగా విఫలమయ్యారు. అరుణాచల్‌ బౌలర్లలో నబమ్‌ అబొ 4, యబ్‌ నియా 3, అఖిలేశ్‌ సహాని 2, చేతన్‌ ఆనంద్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

మిజోరాం తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు 275 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన అరుణాచల్‌ ప్రదేశ్‌.. రెండో రోజు మూడో సెషన్‌ సమయానికి 23 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 77 పరుగులు చేసింది. టెకీ నెరీ (27) ఔట్‌ కాగా.. కుమార్‌ న్యోంపు (31), కెప్టెన్‌ సూరజ్‌ తయమ్‌ (18) క్రీజ్‌లో ఉన్నారు. టెకీ నెరీ వికెట్‌ అవినాశ్‌ యాదవ్‌కు దక్కింది. ప్రస్తుతానికి అరుణాచల్‌ ప్రదేశ్‌ ఇంకా 198 పరుగుల వెనకంజలో ఉంది.

ఇద్దరూ స్నేహితులే.. ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన మిజోరాం కెప్టెన్‌ తరువార్‌ కోహ్లీ.. టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లీ ఇద్దరూ మంచి మిత్రులు. వీరిద్దరు 2008లో భారత్‌ అండర్‌-19 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో సభ్యులు. నాటి ప్రపంచకప్‌లో విరాట్‌తో (235) సమానంగా పరుగులు చేసిన తరువార్‌ (218, 3 వరుస హాఫ్‌ సెంచరీలు).. ఆ తర్వాత నిలకడలేమి కారణంగా జాతీయ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు.

ఇదీ చూడండి: ప్రాక్టీస్​ సెషన్​లో కనిపించని కోహ్లీ.. అందరీ దృష్టి ఆ బంగ్లా ప్లేయర్​పైనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.