ETV Bharat / sports

'సన్​రైజర్స్​తో మ్యాచ్​.. అక్షర్​ పటేల్​ను ఆ స్థానంలో ఎందుకు పంపానంటే..'

author img

By

Published : Apr 30, 2023, 2:23 PM IST

david warner
david warner

హైదరాబాద్‌ చేతిలో ఓటమిపాలు కావడం వల్ల దిల్లీ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. విజయానికి చేరువగా వచ్చి మరీ ఓడిపోవడం తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందని డీసీ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్ అన్నాడు. అక్షర్‌ను ఆ స్థానంలో ఎందుకు పంపానో వివరించాడు.

సొంతమైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో ఓడిన దిల్లీ క్యాపిటల్స్.. ఈ మ్యాచ్​తో పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పరిమితమైంది. గతంలో ఉప్పల్‌లో సన్​రైజర్స్​ ఓడించిన దిల్లీ జట్టు.. ఇక్కడ మాత్రం చివర్లో తడబాటుకు గురై పరాజయాన్ని మూటగట్టుకుంది. ఫిలిప్‌ సాల్ట్, మిచెల్‌ మార్ష్‌ దూకుడుగా ఆడటం వల్ల 11 ఓవర్లలో 111/1 స్కోరుతో విజయం వైపుగా దూసుకెళ్తున్న వార్నర్​ సేన.. ఆ తర్వాత వికెట్లను కోల్పోతూ కష్టాల ఊబిలోకి పడింది. అయితే, అక్షర్ పటేల్ మాత్రం మ్యాచ్​లో చివరి వరకు పోరాడాడు. ఈ క్రమంలో అతన్ని ఇంకాస్త ముందుగా పంపించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని దిల్లీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఇదే విషయంపై మ్యాచ్‌ అనంతరం డీసీ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్ స్పందించాడు.

"అక్షర్‌ పటేల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో మేం మంచి ఆరంభాన్ని సాధించాం. అక్షర్‌ను లోయర్‌ ఆర్డర్‌లో పంపించడానికి ఓ కారణం ఉంది. స్పిన్‌ బౌలింగ్‌లో లెఫ్ట్‌ హ్యాండర్లు ఆడటం కాస్త కష్టంగా అనిపించింది. అందుకే అక్షర్‌ను లోయర్‌ ఆర్డర్‌లోనే ఉంచాం. మ్యాచ్‌ మా చేతిలో ఉందనిపించినప్పుడు మేము మరో ఆలోచనను చేయలేదు. పరిస్థితులు ఒక్కసారిగా కఠినంగా మారాయి. అతన్ని ఇంకాస్త ముందుగా బ్యాటింగ్‌కు పంపించి ఉంటే బాగుండేదేమో అని మాకు కూడా అనిపించింది. 9 పరుగుల తేడాతో ఓడిపోవ్వడం అనేది కాస్త నిరుత్సాహపరిచింది. తొలుత మా బౌలర్లు కాస్త పరుగులు అదనంగానే ఇచ్చారు. అయితే, మిచెల్ మార్ష్‌ మాత్రం అద్భుతమైన బౌలింగ్‌తో మైదానంలో అలరించాడు. అతడు మా బెస్ట్‌ బౌలర్. అయితే ఛేదన చివరి దశలో కాస్త వెనుకబడిపోయాం. సాల్ట్, మార్ష్‌.. ఈ ఇద్దరిలో ఏ ఒకరైనా చివరి వరకూ క్రీజ్‌లో ఉన్నా విజయం మా సొంతమయ్యేది. నాతో సహా సీనియర్లు బాధ్యత తీసుకోవాలి" అని వార్నర్ తెలిపాడు.

ఐపీఎల్‌-16వ సీజన్​లో తొలి ఏడు మ్యాచ్‌ల్లో అయిదు ఓటమలు మూటగట్టుకుని ప్లేఆఫ్‌ రేసులో వెనుకబడ్డ సన్‌రైజర్స్‌.. శనివారం మ్యాచ్​తో కాస్త వేగం పుంజుకుంది. పరాజయాల పరంపరకు తెరదించుతూ దిల్లీపై 9 పరుగుల తేడాతో నెగ్గింది. అభిషేక్‌ శర్మ, క్లాసెన్‌ మెరుపులతో మొదట హైదరాబాద్‌ 6 వికెట్లకు 197 పరుగులు చేసింది. మిచెల్‌ మార్ష్‌ అద్భుత బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. అక్షర్‌ పటేల్‌ కూడా తన బౌలింగ్​ స్కిల్స్​తో ఆకట్టుకున్నాడు. మార్ష్‌ బ్యాటింగ్‌లోనూ చెలరేగడం, ఫిల్‌ సాల్ట్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో ఛేదనలో దిల్లీ దూసుకెళ్లింది. కానీ ఇన్నింగ్స్‌ రెండో అర్ధంలో సన్‌రైజర్స్‌ బౌలర్లు పుంజుకుని ఆ జట్టును కట్టడి చేశారు. చివరికి దిల్లీ 6 వికెట్లకు 188 పరుగులే చేయగలిగింది. మార్కండే, అభిషేక్‌ శర్మ, నటరాజన్‌ ఆకట్టుకున్నారు. 8 మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌కు ఇది మూడో విజయం కాగా.. దిల్లీ తన ఖాతాలో ఆరో ఓటమిని వేసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.