ETV Bharat / sports

విండీస్‌తో సమరానికి భారత మహిళలు సై.. వేలం ఊపులో దంచి కొడతారా?

author img

By

Published : Feb 15, 2023, 7:46 AM IST

టీమ్ ఇండియా మహిళా క్రికెటర్లు మంచి జోష్​లో ఉన్నారు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై అద్భుత విజయాన్ని సాధించాక.. భారత అమ్మాయిలపై కోట్ల వర్షం కురిసింది. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ వేలంలో మన అమ్మాయిలు అంచనాలను మించి ధరలు దక్కించుకున్నారు. ఇదే ఉత్సాహంతో టీ20 ప్రపంచకప్‌లో తమ తర్వాతి పోరుకు సిద్ధమయ్యారు.

ind vs wi match updates
ind vs wi

భారత మహిళా క్రికెటర్లు ఇప్పుడు మామూలు ఉత్సాహంలో లేరు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అద్భుత విజయంతో మహిళల టీ20 ప్రపంచకప్‌లో శుభారంభం చేసిన తర్వాతి రోజు భారత అమ్మాయిలపై కోట్ల వర్షం కురిసింది. మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) వేలంలో మన అమ్మాయిలు అంచనాలను మించి ధరలు దక్కించుకున్నారు. తొలి మ్యాచ్‌లో విజయానికి తోడు వేలం ఉత్సాహంతో టీ20 ప్రపంచకప్‌లో తమ తర్వాతి పోరుకు సిద్ధమయ్యారు భారత అమ్మాయిలు. బుధవారం వెస్టిండీస్‌ను ఢీకొట్టనున్న భారత్‌.. వరుసగా రెండో విజయంతో సెమీస్‌ బెర్తు దిశగా మరో అడుగు వేయాలని చూస్తోంది.

పాక్‌పై కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ.. వాటిని అధిగమించి విజయం సాధించడం భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. పైగా ఆ మ్యాచ్‌కు గాయం కారణంగా అందుబాటులో లేని స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన.. విండీస్‌పై బరిలోకి దిగనుంది. మరోవైపు విండీస్‌ తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడింది. ఆ జట్టుపై హర్మన్‌ప్రీత్‌ సేనకు మంచి రికార్డే ఉంది. ప్రస్తుతం భారత్‌ జోరు ముందు విండీస్‌ నిలవడం కష్టమే. పాక్‌పై చెలరేగి ఆడిన జెమీమా, రిచాలపై మంచి అంచనాలున్నాయి. స్మృతి రాకతో బ్యాటింగ్‌ మరింత బలోపేతం కానుంది. కానీ బౌలింగ్‌ విషయంలో మాత్రం భారత్‌కు కంగారు తప్పట్లేదు.

పాక్‌తో తొలి పది ఓవర్ల వరకు బౌలర్లు ఆకట్టుకున్నా.. తర్వాతి పది ఓవర్లలో ఏకంగా 91 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. స్పిన్నర్‌ రాధ యాదవ్‌ మినహా బౌలర్లందరూ ధారాళంగా పరుగులిచ్చేశారు. కొన్ని మ్యాచ్‌ల నుంచి పేసర్‌ రేణుక సింగ్‌ సత్తా చాటలేకపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. వార్మప్‌ మ్యాచ్‌ల్లో సత్తా చాటిన అనుభవజ్ఞురాలు శిఖాను.. రేణుక లేదా పూజ స్థానంలో తుది జట్టులో తీసుకుంటారేమో చూడాలి. స్పిన్నర్లు దీప్తి, రాజేశ్వరి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సిన అవసరముంది. విండీస్‌ ఎక్కువగా కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ మీద ఆధారపడుతోంది. బ్యాటింగ్‌లో ఆ జట్టు బలహీనంగా కనిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.