ETV Bharat / sports

'కోహ్లీసేన కోసం ఆసీస్​కు ద్రవిడ్ వెళ్లాల్సిందే'

author img

By

Published : Dec 21, 2020, 5:31 AM IST

ఆసీస్​తో టెస్టు సిరీస్​ భారత్​ కోలుకోవాలంటే ద్రవిడ్ జట్టుకు సహాయం చేయాలని మాజీ క్రికెటర్ వెంగ్​సర్కార్ అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో ఘోరంగా ఓడిన టీమ్​ఇండియా.. రెండో మ్యాచ్​ కోసం సిద్ధమవుతోంది.

Rahul Dravid must be rushed to Australia: Vengsarkar after India's defeat
'కోహ్లీసేనను కాపాడాలంటే ద్రవిడ్ వెళ్లాల్సిందే'

విరాట్ కోహ్లీ, చెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె లాంటి మేటి బ్యాట్స్‌మెన్ జట్టులో ఉన్నా సరే టీమ్​ఇండియా.. 36 పరుగులకే కుప్పకూలి కోరుకోని రికార్డు నమోదు చేసింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా బౌలర్లు వేగంగా విసిరిన ఇన్‌స్వింగర్‌, ఔట్ స్వింగర్స్‌కు భారత ఆటగాళ్ల వద్ద సమాధానం దొరకని పరిస్థితి ఏర్పడింది. కోహ్లీ పితృత్వ సెలవులపై స్వదేశానికి రానుండటం వల్ల.. ఆసీస్‌తో ఆడాల్సిన మూడు టెస్టుల్లో టీమ్​ఇండియా ఏ స్థాయిలో ప్రదర్శన చేస్తుందని సందేహాలు మొదలయ్యాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో టీమ్​ఇండియా తిరిగి సత్తాచాటాలంటే దిగ్గజ బ్యాట్స్‌మన్‌ రాహుల్ ద్రవిడ్ ఆస్ట్రేలియా వెళ్లాలని, దీనిపై బీసీసీఐ చొరవ తీసుకోవాలని మాజీ క్రికెటర్ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ పేర్కొన్నాడు. బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తున్న ఎన్నో సందర్భాల్లో... ద్రవిడ్‌ క్రీజులోకి వచ్చి గోడకట్టినట్లుగా డిఫెన్స్‌ చేస్తూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అలాంటి అనుభవజ్ఞుడు నెట్స్‌లో ఉంటే టీమ్​ఇండియా బ్యాట్స్‌మెన్‌లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని వెంగ్‌సర్కార్‌ అన్నాడు.

"రాహుల్‌ ద్రవిడ్‌ను ఆస్ట్రేలియాకు పంపించి భారత జట్టుకు సాయంచేసేలా బీసీసీఐ చొరవ తీసుకోవాలి. అక్కడి పరిస్థితుల్లో స్వింగ్ అయ్యే బంతిని ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని ద్రవిడ్ కంటే గొప్పగా మరెవరు చెప్పలేరు. అంతేగాక, అతడు నెట్స్‌లో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. కొవిడ్‌ కారణంగా గత కొన్ని నెలలు ఎన్‌సీఏను మూసివేసి ఉంచారు. ద్రవిడ్‌ ఆసీస్‌కు వెళ్తే ఎన్‌సీఏలో అంతగా ఇబ్బందులు తలెత్తవని భావిస్తున్నా. కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమవుతున్న ఈ సమయంలో టీమిండియాకు ద్రవిడ్‌ సేవలు ఉపయోగపడేలా బీసీసీఐ ప్రయత్నించాలి. అతడు ఆసీస్‌కు బయలుదేరితే అక్కడి క్వారంటైన్‌ నిబంధనలు పూర్తిచేసి.. జనవరి 7న ప్రారంభమయ్యే మూడో టెస్టుకు ముందు జట్టుతో కలుస్తాడు."

-- దిలీప్​ వెంగ్​సర్కార్​, మాజీ క్రికెటర్​.

ప్రస్తుతం ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ద్రవిడ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆస్ట్రేలియా, భారత్​ల మధ్య రెండో టెస్టు ఈ నెల 26 నుంచి మెల్​బోర్న్ వేదికగా ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి:'టీమ్ఇండియా ఈ మార్పులు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.