ETV Bharat / sports

'నా కష్టం మీకు తెలియదు, తెలుగు కుర్రాడు అదుర్స్'- రాహుల్, అర్షదీప్ రికార్డులే రికార్డులు!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 22, 2023, 9:36 AM IST

IND Vs SA ODI Sanju Samson
IND Vs SA ODI Sanju Samson

IND Vs SA ODI Sanju Samson : దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ బాదేసిన టీమ్​ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్ ఎమోషనల్ అయ్యాడు. గత కొన్ని నెలలుగా శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డానని, మొత్తానికి మంచి ఫలితం వచ్చినందుకు ఆనందంగా ఉందని చెప్పాడు. మరోవైపు, ఈ సిరీస్​లో స్టాండింగ్ కెప్టెన్ కేఎల్ రాహుల్, అర్ష్​దీప్ పలు రికార్డులను తమ ఖాతాలే వేసుకున్నారు.

IND Vs SA ODI Sanju Samson : దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్మయాత్మక మూడో వన్డేలో భారత్ అదరగొట్టింది. 78 పరుగుల తేడాతో మ్యాచ్​లో విజయం సాధించింది. ఫలితంగా 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. అయితే చివరి వన్డేలో భారత్​ ఇన్నింగ్స్​లో సంజూ శాంసన్ సెంచరీతో దుమ్మురేపాడు. తక్కువ అవకాశాలు, ఎక్కువ అంచనాలతో బరిలోకి దిగి అదరగొట్టాడు.

కెరీర్​లోనే సంజూ శాంసన్ తొలి సెంచరీ సాధించాడు. యంగ్ క్రికెటర్ తిలక్ వర్మ (52; 77 బంతుల్లో) కుదురుకోవడానికి ఎక్కువ బంతులు తీసుకోవడంతో ఓ స్థితిలో టీమ్​ఇండియా రన్‌రేటు తగ్గింది. కానీ మరో ఎండ్‌లో ఉన్న శాంసన్ బౌండరీలతో స్కోరుబోర్డు పరుగులు పెట్టించాడు. చివరకు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు.

సంజు ఎమోషనల్​
అయితే సెంచరీ సాధించిన తర్వాత, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న సందర్భంలో సంజు శాంసన్ మాట్లాడాడు. ''సెంచరీ సాధించినందుకు సంతోషంగా ఉంది. భావోద్వేగంగా అనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డా. మొత్తానికి మంచి ఫలితం వచ్చినందుకు ఆనందంగా ఉంది. కొత్త బంతితో సౌతాఫ్రికా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. తర్వాత పాత బంతి టైమ్‌లో బ్యాటింగ్ చేయడం సవాలుగా మారింది. కేఎల్ రాహుల్ ఔటైన తర్వాత కేశవ్ మహరాజ్ ఊపందుకున్నాడు. కానీ నేను, తిలక్ కుదురుకోవడానికి ప్రయత్నించాం. జట్టులో ఎక్సట్రా ఆల్‌రౌండర్ ఉన్నాడని 40 ఓవర్లపాటు బ్యాటింగ్ కొనసాగించాలని మేం ప్లాన్ చేశాం'' అని తెలిపాడు.

''విజయంలో నా పాత్ర ఉన్నందుకు సంతోషంగా ఉంది. పిచ్, బౌలర్లను అర్థం చేసుకోవడానికి వన్డే ఫార్మాట్‌లో సమయం ఉంటుంది. ఇక టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం వల్ల మరో 10-20 బంతులు ఎక్కువగా ఆడే అవకాశం ఉంటుంది. తిలక్ వర్మ గొప్పగా ఆడాడు. అతడి ఆట పట్ల దేశం గర్వంగా ఉంది. తిలక్ మరిన్ని గొప్ప ఇన్నింగ్స్‌లు సాధిస్తాడు. టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్లు నెలకొల్పిన ప్రమాణాలను జూనియర్లు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రయాణం చేస్తూ 2-3 రోజుల వ్యవధిలోనే మ్యాచ్‌లు ఆడటం అంత ఈజీ కాదు. అయినా సత్తాచాటుతున్నాం'' అని సంజు శాంసన్ చెప్పాడు.

కేఎల్ రాహుల్ అరుదైన ఘనత
IND Vs SA ODI Kl Rahul : మరోవైపు, ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా తాత్కాలిక వన్డే జట్టు కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ అరుదైన ఘనత సాధించాడు. విరాట్‌ కోహ్లీ తర్వాత సౌతాఫ్రికాను వారి సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో ఓడించిన కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. విరాట్‌ 2017/18లో తొలిసారి సౌతాఫ్రికాను వారి సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో ఓడించాడు. అప్పుడు జరిగిన సిరీస్‌లో విరాట్‌ నేతృత్వంలోని టీమ్​ఇండియా సౌతాఫ్రికాను 5-1 తేడాతో చిత్తు చేసింది. మళ్లీ ఇప్పుడు రాహుల్‌ సఫారీలను వారి హోం పిచ్‌పై వన్డే సిరీస్‌లో ఓడించాడు.

రెండో స్థానంలో భారత్​
ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో టీమ్ఇండియాకు ఇది 27వ విజయం. ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 2003లో ఆస్ట్రేలియా 30 విజయాలు సాధించి, ఈ జాబితాలో టాప్‌లో ఉంది.

అర్ష్​దీప్ సింగ్ రికార్డులు
IND Vs SA ODI Arshdeep Singh : మూడు వన్డేల సిరీస్​లో రాణించిన అర్ష్‌దీప్‌ సింగ్‌ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టిన అర్ష్‌దీప్‌, మునాఫ్‌ పటేల్‌ తర్వాత సౌతాఫ్రికా గడ్డపై అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత పేసర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2010/11 సిరీస్‌లో మునాఫ్‌ 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. అలాగే సౌతాఫ్రికాలో అత్యధిక సార్లు (2) నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా, ఓవరాల్‌గా ఐదో విజిటింగ్‌ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు అర్ష్​దీప్.

శతక్కొట్టిన సంజూ - మూడో వన్డేలో భారత్‌ విజయం - సిరీస్​ మనదేరా

సెంచరీ తర్వాత సంజూ సూపర్ సెలబ్రేషన్​ - వారికి స్ట్రాంగ్​ కౌంటర్​ ఇచ్చాడుగా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.