ETV Bharat / sports

టీమ్​ఇండియాకు భారీ జరిమానా.. తప్పు ఒప్పుకున్న కెప్టెన్ రోహిత్

author img

By

Published : Jan 20, 2023, 3:49 PM IST

Etv Bharatind vs nz first one day team india penalised heavily for slow over rate
Etv Bharatind vs nz first one day team india penalised heavily for slow over rate

న్యూజిలాండ్​తో జరిగిన తొలి వన్డేకు గాను టీమ్​ఇండియాకు భారీ జరిమానా విధించింది ఐసీసీ. అయితే స్లో ఓవర్ రేట్ తప్పును కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అంగీకరించినట్లు ఐసీసీ వెల్లడించింది.

న్యూజిలాండ్​తో జరిగిన తొలి వన్డేను చివరి వరకూ పోరాడి గెలిచి సిరీస్​లో 1-0 ఆధిక్యంలో నిలిచింది టీమ్​ఇండియా. హైదరాబాద్​లో జరిగిన ఈ మ్యాచ్​లో భారత్​ 12 పరుగుల తేడాతో కివీస్​ను ఓడించింది. అయితే ఈ మ్యాచ్​లో స్లో ఓవర్ రేటు కారణంగా టీమ్​ఇండియాకు భారీ జరిమానా విధించింది ఐసీసీ. కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు మిగతా టీమ్ మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత పెట్టింది.

తొలి వన్డేలో నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే టీమ్​ఇండియా మూడు ఓవర్లు తక్కువగా వేసింది. ఒక ఓవర్​కు 20 శాతం మ్యాచ్ ఫీజు కోత పెడతారు. ఆ లెక్కన మూడు ఓవర్లు కావడంతో 60 శాతం జరిమానా విధించినట్లు ఐసీసీ వెల్లడించింది. "న్యూజిలాండ్​తో బుధవారం హైదరాబాద్​లో జరిగిన మ్యాచ్​లో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమ్​ఇండియా మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించాం. మ్యాచ్ రిఫరీగా వ్యవహరించిన జవగళ్ శ్రీనాథ్ ఈ జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో మూడు ఓవర్లు తక్కువగా వేసినట్లు గుర్తించారు" అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా తన తప్పును అంగీకరించినట్లు వెల్లడించింది. దీంతో దీనిపై విచారణ అవసరం లేదని తెలిపింది. తొలి వన్డేలో గెలిచిన తర్వాత మూడు వన్డేల సిరీస్​లో 1-0 ఆధిక్యంలో ఉన్న టీమ్​ఇండియా.. శనివారం రాయ్‌పుర్​లో జరగబోయే రెండో వన్డే కూడా గెలిచి సిరీస్ ఎగరేసుకుపోవాలని చూస్తోంది.

తొలి వన్డేలో 350 పరుగుల ఛేజింగ్​లో న్యూజిలాండ్ టాప్​ఆర్డర్ విఫలమైంది. అయితే చివర్లో బ్రాస్‌వెల్, సాంట్నర్ పోరాడటంతో లక్ష్యానికి దగ్గరగా వచ్చింది. ఒక దశలో కివీస్ గెలుస్తుందని అందరూ భావించారు. చివరి ఓవర్లో 20 రన్స్ అవసరం కాగా.. తొలి బంతికే బ్రాస్‌వెల్ సిక్స్ కొట్టాడు. అయితే తర్వాత బంతికే శార్దూల్ ఠాకూర్ ఓ యార్కర్​తో అతడిని ఔట్ చేయడంతో భారత్​ జట్టు విజయం సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.