ETV Bharat / sports

'ఆ మ్యాచ్​ కోసం బౌలర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు'

author img

By

Published : Jun 19, 2020, 3:45 PM IST

భారత పేసర్లు, ఆస్ట్రేలియాతో జరగబోయే గులాబి బంతి టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నాడు టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్​ పుజారా. అయితే ఈ మ్యాచ్​ బ్యాట్స్​మెన్​కు సవాలేనని అభిప్రాయపడ్డాడు.

'ఆ మ్యాచ్​ కోసం బౌలర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు'
పుజారా

ఆస్ట్రేలియాతో పింక్‌బాల్‌ టెస్టు ఆడేందుకు, టీమ్‌ఇండియా పేసర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఛెతేశ్వర్‌ పుజారా అన్నాడు. ఇటీవలే ఓ టీవీ ఛానెల్​ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నాడు. కంగారూ గడ్డపై రానున్న డిసెంబర్‌ 3 నుంచి ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ జరగనుంది. ఆడిలైడ్‌లో నిర్వహించే రెండో టెస్టును గులాబి బంతితో‌(డే/నైట్‌ టెస్టు) జరపాలని ప్రణాళిక రూపొందించారు. ఈ నేపథ్యంలోనే పుజారా పై వ్యాఖ్యలు చేశాడు.

"బుమ్రా, షమి, ఇషాంత్‌కు ఇప్పటికే పింక్‌బాల్‌ టెస్టు ఆడిన అనుభవముంది. ఈ ముగ్గురూ ఆస్ట్రేలియాతో ఆ టెస్టు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది ఈడెన్‌గార్డెన్స్‌లో బంగ్లాతో జరిగిన తొలి గులాబి బంతి మ్యాచ్‌ను వాళ్లెంతో ఆస్వాదించి ఉండొచ్చు. అలాగే ఆస్ట్రేలియా పిచ్‌లపై అలాంటి బంతితో బౌలింగ్‌ చేయడం వారికి గొప్ప అనుభూతిని మిగులుస్తుందనుకుంటున్నాను"

-ఛెతేశ్వర్​ పుజారా, టీమ్​ఇండియా టెస్టు క్రికెటర్

మరోవైపు గులాబి బంతితో ఆడటం బ్యాట్స్‌మెన్‌కు పెద్ద సవాలని, అది సంప్రదాయక ఎర్రబంతితో పోలిస్తే చాలా కష్టమని పుజారా పేర్కొన్నాడు. ఆడే ఫార్మాట్‌ అదే అయినా పింక్‌ బంతి కనిపించడం, పేస్‌ వేరుగా ఉంటాయని చెప్పాడు. ఓ బ్యాట్స్‌మన్‌గా ఆ బంతికి అలవాటుపడాల్సిన అవసరం ఉందని అన్నాడు. మరీ ముఖ్యంగా ఎర్రబంతికి అలవాటుపడ్డ యువ క్రికెటర్లకు, గులాబి ‌బంతితో ఆడటం సవాలుగా మారుతుందని అభిప్రాయపడ్డాడు.

పింక్​బాల్​తో ఆడటం సులభం కాదని, ప్రత్యేకంగా నెట్‌ సెషన్స్‌ నిర్వహించాలని పుజారా సూచించాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో అలా చేయడం కష్టతరమని వివరించాడు. ఏ యువ క్రికెటర్​కు అయినా రంజీల్లో ఎర్ర బంతితోనే ఆడిన అనుభవం ఉంటుందని, తద్వారా వారు జాతీయ జట్టులోకి వచ్చాక దానితో ఆడటం సులభమవుతుందని పేర్కొన్నాడు.

గత ఆసీస్‌ పర్యటనలో పుజారా బ్యాటింగ్‌తో అదరగొట్టడం వల్ల.. 71 ఏళ్ల తర్వాత ఆ దేశంలో చారిత్రక టెస్టు సిరీస్‌ 2-1 తేడాతో గెలుచుకుంది భారత్. ఈ నేపథ్యంలోనే రాబోయే సిరీస్‌లో ఇరుజట్ల మధ్య తొలి డే/నైట్‌ మ్యాచ్‌ జరగనుండటం వల్ల ఆసక్తి కాస్త ఇంకా పెరుగుతోంది.

ఇదీ చూడండి... నా జీవితంలో ఆనందం నువ్వు: హార్దిక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.