ETV Bharat / sports

ఐపీఎల్‌ స్పాన్సర్​షిప్​ కోసం భారీ పోటీ.. కానీ!

author img

By

Published : Aug 7, 2020, 3:07 PM IST

Updated : Aug 7, 2020, 3:27 PM IST

ipl sponser news
ఐపీఎల్‌ స్పాన్సర్​షిప్​ కోసం భారీ పోటీ.. కానీ!

ఐపీఎల్​ స్పాన్సర్​షిప్​ కోసం పదుల సంఖ్యలో సంస్థలు పోటీపడుతున్నాయి! చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో వివో తప్పుకున్న తర్వాత అమెజాన్​, బైజూస్​, డ్రీమ్​11 ఈ రేసులో నిలిచాయి. అయితే సగం కన్నా తక్కువకే స్పాన్సర్‌షిప్‌ దక్కించుకునే యోచనలో కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్(ఐపీఎల్​)‌ టైటిల్‌ స్పాన్సర్‌షిప్‌ దక్కించుకునేందుకు పదుల సంఖ్యలో కంపెనీలు కన్నేశాయని సమాచారం. ప్రస్తుత విలువలో సగం కన్నా తక్కువ మొత్తానికే టెండర్లు దాఖలు చేసేందుకు యోచిస్తున్నాయని తెలుస్తోంది. ఆర్థిక వాతావరణం అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఈ అవకాశాన్ని సొంతం చేసుకునేందుకు అవి పోటీపడుతున్నాయి.

ఐదేళ్ల వరకు టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగేందుకు 2018లో బీసీసీఐతో వివో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాదికి రూ.440 కోట్ల చొప్పున 2022 వరకు చెల్లించాల్సి ఉంది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌-2020 దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్ ‌10 వరకు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. స్పాన్సర్లు తమతోనే ఉన్నారని స్పష్టం చేసింది. చైనా వస్తు బహిష్కరణ ఉద్యమం తీవ్రంగా నడుస్తుండటం వల్ల ఆ సెగ వివోకు తగలింది. దాంతో ఈ ఏడాది ఆ సంస్థ ఐపీఎల్‌లో భాగస్వామి కావడం లేదని బీసీసీఐ గురువారం ఏకవాక్య ప్రకటన జారీ చేసింది.

గేట్‌ మనీ లేకపోవడం వల్ల ఇప్పటికే నష్టపోయిన ఫ్రాంచైజీలు వివో దెబ్బకు మరింత నష్టాల్లోకి జారుకోనున్నాయి. ఎందుకంటే టైటిల్‌ స్పాన్సర్‌ షిప్‌ ద్వారా వచ్చే డబ్బులో సగం అన్ని ఫ్రాంచైజీలకు సమానంగా పంచుతారు. అయితే మరో కొత్త స్పాన్సర్‌ వచ్చినా అంత మొత్తం చెల్లించక పోవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. సగం విలువైతే అద్భుతమని, 1/3వ వంతు చెల్లించినా విజయమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ హక్కులు పొందేందుకు తీవ్రంగా పోటీ పడనుందని తెలిసింది. ఎందుకంటే రాబోయేది దసరా, దీపావళి సీజన్‌ కావడమే కారణం. టీమ్‌ఇండియా జెర్సీ స్పాన్సర్‌ బైజూస్‌, ఫాంటసీ స్పోర్ట్స్‌ ఫ్లాట్‌ఫామ్‌ డ్రీమ్‌ 11, అన్‌ అకాడమీ, మైసర్కిల్‌ 11 సహా కొన్ని సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

Last Updated :Aug 7, 2020, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.