ETV Bharat / sitara

'ఆస్కార్​ పురస్కారాల వేడుక వర్చువల్​గా ఉండదు'

author img

By

Published : Dec 2, 2020, 8:02 PM IST

Oscars 2021 will be an 'in-person' show
'ఆస్కార్​ పురస్కారాల వేడుక వర్చువల్​గా ఉండదు'

వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్​ పురస్కార వేడుకను వర్చువల్​గా నిర్వహించబోమని ఆస్కార్​ అకాడమీ బుధవారం ఓ ప్రకటనలో తెలియజేసింది. అయితే కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో ఈసారి ఈవెంట్​ను కాస్త ఆలస్యంగా నిర్వహిస్తామని అకాడమీ స్పష్టం చేసింది.

కరోనా వ్యాప్తి కారణంగా ఈసారి ఆస్కార్​ అకాడమీ పురస్కారాల వేడుక జరగదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఈవెంట్​ను వర్చువల్​గా జరపమని నిర్వాహకులు ధ్రువీకరించారు. 'ఇన్​-పర్సన్​ టెలికాస్ట్​' పద్ధతిని అనుసరిస్తామని అకాడమీ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు.

అయితే మహమ్మారి కారణంగా ఈ సారి ఆస్కార్​ అవార్డ్స్​ కార్యక్రమాన్ని కొంత ఆలస్యంగా.. 2021 ఏప్రిల్​ 25న నిర్వహించాలని అకాడమీ ఆఫ్​ మోషన్​ ఆర్ట్స్​ అండ్​ సైన్సెస్​ నిర్ణయించింది. ఈ పురస్కారాల వేడుకను కొంత ఆలస్యంగా నిర్వహించడం ద్వారా థియేటర్లు తెరచుకుని ఎక్కువ సినిమాలు విడుదలవ్వడానికి వీలు కలుగుతుందని అకాడమీ అభిప్రాయపడింది. దీంతో ఈ వేడుకకు ఎక్కువగా నామినేషన్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఎప్పటిలాగే వేడుక జరిగేలా అకాడమీ దృష్టి సారించింది.

93వ అకాడమీ అవార్డుల బరిలో ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్​ ఫిల్మ్ విభాగంలో భారత్​ నుంచి మలయాళ చిత్రపరిశ్రమకు చెందిన జల్లికట్టు పోటీలో ఉంది. ఆస్కార్​ రేసులో ఉన్న ఏకైక భారతీయ చిత్రమిదే. వచ్చే ఏడాది జరగనున్న అకాడమీ అవార్డుల షార్ట్​లిస్టును ఫిబ్రవరి 9న ఎంపికచేసి.. మార్చి 15న నామినేషన్లు ప్రకటిస్తారు.

ఇదీ చూడండి: దాదాసాహెబ్​ ఫాల్కే పురస్కార​ వేడుకకు ముహూర్తం ఖరారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.