ETV Bharat / sitara

Drugs case: ఆర్యన్​ ఖాన్​కు బెయిల్​ మంజూరు

author img

By

Published : Oct 28, 2021, 4:46 PM IST

Updated : Oct 28, 2021, 5:12 PM IST

aryan khan
ఆర్యన్​ ఖాన్​

16:44 October 28

ఆర్యన్​ ఖాన్​కు బెయిల్​ మంజూరు

క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ (Cruise Drugs Case) కేసులో అరెస్టయిన బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు (Aryan Khan) బెయిల్‌ మంజూరైంది. బాంబే హైకోర్టు గురువారం ఆర్యన్‌తో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచాలకు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో దాదాపు 20 రోజులకు పైగా జైలులో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యేందుకు మార్గం సుగమమైంది. బెయిల్‌ పిటిషన్‌పై బాంబే హైకోర్టులో మూడు రోజుల నుంచి సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఆర్యన్‌ ఖాన్‌ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ  వాదనలు వినిపించారు. ఈ వాదనల సందర్భంగా ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

కుట్రపూరితంగానే ఆర్యన్‌ను ఎన్‌సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారన్నారు. ఆర్యన్‌ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లభించలేదని.. డ్రగ్స్‌ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవని కోర్టుకు తెలిపారు.  మరి అలాంటప్పుడు ఆర్యన్‌ ఏవిధంగా సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారన్నారు. తనతో పాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి వద్ద డ్రగ్స్‌ దొరికితే.. ఆర్యన్‌ను ఎలా అరెస్టు చేస్తారు? 20 రోజులకు పైగా ఎలా జైలులో ఉంచుతారు? అని వాదనలు వినిపించారు. అతడి వయస్సును దృష్టిలో ఉంచుకొని ఆర్యన్‌కు బెయిల్‌ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని  కోరారు. ఎన్‌సీబీ తరఫున గురువారం ఏఎస్‌జీ అనిల్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. ఆర్యన్‌ డ్రగ్స్‌ వాడటం తొలిసారేమీ కాదని వాదించారు. డ్రగ్స్‌ విక్రేతలను చాలా సార్లు సంప్రదించాడనీ.. డ్రగ్స్‌ విక్రయించే ప్రయత్నంలోనూ ఉన్నట్టు తేలిందన్నారు. వాదోపవాదాలు విన్న బాంబే హైకోర్టు ఆర్యన్‌తో పాటు సహ నిందితులుగా ఉన్న అర్బాజ్‌, మూన్‌మూన్‌లకు బెయిల్‌ మంజూరు చేసింది. 

రేపో, ఎల్లుండో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం!

ఈ కేసులో పూర్తిస్థాయి కోర్టు ఆర్డర్‌ శనివారం వెలువడే అవకాశం ఉంది. ఆర్యన్‌ ఖాన్‌, అర్బాజ్‌ మర్చెంట్‌, మూన్‌మూన్‌ ధమేచాలో జైలు నుంచి రేపు లేదా ఎల్లుండి విడుదలై బయటకు వచ్చే అవకాశం ఉందని ముకుల్‌ రోహత్గీ మీడియాకు తెలిపారు.  

ఆర్యన్‌ ఖాన్‌ కేసులో ఏరోజు ఏం జరిగిందంటే..

  • అక్టోబర్‌ 2న ముంబయి-గోవా క్రూజ్‌ నౌకలో రేవ్‌ పార్టీపై ఎన్‌సీబీ అధికారులు  దాడులు చేశారు. ఆర్యన్‌ ఖాన్‌తో పాటు  అతడి స్నేహితుడు అర్బాజ్‌ మెర్చంట్‌, మూన్‌మూన్‌ ధమేచాలతో పాటు మరో ఐదుగురిని అరెస్టు చేశారు. 
  • అక్టోబర్‌ 3న ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టును ధ్రువీకరించారు. డ్రగ్స్‌కు సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్టు తెలిపారు. అదేరోజు ఆర్యన్‌తో పాటు ఏడుగురికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
  • అక్టోబర్‌ 4న ఆర్యన్‌ ఖాన్‌తో పాటు ఈ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై తొలిసారి వాదనలు జరిగాయి. అయితే, ఎన్‌సీబీ అక్టోబర్‌ 11 వరకు తమ కస్టడీకి అప్పగించాలని వాదించింది. ఆర్యన్‌ డ్రగ్స్‌ తీసుకున్నట్టు ఆధారాల్లేవని అతడి తరఫున్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, అక్టోబర్‌ 7వరకు కస్టడీని పొడిగిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.
  • అక్టోబర్‌ 7న ముంబయి ప్రత్యేక న్యాయస్థానం ఆర్యన్‌ ఖాన్‌తో పాటు ఏడుగురు నిందితులకు 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపుతూ ఆదేశాలు ఇచ్చింది.
  • అక్టోబర్‌ 8న ఆర్యన్‌ ఖాన్‌ను ముంబయిలోని ఆర్థర్‌ రోడ్డులో ఉన్న జైలుకు తరలించారు. 
  • అక్టోబర్‌ 10న బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ డ్రైవర్‌ వాంగ్మూలాన్ని ఎన్‌సీబీ రికార్డు చేసింది. 
  • అక్టోబర్‌ 11న బెయిల్‌ పిటిషన్‌పై విచారణను అక్టోబర్‌ 13కు న్యాయస్థానం వాయిదా వేసింది. రిప్లై దాఖలు చేయాలంటూ ఎన్‌సీబీని ఆదేశించింది.
  • అక్టోబర్‌ 14న ఆర్యన్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వులో ఉంచింది. దీంతో ఆర్యన్‌ ఖాన్‌ ఈ నెల 20వరకు జైలులోనే ఉండాల్సి వచ్చింది. 
  • అక్టోబర్‌ 20న విచారణలో ఆర్యన్‌కు ఎన్‌డీపీఎస్‌ ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది. ఈ కేసును ప్రాథమికంగా చూస్తే నిందితుడు తరచూ మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టుగా కనిపిస్తోందని అభిప్రాయపడింది. నిషిద్ధ  డ్రగ్స్‌ను చేరవేసేవారితో అతడు టచ్‌లో ఉన్నట్టుగా వాట్సాప్‌ చాట్‌ సంభాషణలను బట్టి తెలుస్తోందని న్యాయమూర్తి వీవీ పాటిల్‌ వ్యాఖ్యానించారు. బెయిల్‌పై విడుదలైతే ఇలాంటి మరో నేరం చేయరని చెప్పలేం..గనక బెయిల్ ఇవ్వలేం అని స్పష్టంచేశారు. దీంతో ఆర్యన్‌ తరఫు న్యాయవాది బెయిల్‌ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
  • అక్టోబర్‌ 26న బాంబే హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఆర్యన్‌ తరఫున మాజీ ఏజీ ముకుల్‌ రోహత్గీ, సతీశ్‌ మానెశిందే వాదనలు వినిపించారు. ఈ కేసులో ఆర్యన్‌ని కావాలనే ఇరికించి 20 రోజుల పాటు జైలులో ఉంచారని వాదించారు. తదుపరి వాదనలను ఈ నెల 27కు న్యాయస్థానం వాయిదా వేసింది.
  • అక్టోబర్‌ 27న బాంబే హైకోర్టులో ఆర్యన్‌తో పాటు సహనిందితులుగా ఉన్న అర్బాజ్‌ మర్చెంట్‌, మూన్‌మూన్‌ ధమేచాల బెయిల్‌ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. ఎన్‌సీబీ వాదనలు వినేందుకు సమయం లేకపోవడంతో విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈరోజు విచారించిన న్యాయస్థానం ముగ్గురికీ బెయిల్‌ ఇచ్చింది.
Last Updated :Oct 28, 2021, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.