ETV Bharat / science-and-technology

మరణాన్ని జయించాలనే మానవుని ఆశ తీరనుందా!

author img

By

Published : Dec 15, 2021, 8:42 AM IST

Updated : Dec 15, 2021, 10:29 AM IST

Immortality of humans: దీర్ఘకాల వ్యాధులు, తీవ్ర ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. మరి వ్యాధులను, వృద్ధాప్యాన్ని, మరణాన్ని జయించి మనిషి దీర్ఘాయుష్షును సొంతం చేసుకుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది? అందుకే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని ఎన్నెనో బయోటెక్‌ కంపెనీలు మరణాన్ని జయించటంపై దృష్టి సారించాయి. జీవ రీప్రోగ్రామింగ్‌తో కణాలను పునరుత్తేజం చేయటానికి సంకల్పిస్తోంది ఆల్టోస్‌ ల్యాబ్‌. ఇందులో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సైతం పెట్టుబడి పెట్టారు.

Immortality of humans
Immortality of humans

Immortality of humans: దీర్ఘాయుష్మాన్‌ భవ అని దీవిస్తాం. చిరంజీవ అని ఆశీర్వదిస్తాం. జరామరణాలను జయించాలనే మనలోని నిగూఢ ఆకాంక్షకివి ప్రత్యక్ష నిదర్శనాలు. అమరత్వాన్ని సాధించాలనే ఆశ ఈనాటిది కాదు. అనాదిగా మనిషిని ఊరిస్తున్నదే. కొందరికిది ఉత్త ఊహ. కొందరికి మాత్రం సాధన. ప్రయత్నిస్తే అసాధ్యమేమీ కాదనే తపన. అందుకే ఎన్నెనో బయోటెక్‌ కంపెనీలు మరణాన్ని జయించటంపై దృష్టి సారించాయి. ప్రపంచ కోటీశ్వరులు సైతం వృద్ధాప్యాన్ని ఓడించటానికి సై అంటున్నారు. జీవ రీప్రోగ్రామింగ్‌తో కణాలను పునరుత్తేజం చేయటానికి సంకల్పించిన ఆల్టోస్‌ ల్యాబ్‌లో ఇటీవల అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ పెట్టుబడి పెట్టటమే దీనికి నిదర్శనం. దీంతో అమరత్వ సాధన మరోసారి చర్చనీయాంశమైంది.

  • పళ్లు తోముకోవటానికి స్మార్ట్‌ బ్రష్‌ను నోట్లో పెట్టుకున్నారు. అది లాలాజలంలోని సూక్ష్మక్రిముల ద్వారా సమాచారాన్ని సేకరించి.. ఒంట్లో, చర్మం మీద అమర్చిన అతిసూక్ష్మ ఐఓటీ పరికరాలకు చేరవేస్తుంది. వీటి నుంచి అందే డేటాను చుట్టుపక్కల పరికరాలు విశ్లేషించి మరుక్షణంలో ఆరోగ్యం ఎలా ఉందో తెలియజేస్తాయి.
  • ఒంట్లో ఏదో భాగం చెడిపోయింది. ఆసుపత్రికి వెళ్లగానే దాన్ని తీసేసి, 3డీ ముద్రిత భాగాన్ని అమర్చారు. లేదూ.. అందులోని అవకరాన్ని సరిచేసి, బిగించారు.
  • రక్తనాళంలో పూడిక ఏర్పడింది. లోపల్నుంచే అతిసూక్ష్మ రోబోలు దాన్ని తొలగించేశాయి. ఎక్కడో కంతి ఏర్పడింది. దీన్నీ నానోబోట్లు లోలోపలే కత్తిరించేశాయి. అవసరమైన చోటుకు అవసరమైనంత వరకే మందులను చేరవేశాయి.
  • జన్యు సవరణతో పుట్టుకతో తలెత్తే లోపాలన్నీ మాయమయ్యాయి. మనుషులు మరింత బలంగా, దృఢంగా మారారు. క్యాన్సర్‌, మధుమేహం, అల్జీమర్స్‌ వంటి జబ్బుల బెడద అసలే లేదు.

Regenerative cell with biological reprogramming

ఇలాంటివి ఊహించుకుంటేనే ఎంతో ఆనందంగా ఉంది కదా. మరి ఇవే నిజమైతే? వ్యాధులను, వృద్ధాప్యాన్ని, మరణాన్ని జయించి మనిషి దీర్ఘాయుష్షును సొంతం చేసుకుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుంది? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడెన్నో సంస్థలు ఈ పనిలోనే నిమగ్నమయ్యాయి. జెఫ్‌ బెజోస్‌ పెట్టుబడి పెట్టిన ఆల్టోస్‌ ల్యాబ్స్‌ ఇలాంటి ప్రయత్నమే చేస్తోంది. చాలా బయోటెక్‌ సంస్థలు వృద్ధాప్యంతో ముడిపడిన జబ్బులను ఎదుర్కోవటం మీద దృష్టి సారిస్తుండగా.. ఆల్టోస్‌ ల్యాబ్స్‌ మాత్రం కణస్థాయిలో మొత్తం శరీరాన్ని పునరుత్తేజితం చేయాలని సంకల్పించింది. ఇలా మరణాన్ని నిలువరించాలని ఆశిస్తోంది. ఇందుకోసం ప్రథమంగా ప్రయోగశాలలో జీవ రీప్రోగ్రామింగ్‌ ద్వారా కణాలను పునరుత్తేజం చేయటానికి శ్రీకారం చుట్టింది. ఈ పరిజ్ఞానాన్ని అన్ని జంతువులకు వర్తింపజేయాలనీ భావిస్తోంది. చివరికిలా మనిషి శారీరక వయసును ఆపేసి, ఆయుష్షును వీలైనంత ఎక్కువగా పెంచటంపై కృషి చేస్తోంది. ఇందుకోసం పెద్ద పెద్ద జీతాలిస్తూ ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలను నియమించుకుంటోంది.

15 ఏళ్ల క్రితం ఆవిష్కరణే ఆధారం

అది 2006. షిన్య యమనక అనే శాస్త్రవేత్త వినూత్న పరిశోధనలో మునిగిపోయారు. కేవలం నాలుగు ప్రొటీన్లను (యమనక ఫ్యాక్టర్స్‌) అదనంగా జతచేస్తే ఏ కణాన్నయినా మూలకణంగా మార్చొచ్చని గుర్తించారు. ఇది ఎలుకల్లో వృద్ధాప్య లక్షణాలను తగ్గించటమే కాదు.. వీటి జీవనకాలాన్ని సగటున ఆరు వారాల వరకు పొడిగించినట్టు 2016లో నిరూపితమైంది కూడా. ఈ పద్ధతితోనే 2020లో ఎలుకలకు తిరిగి కంటిచూపును రప్పించటం గమనార్హం. ప్రస్తుతం ఆల్టోస్‌ ల్యాబ్స్‌ చేపట్టిన జీవ రీప్రోగ్రామింగ్‌కు ఆధారం ఇదే. ఎలుకల్లో సాధించిన విజయాలు ఏనాటికైనా మనుషుల ఆయుష్షును పెంచటానికి ఉపయోగపడగలవని ఆశిస్తున్నారు. అయితే ఇదంత తేలికైందేమీ కాదు. సాధించాల్సింది ఇంకా చాలానే ఉంది. ఈ పద్ధతితో ఎలుకల ఆయుష్షు పెరిగినా కొన్ని ఎలుకల్లో కణితులు ఏర్పడ్డాయనే సంగతిని మరవరాదని శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు.

  • ఆల్టోస్‌ ల్యాబ్స్‌ 'జీవ గడియార' పరిజ్ఞానాన్నీ వినియోగించుకోనుంది. దీన్ని స్టీవ్‌ హార్వత్‌ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. దీంతో కణాల, జీవుల వయసును కచ్చితంగా కొలవచ్చు. వయసును మళ్లించే చికిత్సల ప్రభావాలను, సామర్థ్యాన్ని గుర్తించటానికి దీన్ని వాడుకోవాలని భావిస్తున్నారు.

ఎన్నెన్నో సంస్థలు

మరణాన్ని జయించే ప్రయత్నం ఆల్టోస్‌ ల్యాబ్స్‌తో తాజాగా చర్చలోకి వచ్చింది గానీ దీనిపై ఇంతకుముందు నుంచే ఎన్నెన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి.

  • కాలిఫోర్నియాలోని యూనిటీ బయోటెక్నాలజీ అనే అంకుర సంస్థ వృద్ధాప్య లక్షణాలను వెనక్కి మళ్లించటానికి, తగ్గించటానికి మందులు రూపొందిస్తోంది. ఇది తయారుచేసిన యూబీఎక్స్‌0101 మందుపై నిర్వహించిన రెండో దశ ప్రయోగ పరీక్షలు సకాలంలో పూర్తికాలేదు గానీ లేకపోతే దీని ఫలితాలు ఇప్పటికే తెలిసి ఉండేవి.
  • గూగుల్‌ దన్నుతో పనిచేస్తున్న కాలికో ల్యాబ్స్‌ 2013 నుంచీ ముసలితనాన్ని జయించే మందుల ఆవిష్కరణపై దృష్టి సారించింది. వృద్ధాప్యం ఎలా సంభవిస్తుంది? వయసుతో పాటు తలెత్తే జబ్బులను ఎదుర్కోవటమెలా? అనేవి గుర్తించటం దీని ఉద్దేశం.
  • ఏజ్‌ఎక్స్‌థెరపెటిక్స్‌, బ్రిటన్‌కు చెందిన షిఫ్ట్‌ బయోసైన్సెస్‌, అమెరికాకు చెందిన లైఫ్‌ బయోసైన్సెస్‌ వంటి సంస్థలూ కణాల రీప్రోగ్రామింగ్‌ ద్వారా జీవనకాలాన్ని పొడిగించటానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

"మీరు చేయాల్సిన పని మరణాన్ని అరికట్టటం. చావును నివారించటానికి జీవులు చురుకుగా పనిచేయకపోతే అవి చివరకు తమ పరిసరాల్లో కలిసిపోతాయి. స్వయం ప్రతిపత్తి గల జీవులుగా అస్తిత్వం కోల్పోతాయి. మరణించినప్పుడు జరిగేది ఇదే." జీవశాస్త్రవేత్త రిచర్డ్‌ డాకిన్స్‌ రాసిన పుస్తకంలోని పంక్తులివి. జెఫ్‌ బెజోస్‌ తమ వాటాదారులకు రాసిన చివరి ఉత్తరంలో వీటినే ఉటంకించారు. విశిష్టత, వాస్తవికత, ప్రత్యేకతలను కాపాడుకోవటానికి దేశాలు, కంపెనీలు, వ్యక్తులు పోరాడాల్సి ఉంటుందనేది ఆయన భావన. బెజోస్‌ ఉద్దేశం ఏదైనా మరణాన్ని జయించాలనే మానవాళి చిరకాల కాంక్ష ఇందులో గోచరిస్తుందనటం నిస్సందేహం. ఇంతకుముందెన్నడూ ఇన్ని పరికరాలు, ఇంత విజ్ఞానం, ఇంత టెక్నాలజీ లేవు. ఇంత సమాచార స్రవంతీ లేదు. వైద్యశాస్త్రం ప్రజా బాహుళ్యంలోకి చొచ్చుకెళ్లింది. జన్యు సవరణ పద్ధతులు సరళమవుతున్నాయి. అధునాతన చికిత్సలు రోజురోజుకీ కచ్చితత్వాన్ని సాధిస్తున్నాయి. అందరికీ అందుబాటులో ఉండేలా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సాధించకపోతే మరణాన్ని ఇంకెప్పుడు జయిస్తామన్నదే శాస్త్రవేత్తలు, పరిశోధకుల మనసుసులో మెదులుతున్న ప్రశ్న.

ఇదీ చూడండి: Oppo Foldable Phone: ఒప్పో నుంచి ఫోల్డబుల్ ఫోన్​- ఫీచర్లు లీక్​!

Last Updated : Dec 15, 2021, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.