ETV Bharat / science-and-technology

30కోట్ల ఉద్యోగాలపై 'ఏఐ' ప్రభావం.. డేంజర్​లో ఉన్న జాబ్స్ ఇవే!

author img

By

Published : Apr 22, 2023, 1:25 PM IST

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) సాంకేతికతలో కనిపిస్తున్న పురోగతి 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇదివరకే అంచనా వేసింది. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయే రంగాలు ఏవో ఓ సారి తెలుసుకుందాం.

ai reduce jobs
ai reduce jobs

కృత్రిమ మేధ(AI) వల్ల భారీ స్థాయిలో ఉద్యోగాలు పోతాయంటే కొన్నేళ్ల కిందట వరకు ఎవరూ నమ్మలేదు. కానీ ఎప్పుడైతే చాట్​బాట్​ చాట్​జీపీటీ రంగ ప్రవేశం చేసిందో అప్పటి నుంచి అందరూ దీన్ని నమ్మడం మొదలుపెట్టారు. చాట్​జీపీటీ వల్ల కృత్రిమ మేధ సత్తా ఏంటో అందరికీ తెలిసొచ్చింది. దీని వల్ల ఉన్న ఉపయోగాలను పక్కనబెడితే.. వేర్వేరు రంగాల్లో కోట్లాది మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. కృత్రిమ మేధ వల్ల సాఫ్ట్​వేర్​ సహా పలు రంగాల్లో ఉద్యోగాలు పోయే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు నిపుణులు. దీంతో ఆయా రంగాల్లో ఉన్న ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ప్రభావం గణనీయంగా పడే జాబ్స్ ఏవనేది ఓ సారి తెలుసుకుందాం.

ప్రస్తుతానికైతే కృత్రిమ మేధ వల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం లేదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు, ఏఐ టూల్స్ అభివృద్ధి చేస్తున్న వ్యాపారవేత్తలు అంటున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా మరో నాలుగైదేళ్లలో మాత్రం కృత్రిమ మేధ వల్ల ఉద్యోగులకు సమస్యలు తప్పకపోవచ్చని చెబుతున్నారు. 2020లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఓ కథనం ప్రచురించింది. అందులో 2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా 85 మిలియన్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని కథనంలో పేర్కొంది.

అయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం కథనానికి భిన్నంగా మెకినే ఓ కథనాన్ని ప్రచురించింది. 2021లో వచ్చిన మెకినే నివేదిక ప్రకారం.. 2030 సంవత్సరం నాటికి 45 మిలియన్ల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుందని పేర్కొంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికతలో కనిపిస్తున్న పురోగతి 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఏఐ వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగాలు ఏంటో చూద్దాం.

ఎంట్రీ లెవల్ అడ్మిన్ రోల్స్..
పరిపాలనా విభాగంపై ఏఐ ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈ విభాగానికి సంబంధించి నోట్స్ రాయడం, తప్పొప్పులు చూడటం, స్ప్రెడ్ షీట్స్ నిర్వహణ లాంటి పనులను ఇప్పటికే చాట్​జీపీటీ విజయవంతంగా చేస్తోంది. మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన కోపైలట్ ఫీచర్ కూడా ఇలాంటిదే. దీని వల్ల వీడియో కాన్ఫరెన్సింగ్ మీటింగ్స్ మొత్తం సారాంశాన్ని నోట్ ఫామ్​లోకి మార్చుకోవచ్చు. ఇలాంటి ఏఐ టూల్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. దీని వల్ల అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేసే వారి ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని అంటున్నారు నిపుణులు.

డేటా ఎంట్రీ క్లర్క్స్
డేటా ఎంట్రీ ఉద్యోగాల మీదా ఏఐ తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు అంటున్నారు. ఫైనాన్షియల్ అనాలిసిస్, డేటా అనాలిసిస్, మెడికల్ డయాగ్నోసిస్ లాంటి జాబ్స్ చేస్తున్న వారి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏఐ వచ్చిన తర్వాత డేటా ఎంట్రీకి గంటల కొద్దీ సమయం పట్టట్లేదు. వేగంగా డేటా ఎంట్రీని ఏఐ పూర్తి చేసేస్తోంది. అందుకే డేటా ఎంట్రీ ఉద్యోగులకు ముప్ప తప్పదని హెచ్చరిస్తున్నారు.

సాఫ్ట్​వేర్​ ఇంజినీర్స్, కోడర్స్..
ఏఐ వల్ల ఐటీ రంగ ఉద్యోగులకు ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఏఐ ఆధారిత చాట్​బాట్​ చాట్​జీపీటీ బేసిక్ సాఫ్ట్​వేర్​ కోడింగ్ రాస్తుండటాన్ని గమనించే ఉంటారు. కోడింగ్ విషయంలో కృత్రిమ మేధ మరింత పురోగతి చెందితే జూనియర్ సాఫ్ట్​వేర్ ఇంజినీర్స్ సహా కోడర్స్​కు ప్రమాదమే. చాట్​జీపీటీని రూపొందించిన ఓపెన్​ఏఐ సంస్థ ఇప్పటికే కోడెక్స్ అనే కృత్రిమ మేధ ఆధారిత కోడింగ్ సాఫ్ట్​వేర్​ తయారీపై పనిచేస్తోంది. అమెజాన్, శామ్​సంగ్​ సంస్థ ఉద్యోగులు కోడింగ్ కోసం చాట్​జీపీటీని వాడుతున్నారని సమాచారం.

కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్..
కస్టమర్ సర్వీస్ రిక్వెస్టులను పరిష్కరించేందుకు ఇప్పటికే కొన్ని సంస్థలు ఏఐ సాయాన్ని తీసుకుంటున్నాయి. ఈ తరహా ఉద్యోగాల్లో మనుషులను నియమించేంత ఆర్థికంగా బలంగా లేని చిన్న సంస్థలు ఏఐ సేవలను వినియోగించుకుంటున్నాయి.

లీగల్ అసిస్టెంట్స్..
ఏఐ వల్ల ఉద్యోగులకు ఎసరు ఉన్న రంగాల్లో న్యాయ రంగం కూడా ఉంది. ఇప్పటికే ఏఐ ఆధారిత లీగల్ అసిస్టెంట్స్ అందుబాటులోకి వచ్చేశాయి. వీటిలో కొన్ని ఉచితంగా న్యాయపరమైన సలహాలను అందిస్తుంటే.. మరికొన్ని మాత్రం సేవల కోసం కొంత మొత్తాన్ని ఛార్జ్ చేస్తున్నాయి.

జర్నలిజంపై ప్రభావం..
జర్నలిజంపైనా కృత్రిమ మేధ తీవ్ర ప్రభావం చూపునుందని నిపుణులు అంటున్నారు. చాట్​జీపీటీ వంటి చాట్​బాట్స్ వల్ల జర్నలిస్టుల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని చెబుతున్నారు. కంటెంట్ రైటర్లు, ఎడిటర్ల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే చాలా వెబ్​సైట్లు ఏఐని ఉపయోగిస్తూ వార్తలను రాయడం మొదలుపెట్టేశాయని సమాచారం.

గ్రాఫిక్ డిజైనర్స్..
సోషల్ మీడియా వినియోగం పెరిగినప్పటి నుంచి గ్రాఫిక్ డిజైనర్లకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. అయితే ఏఐ వల్ల ఈ ఉద్యోగాలకూ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే డాల్-ఈ లాంటి గ్రాఫిక్ ‌‌ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చేశాయి. మరోవైపు.. ఆర్థిక రంగానికి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఏఐ వల్ల పోవచ్చని నిపుణులు అంటున్నారు. బ్యాంకింగ్ రంగంలోనూ ఏఐ వల్ల ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఫ్యాక్ట్ చెకర్స్, ప్రూఫ్ రీడర్స్
బార్డ్, చాట్​జీపీటీలు ప్రతి ప్రశ్నకు కచ్చితత్వంతో సమాధానం చెప్పే పరిస్థితి లేదు. అందుకే వాటికి మరిన్ని మెరుగులు దిద్ది తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ యూజర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పే స్థాయికి అవి అభివృద్ధి చెందితే.. ఫ్యాక్ట్ చెకర్స్​ గానూ వాటిని వాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు. సమాచారాన్ని నిజ నిర్ధారణ చేయడానికి మనుషులకైతే గంటల కొద్ది సమయం పడుతుంది. అదే ఏఐ ఆధారిత టూల్స్ అయితే క్షణాల్లో ఈ పనులు చేసేస్తాయి. ఆ దిశగా టూల్స్ అభివృద్ధి వేగంగా జరుగున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.