ETV Bharat / opinion

సకల రుచుల యందు.. దాని రుచే వేరయా..!

author img

By

Published : Apr 4, 2021, 7:26 AM IST

ఉగాది దగ్గర పడేసరికి తెలుగువారి ఇళ్లలో ఒకప్పుడు ఊరగాయల సందడి ఆరంభమయ్యేది. ఇంటింటా చిన్నతరహా తిరణాల కోలాహలం రాజ్యమేలేది. ఆవకాయ పెట్టడమంటే ఆషామాషీ కాదు. అదొక రసవత్తర ప్రక్రియ.

avakai
avakai, kotta avakai, ugadi avakai

‘ఆమ్ర ఫలము కోసి ఆవఠేవను చేర్చి నేవళీక మొప్ప నేర్పుగాను మిరప కారము ఉప్పు మెంతులు జతగూర్చి పప్పునూనె వంపి తిప్పి తిప్పి...’ ముక్కలు సమంగా గుచ్చెత్తిపోయడం, ఒబ్బిడిగా జాడీలకెత్తడం... ఎంత చాకిరీ! అయితేనేం? వేడివేడి అన్నంలో ఎర్రని కొత్తావకాయ కలిపి మధ్యమధ్యలో హైయంగ వీనాన్ని(తాజా వెన్న) నాలిక్కి రాసుకుంటూ, రాచ్చిప్పలోని పప్పుపులుసు పోసుకు తింటుంటే మహాప్రభో! కడుపే కైలాసమన్న మాట గుర్తుకు రాదూ! కొండేపూడి కవి చెప్పినట్లు ‘మహాద్భుత మాయకు ఆవకాయకున్‌’ ఈ పిజ్జా బర్గర్లతో దిష్టి తీయాలనిపించదూ! ఇప్పుడంటే ఈ కంగాళీ తిళ్లు(ఫాస్ట్‌ ఫుడ్స్‌) వచ్చిపడి చవి చచ్చిపోయింది గాని, గడ్డపెరుగు మాగాయ టెంకతోనే కదా- ఇదివరకు మన పిల్లగాళ్లకు తెల్లవారేది! ఇంగ్లిషు చదువులు వెలగబెట్టిన గిరీశం ‘చల్దివణ్ణం’ తింటాడో లేదోనని కన్యాశుల్కంలో బుచ్చెమ్మకు సందేహం వచ్చింది గాని, మనకు రాదు- చద్ది అన్నం మన పిల్లలు తినరు, మనం పెట్టం! ‘అరుణగభస్తి బింబము ఉదయాద్రి పయిం బొడతేర, గిన్నెలో పెరుగును వంటకంబు, వడ పిందియలుం కుడువంగ బెట్టు...’ అద్భుత ఆహార విధానం గురించి శ్రీనాథుడు చెప్పినా మనకది రుచించదు. ‘మాటిమాటికి వ్రేలు మడిచి ఊరించుచు ఊరుగాయలు తినుచుండు...’ పిల్లగాయల గురించి భాగవతం చెప్పినా మనం వినం. కృష్ణదేవరాయలు వివరించిన ‘బహుళ సిద్ధార్థ(ఆవ) జంబాల సారంబులు, పటు రామఠ(ఇంగువ) ఆమోద భావితములు, శాకపాక రసావళీ సౌష్ఠవముల...’ పస గురించి బొత్తిగా పట్టించుకోం.

ఊరగాయల సంగతి సరే, అన్నం ఎలా వడ్డించాలో విశ్వనాథ చెప్పారు. దశరథుడి పుత్రకామేష్టి యాగ సందర్శకులను కూర్చోబెట్టి ‘ఇపుడె గుండిగ దింపి యిగుర బెట్టితి, పొడి పొళ్లాడు ఈ అన్నమును తినుండు... పూర్ణము లేకుండ పునుకులుగా వేసితిమి- కరకరలాడు తినుడు వీని...’ అంటూ మర్యాదగా మారొడ్డించేవారట. ‘ఇది గడ్డపెరుగు... చలువ చేయును కదండి మీరింక కొంచెము వేసికొనవలె’నంటూ కొసరి కొసరి తినిపించేవారట. వరదబాధితుల్లా వరసలో నిలబడి తినడాలు లేవప్పుడు. వండటం వడ్డించడమే కాదు, తినడంలోనూ గొప్ప కళాత్మకత ఉట్టిపడేది. భోజనమంటే గొప్ప వైభోగమనిపించేది. అడుగడుగునా ఆరోగ్య సూత్రాలు ఆశ్చర్యపరచేవి.

చేపలను శనగ జొన్న మైదాపిండిలో ముంచి దోరగా వేయించుకు తినేయడం కాదు... సాయంత్రానికి గొంతులో నుస, తేన్పుల బెడద తప్పాలంటే- పొద్దున్నే కొబ్బరిబొండాలు చెక్కించి ఇసుకలో పాతిపెట్టి ‘సంధ్యావేళలన్‌ కేళికాంతార అభ్యంతర వాలుకాస్థిత(ఇసుకలో దాచిన) హిమాంతర్నారి కేళాంబువుల్‌...’ చల్లని లేత కొబ్బరినీరు తాగి తేరుకోవాలని సూచించాడు కృష్ణదేవరాయలు. కోడి మాంసం వేడి చేస్తుందని జున్ను... ఉలవచారు తాపం తట్టుకొనేందుకు పెరుగుమీద చిక్కని మీగడ... కలిపి సేవించేవారు మన పెద్దలు. పోషకాహార ప్రాధాన్యం పట్ల వారికి గల అవగాహన హరప్పా నాగరికత నాటిదని తాజా పరిశోధనల్లో తేలింది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే పలు ధాన్యాల (మల్టీ గ్రెయిన్‌)తో చేసిన లడ్డూలు ఇటీవల పాక్‌ సరిహద్దుల్లోని బింజోర్‌ ప్రాంతాన తవ్వకాల్లో బయటపడ్డాయి. పాచిపోకుండా ఇన్నాళ్లు ఎలా నిలవున్నాయో తెలియక పరిశోధకులు ఆశ్చర్యపోతున్నారు. ఏడాది పొడుగునా బూజుపట్టకుండా ముక్క మెత్తబడకుండా ఆవకాయ పెట్టిన మన బామ్మలకు బహుశా తెలుసునేమో... ఆ రహస్యం!

ఇదీ చూడండి: షడ్రుచుల ఉగాది పచ్చడిలో ఔషధ విలువలెన్నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.