ETV Bharat / opinion

ఆడబిడ్డల పట్ల దుర్విచక్షణ ఏనాటికైనా అంతమయ్యేనా..?

author img

By

Published : Oct 10, 2020, 7:57 AM IST

దేశవ్యాప్తంగా ప్రతి రోజూ 87 అత్యాచారాలు జరుగుతున్నట్లు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హాథ్రస్‌, బలరాంపూర్‌ వంటి హత్యాచార ఘటనలు భారత్‌లో ఆడపిల్లలకు రక్షణ కొరవడిందన్న విషయాన్ని నిరూపిస్తున్నాయి. ఈ ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని(అక్టోబర్​ 11) 'నా గళం.. నా భవిష్యత్తు' అనే నినాదంతో జరుపుకొంటున్న తరుణంలో- లింగపరమైన దుర్విచక్షణకు తావులేని సమసమాజం ఏనాటికైనా ఆవిష్కృతమవుతుందా అన్నదే ప్రశ్నగా మిగిలింది.

on international girl child day 2020 experts are asking when wll be the society without gender discrimination
ఆడబిడ్డల పట్ల దుర్విచక్షణ ఏనాటికైనా అంతమయ్యేనా..?

దుర్విచక్షణలేని సమాజం కావాలని ప్రపంచవ్యాప్తంగా బాలికలు గళం విప్పుతున్నారు. లైంగిక హింసకు తావులేని సమాజం కోసం; ఆరోగ్య వ్యవస్థలు అందరికీ అందుబాటులో ఉండే వాతావరణం కోసం; విద్యా నైపుణ్యాలు అందరికీ సమానంగా అందుబాటులో ఉండే ప్రపంచంకోసం- దశాబ్దాలుగా మహిళాలోకం ఉద్యమిస్తోంది. సమాజంలో ఆదర్శనీయ మార్పులకోసం పరితపిస్తోంది. ఈ నేపథ్యంలో హాథ్రస్‌, బలరాంపూర్‌ వంటి హత్యాచార ఘటనలు భారత్‌లో ఆడపిల్లలకు రక్షణ కొరవడిందన్న విషయాన్నే నిరూపిస్తున్నాయి. ఈ ఏడాది అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని 'నా గళం.. నా భవిష్యత్తు' అనే నినాదంతో జరుపుకొంటున్న తరుణంలో- లింగపరమైన దుర్విచక్షణకు తావులేని సమసమాజం ఏనాటికైనా ఆవిష్కృతమవుతుందా అన్నదే ప్రశ్నగా మిగిలింది.

రోజూ 87 అత్యాచారాలు..

జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) అంచనాల ప్రకారం- 2019లో భారత్‌లో మహిళలపై నాలుగు లక్షలకుపైగా అఘాయిత్య ఘటనలు చోటుచేసుకోగా, అందులో దాదాపు 32వేలు అత్యాచార కేసులే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి రోజూ 87 అత్యాచారాలు జరుగుతున్నట్లు, అంత క్రితం ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు 7.3శాతం పెరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాజస్థాన్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌లలో మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు అధికంగా నమోదైనట్లు ఆ సంస్థ పేర్కొంది.

ప్రతి ముగ్గురిలో ఒకరు..

ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఇవే పరిస్థితులున్నట్లు ‘ఐరాస జనాభా నిధి’ నివేదిక వెల్లడించింది. ‘సమితి’ సభ్యదేశాల్లోని మహిళల స్థితిగతులు, వారిపై నిత్యం జరుగుతున్న హత్యాచారాలు, హక్కుల హరణ వివరాలను ఆ నివేదిక బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా రోజూ సుమారు 33వేల బాల్య వివాహాలు జరుగుతున్నాయని; పుడుతున్న ప్రతి ముగ్గురు ఆడశిశువుల్లో ఒకరిని లింగ దుర్విచక్షణ కారణంగా పురిట్లోనే కోల్పోతున్నట్లు ఆ నివేదిక విస్తుగొలిపే వాస్తవాలను స్పష్టం చేసింది. మహిళలకు సంబంధించిన 19రకాల హక్కులను దారుణంగా ఉల్లంఘిస్తున్నారని పేర్కొంది.

పెరిగిన అక్రమ రవాణా..

భారత్‌లో 2013-17 మధ్యకాలంలో ఏటా సగటున నాలుగు లక్షల 60వేల భ్రూణహత్యలు జరిగినట్లు గణాంకాలున్నాయి. చైనాలో 'ఒకే బిడ్డ' విధానాన్ని సవరించి 2015లో కొత్త ఉత్తర్వులను అమల్లోకి తెచ్చారు. దాంతో ఆ దేశంలో లింగ నిర్ధారణ పరీక్షలు విపరీతంగా పెరిగాయి. వారసుడిని పొందాలన్న కారణంతో లక్షలమంది చైనీయులు భ్రూణహత్యలకు తెగబడ్డారు. కనిపించకుండాపోతున్న బాలికల శాతం ఒక్కపెట్టున పెరిగింది. బాల్యవివాహాలు పెరగడంతో బాలికల అక్రమ రవాణా అడ్డూ ఆపూ లేకుండా విస్తరించింది.

మార్పునకు ప్రతినిధులుగా..

ప్రపంచవ్యాప్తంగా సంకెళ్లను తెగతెంచుకుని బాలికలు సామాజిక మార్పునకు వాహికలుగా ఉద్యమిస్తున్న తరుణమిది. స్వీడన్‌కు చెందిన గ్రెటా థున్‌బర్గ్‌ అనే బాలిక ప్రభుత్వాలు పర్యావరణానికి చెరుపు చేసే విధానాలను అనుసరిస్తున్నాయంటూ ఏకంగా ఆ దేశ పార్లమెంటు ముందే నిరసనకు దిగి- ప్రపంచవ్యాప్తంగా బాలికల్లో చైతన్యం నింపింది.

నేహా అని నేపాల్‌ బాలిక అంతర్జాలంలో బాలికలపై జరుగుతున్న మానసిక హింసపై గళమెత్తి, దేశంలోని ప్రతి ఒక్కరిలోనూ 'ఆన్‌లైన్‌' అవగాహన కల్పిస్తోంది. బాలికావిద్య గురించి బలంగా గళమెత్తిన గాంబియాకు చెందిన జకొంబ జబ్బి, లింగ సమానత్వాన్ని కోరుతూ అనేక సంస్థలను ప్రారంభించి ఉద్యమిస్తున్న రొమేనియాకు చెందిన సోఫియా స్కార్లట్‌ వంటివారు మార్పునకు ప్రతినిధులుగా నేడు మనముందున్నారు.

ఎప్పడో నిరూపితమైంది..

ఆడపిల్లకు అవకాశం ఇస్తే ఏ స్థాయిలో ముందుకు వెళతారో పరుగుల రాణి పీటీ ఉష మొదలు మాలావత్‌ పూర్ణ వరకూ నిరూపితమైంది. పితృస్వామిక సమాజం విధించిన అనేక కట్టుబాట్లను దాటుకొని ఇప్పుడిప్పుడే భిన్న రంగాల్లో ప్రతిభను చాటుకుంటున్న బాలికలకు చేయూతను ఇవ్వాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

బాలికలపట్ల దుర్విచక్షణ- ఇప్పటికీ అపరిష్కృత సామాజిక సమస్యగానే మనముందుండటం బాధాకరం. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వివిధ పథకాలు బాలికల విద్యాభివృద్ధి, సాధికారతకు సంబంధించి కొంత పురోగతిని సాధ్యం చేసినప్పటికీ- ఇంకా జరగాల్సింది ఎంతో మిగిలే ఉంది. ఆడపిల్లను అడుగు ముందుకు వేయనీయకుండా వెనక్కి లాగుతున్న ఛాందస కట్టుబాట్లను క్రమంగా తొలగించుకోవాలి. రాజ్యాంగం సూచించిన లింగ సమానత్వ సాధనకోసం ప్రతి ఒక్కరూ ప్రతిన పూనాలి.

on international girl child day 2020 experts are asking when wll be the society without gender discrimination
సమైరా మెహతా

స్ఫూర్తికళిక... సమైరా మెహతా

ఆడుతూ పాడుతూ తల్లిదండ్రుల చాటున గడపాల్సిన పదకొండేళ్ల వయసులో సమైరా మెహతా కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో పలువురికి శిక్షణనిస్తోంది. అమెరికాకు చెందిన ఈ బాలిక- తన ఈడు పిల్లలు ఆడుకునేందుకు కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌, కృత్రిమ మేధ కాన్సెప్ట్‌లను నేర్పించే గేమ్‌ను ఆవిష్కరించింది. 'కోడర్‌బన్నిజ్‌' అనే కంపెనీని స్థాపించి, దానికి సీఈఓగా మారింది. కేవలం ఏడాదిలోనే 35 వేల అమెరికన్‌ డాలర్లు సంపాదించి, సిలికాన్‌ వ్యాలీ దృష్టిని ఆకట్టుకుంది. లింగ సమానత్వంకోసం పాటుపడే ఈ తరం ఆడపిల్లలంతా సంఘటితమైతే సాధించలేని అద్భుతమేమీ ఉండబోదని ఈ చిన్నారి అంటోంది.

- డాక్టర్‌ మారోజు స్వర్ణలత

(కాకతీయ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌)

ఇదీ చూడండి:ఎవరికో కొమ్ము కాస్తూ.. సంస్కారానికి నిప్పు పెట్టేశారే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.