ETV Bharat / opinion

కారాగారాలు దిద్దుబాటలో నడిస్తే సంస్కరణలకు నిలయాలే

author img

By

Published : Oct 9, 2020, 7:38 AM IST

కారాగారాలను శిక్షా కేంద్రాలుగానే కాకుండా నేరస్తుల సంస్కరణ నిలయాలుగా పరిగణించాలి. ఖైదీల ప్రాథమిక హక్కులను గుర్తించి అమలు చేయడం ముఖ్యం. ఒక ఖైదీని మానవ సానుభూతికి అర్హమైన మనిషిగా పరిగణించాల్సిన అవసరం ఉందని భారత సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టంచేసింది. కానీ, వారి ప్రాథమిక హక్కులను కాలరాస్తూ- సరిపడా జైళ్లను కూడా అందుబాటులోకి తీసుకురాలేక పోతున్నాయి ప్రభుత్వ యంత్రాంగాలు.

experts says jails should be change as reform centers for criminals
దిద్దుబాటలో నడవాల్సిందే! శిక్షణకు నెలవు కావాల్సిన జైళ్లు

దేశంలో పెచ్చరిల్లుతున్న నేర సంఘటనలతో నేరస్తుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. మరోవైపు, విచారణ ఖైదీలకు సరైన సమయంలో బెయిలు మంజూరు కాకపోవడం వల్ల నెలల తరబడి జైళ్లల్లోనే మగ్గుతున్నారు. ఫలితంగా కారాగారాలు కిక్కిరిసిపోతున్నాయి. దీనివల్ల పాలనపరంగానూ అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కారాగారాలను శిక్షా కేంద్రాలుగానే కాకుండా నేరస్తుల సంస్కరణ నిలయాలుగా పరిగణించాలి. ఇందుకు ఖైదీల ప్రాథమిక హక్కులను గుర్తించి అమలు చేయడం ముఖ్యం. ఒక ఖైదీని ప్రాథమిక హక్కులతోపాటు మానవ సానుభూతికి అర్హమైన మనిషిగా పరిగణించాల్సిన అవసరం ఉందని భారత సర్వోన్నత న్యాయస్థానం గతంలోనే స్పష్టంచేసింది. కానీ ఖైదీల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ- వారికి సరిపడా జైళ్లను కూడా అందుబాటులోకి తీసుకురాలేక పోతున్నాయి ప్రభుత్వ యంత్రాంగాలు. ఖైదీల హక్కులను గుర్తించి తదనుగుణంగా పరిస్థితులను మెరుగుదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది.

సౌకర్యాల కొరత

దేశంలోని ప్రముఖ జైళ్లలో కొంతమేర మెరుగైన సౌకర్యాలున్నా- చాలావాటిలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు లేక ఖైదీలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. సరైన ఆరోగ్య సౌకర్యాలు లేక అనారోగ్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ అధికారిక నివేదిక ప్రకారం అత్యధికంగా కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో గత ఏడాది కాలంలో పలువురు ఖైదీలు ఆస్పత్రుల పాలు కావడం అక్కడి దుర్భర పరిస్థితులను ఎత్తిచూపుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఖైదీలకు సరైన సమయంలో చికిత్స అందించక పోవడంతో అకాల మరణం చెందుతున్నారనేది నిష్ఠుర సత్యం.

గడిచిన మూడేళ్ళ కాలంలో ఏకంగా సుమారు 5 వేలకుపైగా ఖైదీలు పలు కారణాలతో మృత్యువాత పడటం అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది. ఖైదీల సంక్షేమం కోసం 2014-19 మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన బడ్జెట్‌లో ఖర్చు చేసిన నిధులు పదిశాతం లోపే. ఖైదీల సంక్షేమంపై అధికారుల చిత్తశుద్ధి అంతంత మాత్రమేనని దీనిద్వారా స్పష్టమవుతోంది.

అందుబాటులో ఉన్న నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకొని ఖైదీల సంక్షేమానికి పాటు పడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగానిదే. గతంలో బెంగళూరు కేంద్ర కారాగారంలో అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఇద్దరు సీనియర్‌ అధికారులు బదిలీ కావడంతో దేశంలోని జైళ్ల పరిస్థితిపై చర్చ జరిగింది. ఆ సంఘటన జైళ్ల శాఖలో పేరుకుపోయిన అవినీతికి నిదర్శనంగా నిలిచింది.

మహిళా ఖైదీలకు రక్షణ..

ప్రస్తుతం దేశంలో మహిళా ఖైదీలకు సరిపడా ప్రత్యేక జైళ్లు లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. మహిళా ఖైదీలు ఉండే ప్రదేశాల్లో పురుష సిబ్బంది విధులు నిర్వహించకూడదనే నిబంధనలు ఉన్నా పట్టించుకునేవారే కరవయ్యారు. ఇది మహిళా ఖైదీల హక్కులను కాలరాయడమే. మహిళా ఖైదీల కోసం మహిళా సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉంది.

మహిళా ఖైదీలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా- దేశంలో వివిధ జైళ్లల్లో 31శాతం మేర సిబ్బంది కొరత ఉంది. ఖాళీలను సత్వరమే భర్తీ చేస్తే ప్రస్తుతమున్న సిబ్బందిపై పని భారం తగ్గే అవకాశముంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జైళ్లల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో 55శాతానికే నివాస వసతులు అందుబాటులో ఉన్నాయి. సిబ్బందికి పూర్తి స్థాయిలో నివాస గృహాలు ఏర్పాటు చేస్తేనే, విధి నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు తల్తెవు.

ఖైదీలకు పునర్జన్మనిచ్చేలా..

మోడల్‌ జైలు మాన్యువల్‌-2016 ప్రకారం జైళ్లల్లో అనేక సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగానే 2019లో 1.14 లక్షల మంది ఖైదీలు చదువుకున్నారు. అహ్మదాబాద్‌, వడోదర కేంద్ర కారాగారాల్లో అధికారులు స్వచ్ఛంద సంస్థల ద్వారా మహిళా ఖైదీలకు విద్యతో పాటు సంగీత శిక్షణ కల్పించారు. ఖైదీలకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ప్రజలకు ఉపయోగపడే పలు రకాల వస్తువులు ఉత్పత్తి అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో ఖైదీలు చేసిన ఉత్పత్తుల ద్వారా ఇప్పటివరకు సుమారు రూ.599.89 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరడం గమనార్హం.

ఖైదీల మెరుగైన జీవన విధానానికి..

ఖైదీలను అనవసరంగా నిర్బంధించకుండా చూసేందుకు సరైన యంత్రాంగాన్ని రూపొందించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలి. జైళ్లలో రద్దీని తగ్గించాలంటే బెయిల్‌ ప్రక్రియను, విధివిధానాలను సరళీకృతం చేసి ఖైదీల కేసులను ఎప్పటికప్పుడు సమీక్షించాలి. వీలైనంత మేరకు విచారణ ఖైదీలను ప్రత్యేక గదులకు పరిమితం చేయాలి. ఖైదీల మెరుగైన జీవన విధానానికి సరైన వసతి, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆహారం, దుస్తులు, వైద్య సదుపాయాలు వంటివన్నీ సరైన రీతిలో అందించాలి.

అనారోగ్యంతో బాధపడే ఖైదీలకు ప్రత్యేక గదులు కేటాయించాలి. ఖైదీలు కారాగారాల నుంచి తప్పించుకుని పారిపోకుండా, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి మార్పుల దిశగా సరైన రీతిలో సంస్కరణలు చేపట్టినప్పుడే జైళ్లు శిక్షాగారాలుగా కాకుండా, సంస్కరణ నిలయాలుగా వెలుగొందుతాయి. తద్వారా ఖైదీలు సత్ప్రవర్తనతో సమాజంలోకి అడుగుపెట్టి మంచి పౌరులుగా జీవనం సాగించే అవకాశాలుంటాయి.

- డాక్టర్‌ సిలువేరు హరినాథ్‌ (‘సెస్‌’లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌)

ఇదీ చూడండి:ఎవరికో కొమ్ము కాస్తూ.. సంస్కారానికి నిప్పు పెట్టేశారే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.