ETV Bharat / opinion

రైతుకు చేయాల్సింది కొండంత!

author img

By

Published : Oct 9, 2020, 7:26 AM IST

farm bills
రైతుకు చేయాల్సింది కొండంత!

నూతన వ్యవసాయ చట్టాలతో తన ఉత్పత్తిని యార్డులో అమ్మాలా లేదా ప్రైవేటు విపణిలో అమ్ముకోవాలా అనే విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రైతుకు లభిస్తుంది. ప్రస్తుత సంస్కరణలతో ఈ దశాబ్దంలోనే వ్యవసాయ రంగం పరిస్థితి మారిపోతుందని కొంతమంది పరిశీలకుల అభిప్రాయం. అదే సమయంలో వరి, గోధుమ, పత్తి, నూనె గింజలు వంటి అంతర్జాతీయ పంటల వ్యయాలను తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

ఇటీవలి వ్యవసాయ రంగ సంస్కరణలు రైతుల్ని మార్కెట్‌ యార్డుల నుంచి బంధ విముక్తుల్ని చేసేందుకు ఉద్దేశించినవి. వీటివల్ల తన ఉత్పత్తిని యార్డులో అమ్మాలా లేదా బయట ప్రైవేటు విపణిలో అమ్ముకోవాలా అనే విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ రైతుకు లభిస్తుంది. నేరుగా కంపెనీలతో ఒప్పందం చేసుకుని వారికి అవసరమైన పంటలు పండించే అవకాశమూ దక్కుతుంది. ఫలితంగా వారి పంటలకు మంచి ధరలు వచ్చే అవకాశం, వ్యవసాయం లాభసాటిగా పరిణమించే సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటిదాకా వ్యవసాయ రంగానికి దూరంగా ఉన్న ప్రైవేటు వ్యాపారులు, కంపెనీల ప్రతినిధులు ఇప్పుడు ఈ రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన దిశగా ముందుకొచ్చేందుకు ఉత్సాహం చూపుతారు. ప్రస్తుత సంస్కరణలతో ఈ దశాబ్దంలోనే వ్యవసాయ రంగం పరిస్థితి మారిపోతుందని, రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని కొంతమంది పరిశీలకుల అభిప్రాయం.

కొత్త విధానాలు అవసరం

వరి, గోధుమ, పత్తి, నూనె గింజలు వంటివి అంతర్జాతీయ పంటలు. వీటి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి. ఇలాంటి పంటల్లో మన రైతుల వ్యయాలు తగ్గించి, దిగుబడులు పెంచాల్సిన అవసరముంది. బయటి రైతులతో వారు పోటీ పడటానికి ఇదొక్కటే మార్గం.

అధునాతన పరికరాలను, సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలి. రైతుల వ్యయాల్లో కూలీ ఖర్చులే 40 శాతానికి పైగా ఉంటున్నాయి. వాటిని తగ్గించే పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. ప్రభుత్వాలు సైతం ఈ వాస్తవాల్ని గుర్తించాలి.

కేరళ ప్రభుత్వం ఇటీవల కూరగాయల పంటలకు కనీస మద్దతు ధరలు ఇచ్చే విధానాన్ని ప్రకటించింది. ఇది దేశంలోనే మొదటిసారి. కూరగాయల ధరలు బాగా పెరగడం, అకస్మాత్తుగా తగ్గిపోవడం చూస్తుంటాం. టమోటా, ఉల్లి, బంగాళదుంప పంటల్లో ధరల హెచ్చుతగ్గులు ఎక్కువ. వీటికి కనీస ధరను ఇవ్వడం వల్ల రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇలాంటి పంటల విషయంలో కేంద్ర ప్రభుత్వం 'టాప్‌' అనే ప్రాజెక్టును సైతం మొదలుపెట్టింది.

వ్యవసాయ సంస్కరణల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుతాల మధ్య వివాదంలో రైతులు నష్టపోకూడదు. సంస్కరణలతో రైతుకు నికరంగా పూర్తిస్థాయిలో ప్రయోజనం కలగాలంటే అన్ని రాష్ట్రాల్లో కొత్త విధానాలు ప్రవేశపెట్టాల్సిన అవసరముంది. ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థల ద్వారా రైతు ఉత్పత్తి సంఘా(ఎఫ్‌పీఓ)లు అన్నదాతలను సంఘటితం చేయాలి. దీనివల్ల విత్తనాలు, ఎరువుల వంటివి కొనుగోలుకు, దిగుబడులు అమ్మేందుకు, ప్రైవేటు కంపెనీలతో లావాదేవీలు చెయ్యడానికి బేరసారాల్లో బలం చేకూరుతుంది.

వాణిజ్య లావాదేవీలు, వ్యవసాయ మార్కెట్లలో పాల్గొంటూ, డిజిటల్‌ ప్రపంచంలో కొనసాగేందుకు అవసరమయ్యే సామర్థ్యాన్ని రైతులకు, ఎఫ్‌పీఓలకు కల్పించాలి. కాయగూరలు, పండ్లతోపాటు, మిగతా వ్యవసాయోత్పత్తులు, సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులకు మంచి అవకాశం ఉంది. దీనికి ఒప్పంద వ్యవసాయం చెయ్యాలి. ఈ విషయంలో రైతులు, సంఘాలకు తోడ్పడేందుకు ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో వ్యవసాయ వాణిజ్య విభాగాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో రైతులకు అందుబాటులో ఉండేలా ఈ విభాగం కార్యాలయం ఉండాలి.

అన్నదాతలో ఆందోళన

తాజా సంస్కరణలపై కొంతమంది కొన్ని సందేహాలు లేవనెత్తడం ద్వారా రైతుల మనసుల్లో ఆందోళన నెలకొంది. కనీస మద్దతు ధర వ్యవస్థ ఉండబోదని, ప్రభుత్వం నుంచి పంట ఉత్పత్తుల కొనుగోళ్లు ఆపేస్తారనే అనుమానాల్ని రేకెత్తించారు. అయితే ఇందులో మరీ అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే చెప్పాలి. ప్రభుత్వ కొనుగోళ్లు ఎక్కువగా వరి, గోధుమ పంటల్లోనే ఉంటాయి. ఈ రెండు ఆహార ధాన్యాలు ప్రభుత్వ రేషన్‌ దుకాణాల్లో అత్యవసరం.

ప్రభుత్వం వద్ద ఎప్పుడూ కనీసం మూడు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉండాలి. అందుకని ప్రభుత్వ కొనుగోళ్లు నిలిపివేసే అవకాశం దాదాపు శూన్యం. ఈ విషయంలో అందరికీ స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వం ఇటీవల పంజాబ్‌, హరియాణాల్లో 16 వేల టన్నుల వరిని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసింది. కనీస మద్దతు ధర కూడా ఈ రెండు పంటల్లోనే ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనివల్ల రైతులకు కొంత ఆలంబన లభించినా, వరి గోధుమ పంటలు అవసరానికి మించి పండించటం జరుగుతోంది. ఫలితంగా నీటి వనరులు తగ్గిపోతున్నాయి. భూములు దెబ్బతింటున్నాయి. ఇలాంటి పరిస్థితిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

కర్షకుల ప్రయోజనమే అంతిమ లక్ష్యం

ప్రభుత్వ ప్రోద్బలంతో రైతులు, సంఘాలు, గ్రామీణ యువకుల చేత గ్రామస్థాయిలో ప్రాథమిక వ్యవసాయ శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయించాలి. వాటిలో పంట దిగుబడుల్ని ప్రాథమికంగా శుభ్రం చేయడం, చిన్న యంత్రాలతో శుద్ధి, ప్యాకింగ్‌ చెయ్యడం, నగరాల్లోని రిటైల్‌ గొలుసు దుకాణాల సంస్థలకు, ఈ-కామర్స్‌ కంపెనీలకు సరఫరా చెయ్యడం ద్వారా రైతులకు ఆదాయం పెంచవచ్చు. గ్రామీణ యువతకు జీవనోపాధి కల్పించవచ్చు.

రైతుకు అందుబాటులో ఉండేలా గ్రామాల్లో ప్రైవేటు మార్కెట్లు, డిజిటల్‌ పరిజ్ఞానంతో అనుసంధానించిన గోదాములు, అందులో ఉంచిన వ్యవసాయ ఉత్పత్తులపై రైతులకు రుణాలు లభించేలా గిడ్డంగి రశీదు వ్యవస్థను ఏర్పాటు చెయ్యాలి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లక్ష కోట్ల రూపాయల నిధి నుంచి రుణాలు తీసుకోవడం ద్వారా గ్రామీణ యువకులే ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఆధునిక పద్ధతుల ద్వారా మార్కెట్‌ యార్డులను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఆధునిక సాంకేతికత, సదుపాయాలు, యార్డుకు వచ్చిన ఉత్పత్తి నాణ్యత ఆధునిక పద్ధతిలో నిర్ణయించగల పరికరాలు వంటివన్నీ ఏర్పాటు చేయాలి. యార్డుకు వచ్చిన రైతు బేరం కుదిరేంత వరకు తన ఉత్పత్తిని నిల్వ చేసుకునేలా గోదాములు, రుణ సదుపాయం ఏర్పాటు చేయాలి.

దళారుల ఆధిపత్యాన్ని తగ్గించి, మార్కెట్‌ యార్డులను రైతులకు స్నేహపూర్వకంగా తీర్చిదిద్దాలి. ప్రైవేటు మార్కెట్ల నుంచి ఎదురయ్యే పోటీని ఎదుర్కొని నిలిచే స్తోమతను యార్డులకు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించి తోడ్పడాలి. రైతులకు ప్రయోజనం కలిగించే డిజిటల్‌ పరిజ్ఞానంపై పలు అంకుర సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇలాంటి సంస్థల ఉత్పత్తులతో ఉపయోగం ఉంటుందనుకుంటే, రైతులతో, సంఘాలతో సయోధ్య కుదర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ క్రమంలో వ్యవసాయ సంస్కరణల పూర్తి ప్రయోజనం రైతులకు దక్కాలంటే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చెయ్యాల్సిందెంతో ఉంది!

-విన్నకోట రామచంద్ర కౌండిన్య (వ్యవసాయరంగ నిపుణులు)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.