ETV Bharat / opinion

బీజేపీతో జట్టుకట్టేందుకు జేడీఎస్ తహతహ! విపక్షాలపై విమర్శలు.. '2024' కోసమే!

author img

By

Published : Jun 8, 2023, 9:43 AM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డ జేడీఎస్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీ అధినేత హెచ్​డీ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. విపక్షాలను విమర్శిస్తున్న ఆయన.. ఇటీవల కేంద్రానికి మద్దతుగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

bjp jds alliance
bjp jds alliance

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవిచూసిన జనతా దళ్(సెక్యులర్) మరోసారి బీజేపీతో జట్టు కట్టేందుకు సిద్ధమవుతోందా? లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు సమాయత్తమవుతోందా? ఇటీవల JDS అధినేత దేవెగౌడ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో JDS ఆశించిన సీట్లు పొందలేకపోయింది. ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇవ్వడం వల్ల... ప్రభుత్వ ఏర్పాటులో కింగ్‌ మేకర్‌గా వ్యవహరిద్దామనుకున్న ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం.. 224 అసెంబ్లీ స్థానాలకుగానూ 19 మాత్రమే గెల్చుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జేడీఎస్ పార్టీ.. ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల JDS అధినేత HD దేవెగౌడ చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.

ఒడిశాలో జరిగిన ఘోర రైలు దుర్ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాదంలో ధ్వంసమైన పట్టాలు పునరుద్ధరించిన తర్వాత రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యే వరకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అక్కడే ఉండి అన్ని పనులు పర్యవేక్షించారు. దీనిపై స్పందించిన దేవెగౌడ.. క్లిష్ట సమయంలో ఆయన నిర్విరామంగా పనిచేశారని అభినందించారు. మంత్రి గొప్ప పనితీరు చూపారన్న దేవెగౌడ.. ఈ సమయంలో ఆయన రాజీనామా కోరడం తెలివైన పనికాదంటూ రైల్వే మంత్రి పనితీరును మెచ్చుకున్నారు.

ఇదేసమయంలో దేశంలోని ప్రతిపక్షాల తీరుపై దేవెగౌడ విమర్శలు గుప్పించారు. ఈ దేశంలో బీజేపీతో సంబంధాలు లేని ఒక్క పార్టీని చూపించండని ఆయన ప్రశ్నించారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అన్ని పార్టీలూ బీజేపీతో సంబంధాలు కలిగి ఉన్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని విపక్ష పార్టీలను ఒక్కచోట చేర్చేందుకు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలపై దేవెగౌడ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఈ పరిణామాలను గమనిస్తుంటే బీజేపీకి JDS దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. గత నెలలో దేవెగౌడ 91వ పుట్టిన రోజుకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేయడం గమనార్హం.

2006లో కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా, బీఎస్ యడియూరప్ప ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే అధికార పంపిణీ ఫార్ములా విఫలం కావడం వల్ల 20 నెలల్లో ఆ కూటమి ప్రభుత్వం కుప్పకూలింది. బీజేపీకి అధికారాన్ని బదిలీ చేయడానికి జేడీఎస్ నిరాకరించడమే అందుకు కారణం.

ఎన్‌డీఏ విస్తరణ యోచనలో బీజేపీ
మరోవైపు, కర్ణాటక ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో బీజేపీ.. తన కూటమిని బలోపేతం చేసుకునేందుకు నడుం బిగించింది. ఈ ఏడాది జరిగే వివిధ రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 లోక్​సభ ఎలక్షన్లలో మంచి ఫలితాలు సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్న నేపథ్యంలో ఎన్​డీఏ బలోపేతం అవసరంపై పార్టీ అధినేతలు ఆలోచనలు చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఎన్‌డీఏ నుంచి అనేక పార్టీలు వైదొలిగాయి. శిరోమణి అకాలీదళ్‌, జేడీయూ, శివసేన, తెదేపా వంటి బలమైన పార్టీలూ ఏన్​డీఏకు దూరమయ్యాయి. ఈ పరిస్థితుల్లో.. కూటమిని బలోపేతం చేసుకుంటే లోక్‌సభ ఎన్నికల ఫలితాలను మెరుగు పరుచుకోవచ్చని బీజేపీ భావిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.