ETV Bharat / lifestyle

Diwali Precautions: దీపావళి రోజు ఇవి తప్పనిసరిగా పాటించాల్సిందే..!

author img

By

Published : Nov 3, 2021, 7:58 PM IST

Updated : Nov 4, 2021, 7:50 PM IST

పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే పండుగ దీపావళి. మరి ఈ పండుగ రోజు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితం ఇంకా వెలుగుమయమవుతుంది. ఈ పర్వదినాన ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలంటే.. టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో చూద్దాం..

diwali precautions in telugu for deepavali 2021
diwali precautions in telugu for deepavali 2021

చెడుపై మంచి సాధించిన విజయమే ఈ దీపావళి... ఆ విజయం కోసమే ఇళ్ల ముందర వెలుగుదివ్వెలొచ్చాయి... వెలుగుల కాంతులతో ఇల్లు.. ఇల్లాలి మోమున చిరునవ్వులు మెరుస్తున్నాయి. ఆ మెరుపులకు కొత్తబట్టలు కోటి కాంతులీనుతున్నాయి. దీపావళికి వర్గ విభేదాలుండవు. అమెరికాలో అయినా.. అమీర్‌పేటలో అయినా ఈ దివ్వెల సంబురం ఒకేలా ఉంటుంది. మరి అలాంటి దీపావళి రోజున... ఆనందాన్ని ఏమాత్రం కోల్పోకాకుండా... కరోనా మూడో దశ పొంచి ఉన్న వేళ సురక్షితంగా పండగ జరుపుకోవడమే మన లక్ష్యం కావాలి. టపాసులు కాల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే విషాదం బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అవేంటంటే..

చేయకూడని పనులు

  1. ముందుగా.. టపాసులు పేల్చేసమయంలో చేతికి శానిటైజర్లు రాసుకోకూడదు.
  2. పేలకుండా మధ్యలో ఆగిపోయిన టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయొద్దు.
  3. అది పైకి మండకపోయినా లోపల ఉండిపోతే దాన్ని చేతిలోకి తీసుకోగానే పేలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి దూరంగా ఉండండి.
  4. ముందు జాగ్రత్తగా అలాంటివాటిపై నీటిని చల్లి తడపండి.
  5. బాణాసంచా ఎప్పుడూ ఇంట్లో కాల్చేందుకు ప్రయత్నించొద్దు.
  6. బహిరంగ ప్రదేశాల్లోనే వాటిని పేల్చండి.
  7. జేబుల్లో టపాసులు పెట్టుకుని తిరగడం చాలా ప్రమాదకరం.
  8. గాజు కంటెయినర్లు, లోహపు పాత్రల్లో టపాసులు పేల్చడం ప్రమాదకరం.

చేయాల్సిన పనులు

  1. బాణాసంచాను పేల్చడానికి ముందు, ప్యాకింగ్‌లపై ఉండే సూచనలు చదవండి.
  2. మంటలు అంటుకునే అవకాశం ఉన్న ప్రాంతాలకు, ద్రావణాలకు దూరంగా బాణాసంచాను పేల్చాలి.
  3. భవనాలు, చెట్లు, ఎండుగడ్డి లాంటి చోట టపాసులు పేల్చడం వల్ల అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ.
  4. కాల్చిన బాణాసంచా సామగ్రిని ఇసుక పోసి ఓ ప్లాస్టిక్ బకెట్‌తో కప్పి ఉంచండి. దీనివల్ల ఆ దారిలో వేళ్లేవారికి హాని కలుగకుండా ఉంటుంది.
  5. టపాసులు కాల్చేసమయంలో ముందు జాగ్రత్తగా బక్కెట్‌తో నీటిని సిద్ధంగా ఉంచుకోండి.
  6. బాణాసంచా కాల్చేటప్పుడు చేతులను టపాసుకు దూరంగా ఉంచి జాగ్రత్తగా అంటించాలి.
  7. అలాగే టపాసుకు ముఖాన్ని దూరంగా ఉంచడం మర్చిపోవద్దు.

ఈ ఒక్క రోజు శానిటైజర్​కు దూరంగా..

చిన్నారుల విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దవాళ్లు పిల్లలు ఏం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలి. కాలిన టపాసులను చిన్నారులకు దూరంగా పెట్టండి. దీపాలకు శానిటైజర్​ డబ్బాలను దూరంగా ఉంచండి. కరోనా సమయంలో శానిటైజర్​ రాసుకోవటానికి అలవాటు పడిన మనం.. ఈ ఒక్కరోజు వాటికి దూరంగా ఉండండి. శానిటైజర్లకు మండే స్వభావం ఉంటుంది. కాబట్టి.. టపాసులు కాల్చేటప్పుడు శానిటైజర్​కు వీలైనంత దూరంగా ఉండండి. టపాసులు కాల్చేసమయంలో పిల్లలు తమ చేతులకు శానిటైజర్లు రాసుకోకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ రాసుకుని ఉంటే.. సబ్బుతో కడిగిన తర్వాతే కాల్చనివ్వండి. కాల్చిన తర్వాత కూడా సబ్బుతో శుభ్రంగా కడగండి.

ఏం చేయాలంటే?

కొన్నిసార్లు జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కోసారి టపాసుల వల్ల ప్రమాదం ఏర్పడితే ప్రథమ చికిత్స గురించి అవగాహన ఉండాలి. వైద్యశాలకు వెళ్లేలోపు టపాసుల వల్ల గాయపడిన వ్యక్తిని తొలుత నిప్పుకు దూరంగా తీసుకురావాలి. నిప్పు అంటుకుని గాయమైన శరీర భాగంపై నుంచి వస్త్రాలు తొలగించండి. గాయాలపై చల్లని నీటిని పోయాలి.

చిరుదివ్వెల దీపావళి రోజున అందరి ఇంట్లో సంతోషాలు వెదజల్లాలని కోరుకుంటూ ఈటీవీ భారత్​ దీపావళి శుభాకాంక్షలు.... తెలియజేస్తోంది.

ఇదీ చూడండి:

Last Updated : Nov 4, 2021, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.