ETV Bharat / lifestyle

తమ్ముడిని చూసి ఆసక్తి కలిగింది.. పాఠాలు మానేసి పోలీసయ్యింది!

author img

By

Published : Jun 20, 2021, 10:04 AM IST

ఇంటి బాధ్యతలను నిర్వహిస్తూనే ఉద్యోగాన్ని చేస్తున్న మహిళలెందరో. అమృతా దుహాన్‌ కూడా అంతే. వైద్య విద్యార్థులకు ప్రొఫెసర్‌గా సేవలందిస్తూనే తన ఐదేళ్ల కొడుకునీ చూసుకునేది. తన తమ్ముడు ఐపీఎస్​కు ఎంపికవ్వడం తనలో ఆసక్తి కలిగించింది. తనకూడా ఐపీఎస్​ అవ్వాలనుకుంది. లక్ష్యాన్ని పెంచుకుని సివిల్స్‌ సాధించింది. అదీ మొదటి ప్రయత్నంలోనే! తన మెడికల్ జ్ఞానంతో క్లిష్టమైన కేసులను సులభంగా ఛేదిస్తూ ఐపీఎస్‌ ఆఫీసర్‌గా విజయవంతంగా సేవలందిస్తోంది.

Amrita Duhan, DCP Amrita Duhan
అమృతా దుహాన్ , డీసీపీ అమృతా దుహాన్

అమృతా దుహాన్‌ ఎంబీబీఎస్‌ చదివింది. పాథాలజీలో ఎండీ పూర్తిచేసి, మహిళా వైద్య కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరింది. ఈ సమయంలోనే తనకు పెళ్లైంది. ఒక బాబు కూడా. నిలకడైన ఉద్యోగం, ఆనంద భరితమైన కుటుంబ జీవితం పెద్ద కలలను ఏర్పరచుకోవడంలో అడ్డంకి కాలేదంటుందామె. ఈమెది హరియాణలోని రోహ్‌తక్‌. తన తమ్ముడు ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. అది ఆమెలో ఆసక్తిని కలిగించింది. తనూ రాద్దామనుకుని, సన్నద్ధత ప్రారంభించింది.

వారాంతాలను పూర్తిగా బాబుకి కేటాయించేది. మిగిలిన రోజుల్లో ఎక్కువ సమయం ఉద్యోగానికీ, సన్నద్ధతకీ ప్రాధాన్యమిచ్చింది. 2016లో కోచింగ్‌ తీసుకోకుండానే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్ష రాసి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది. అసోసియేట్‌ మెడికల్‌ ప్రొఫెసర్‌గా పదోన్నతినీ సాధించినా... దాన్ని పక్కనపెట్టి ఐపీఎస్‌ శిక్షణకు వెళ్లింది.

నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ సమయానికి అమృతకు 33 ఏళ్లు. అప్పటిదాకా ఎలాంటి శారీరక శ్రమా లేదు. పైగా ఆమె కేడర్‌లో తనొక్కతే అమ్మాయి. అందరితో సమానంగా నిలవడానికి అదనంగా శిక్షణకు సమయం కేటాయించేది. గాయాలపాలైనా నొప్పిని పంటి బిగువన భరించి సాధన సాగించింది. ఫలితం... శిక్షణ పూర్తయ్యేనాటికి మూడు పతకాలను సాధించడమే కాకుండా ఆల్‌ రౌండ్‌ లేడీ ఐపీఎస్‌ ప్రొబేషనర్‌గానూ నిలిచింది.

శిక్షణ తర్వాత 2017లో దిల్లీలో మొదట ఐపీఎస్‌ అధికారిగా బాధ్యతలను నిర్వహించింది. మెడికల్‌ పరిజ్ఞానంతో ఫోరెన్సిక్‌ సంబంధిత క్లిష్టమైన, క్రిమినల్‌ కేసులను పరిష్కరించి, ప్రజల నమ్మకాన్ని చూరగొంది. ప్రస్తుతం రాజస్థాన్‌లోని జయపురలో డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీసీపీ)గా బాధ్యతలను నిర్వర్తిస్తోంది.

ఇదంతా సాఫీగా ఏమీ సాగలేదంటుందామె. అవరోధాలూ ఎదురయ్యాయి. కానీ తన కలలను సాకారం చేసుకోవాలన్న తపన ముందు అవేమీ నిలవలేదంటుంది అమృత. అందుకే అమ్మగా, వైద్యురాలిగా, పోలీసు ఆఫీసర్‌గా బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగగలుగుతోంది. అంతేకాదు.. వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను సమన్వయం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నవారికి ఆదర్శంగా నిలవడంతోపాటు సివిల్స్‌ లక్ష్యమున్న అమ్మాయిల్లో స్ఫూర్తినీ నింపుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.