ETV Bharat / lifestyle

Karthika masam 2021: కార్తిక మాసంలో ఈ నాలుగూ ఎందుకు పాటించాలి?

author img

By

Published : Nov 6, 2021, 6:53 AM IST

హరిహరులకు అత్యంత ప్రీతికరమైనది కార్తిక మాసం(Karthika masam 2021). ఈ నెలలో హరిహరాదులను స్తుతించడంతోపాటూ చేసే ఇతర పూజలకూ, వ్రతాలకూ ఎంతో విశిష్టత ఉంటుంది. ఈ మాసంలో చేసే శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుందని కార్తిక పురాణం చెబుతోంది. అంతటి విశిష్టత ఉన్న కార్తిక మాసంలో ఈ నాలుగు పాటించాలి. ఎందుకంటే...

Karthika masam 2021, karthika pooja for lord shiva
కార్తిక మాసం 2021, కార్తిక పూజ

‘నకార్తికే సమో మాసం.. న కృతేన సమం యుగం.. నవేద సద్రసం శాస్త్రమ్‌.. నతీర్థ గంగాయ సమం..’ అంటే యుగాలలో కృతయుగంతో సమానమైన యుగం, వేదాలకు సమానమైన శాస్త్రం, గంగకు సమానమైనటువంటి నది లేనట్టే.. మాసాల్లో కార్తిక మాసానికి(Karthika masam 2021) సమానమైనదేదీ లేదని పెద్దల మాట. ఈ మాసం శివుడికి, మహా విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. కార్తిక పురాణంలో కార్తీక సోమవార మహత్యం, కార్తీక పౌర్ణమినందు(karthika pournami 2021) జ్వాలాతోరణం.. ఇవన్నీ మహాశివుడి ప్రాముఖ్యతను తెలియజేసినట్టే కార్తిక శుక్ల బలి పాడ్యమి, కార్తిక ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి శ్రీహరి ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేస్తాయి. కార్తిక పురాణంలో మొదటి 15 అధ్యాయాలు ఈశ్వరుడి ప్రాముఖ్యతను తెలియజేస్తే.. ఆఖరి 15 శ్రీహరి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. అందులోనూ అంబరీశుని కథా వృత్తాంతంలో మహా విష్ణువు దశావతారాల మూలం ఉండటం ఈ పుణ్యసంలో హరిహరాదులకు ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో తెలుపుతుంది.

కార్తిక మాసంలో ముఖ్యంగా పాటించాల్సినవి.. నదీ స్నానం, శివారాధన, దీపారాధన-దీపదానం, విష్ణు ఆరాధన-పురాణ పఠనం లేదా శ్రవణం, దానములు చేయడం. ఈ మాసంలో దీపాలు వెలిగించి శివ కేశవులను ఆరాధించి కార్తీక పురాణం ఎవరైతే చదువుతారో వారు చేసిన పాపాలు తొలగి, పుణ్యం కలిగి, జ్ఞానం సిద్ధించి, మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుంది.

భక్తిశ్రద్ధలతో దీపారాధన

స్నానం..

కార్తిక మాసంలో(Karthika masam 2021) రవి తుల రాశిలో ఉండటం వల్ల నదిలో నదీ ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం వల్ల మానవుడి శరీరానికి శక్తి కలిగి ఆరోగ్యసిద్ధి కలుగుతుంది. ఈ మాసంలో పుణ్య నదీ స్నానం వల్ల పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది.

దీపం జ్యోతి పరబ్రహ్మం

దీపం..

‘దీపం జ్యోతి పరబ్రహ్మం.. దీప జ్యోతి జనార్దన.. దీపో మేహరతు పాపం.. సంధ్యాదీపం నమోస్తుతే!’. దీపమే పరబ్రహ్మం. దీపంలో లక్ష్మీ దేవి ఉందనీ.. దీపం నుంచి వచ్చేటువంటి తేజస్సులో బ్రహ్మ, విష్ణు,మహేశ్వరులు ఉన్నారనీ పురాణాలు చెబుతున్నాయి. అలాగే, అంధకారం దారిద్య్రానికి చిహ్నమని, కాంతి లక్ష్మీప్రదమని.. జ్ఞానానికి అభివృద్ధికి చిహ్నమని పెద్దలు చెబుతున్నారు.

♦ ప్రతి మనిషీ నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేస్తే మంచిది. దీపారాధన ఇంటి యజమాని చేయాలి. కలియుగంలోని ప్రస్తుత కాలంలో ప్రతిరోజూ దీపం వెలిగించడం సాధ్యంకాని వారికి ఈ పుణ్య మాసంలో దీపారాధనకు మించిన గొప్ప అవకాశం ఏదీ ఉండదు.

♦ కార్తిక మాసంలోనూ నిత్యం దీపారాధన చేయడం సాధ్యపడని వారికి కార్తిక శుక్ల ద్వాదశి/కార్తీక పౌర్ణమి రోజు చేస్తే సంవత్సరంలో దీపారాధన చేస్తే వచ్చే పుణ్యఫలం ఈ రెండు రోజుల్లో చేయడంతో కలుగుతుంది.

♦ ఈ పుణ్య మాసంలో సాయంత్రం పూట ఆలయంలో గానీ, తులసికోట, రావిచెట్టు వద్దగానీ, మేడపైన లేదా ఏదైనా నది వద్ద గానీ ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి పుణ్య ఫలం లభించి శివుడి అనుగ్రహం పొందుతారని కార్తిక పురాణం చెబుతోంది.

కార్తిక దీపం వెలుగులు

ఉపవాసం..

కార్తిక మాసంలో(Karthika masam 2021) ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యపరంగా మంచి జరిగి మనస్సు నిర్మలత్వంతో దైవం వైపు, దైవత్వం వైపు లగ్నమవుతుందని మన పూర్వీకులు చెబుతుంటారు. కార్తిక సోమవారాల్లో ఉపవాసం ఉండటమంటే, కేవలం ఆహారం మానేయడం కాదు! కోరికలను తొలగించుకొని, ధ్యాసను భగవంతుడిపై లగ్నం చేసి ఉండటం. ఉపవసించిన ప్రతిక్షణమూ భగవతారాధనలో గడిపిన వారికి ఉపవాస ఫలితం సిద్ధిస్తుంది. అది పుణ్యప్రదమై, జ్ఞాన ప్రదమై, మోక్ష ప్రదమవుతుంది.

కార్తిక మాసంలో ద్వాదశి వ్రతం ఆచరించేవారు.. దశమి రోజున ఒక్కపూటే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకొని ఏకాదశి రోజు ఉపవాసం చేయాలి. ద్వాదశి రోజున ఉదయాన్నే స్నానమాచరించి శివకేశవులను ఆరాధించి బ్రాహ్మణులకు/అతిథులకు భోజనం పెట్టి తరువాత ఎవరైతే భుజిస్తారో వారికి శ్రీమహావిష్ణువు అనుగ్రహం కలిగి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని కార్తిక పురాణం పేర్కొంటోంది.

దానం అత్యంత ముఖ్యం

దానం..

మన సనాతన ధర్మంలో గృహస్థులు చేయాల్సిన వాటిల్లో స్నానం, దానం, జపం, తర్పణం అత్యంత ముఖ్యమైనవి. ఈ పుణ్య మాసంలో చేసేటటువంటి స్నాన, దాన, జప, తర్పణాలకు అధిక పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుచేత కార్తిక మాసంలో ఎవరైతే నవధాన్యాలు, అన్నం, దీపదానం, ఉసిరి దానం, వస్త్రదానం, సువర్ణ దానం, గోదానం, కన్యాదానం వంటివి చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్యఫలం లభిస్తుందని కార్తీక, మార్కండేయ, శివ పురాణాలు చెబుతున్నాయి.

.

- మందపల్లి, అన్నవరం దేవస్థానం పంచాంగకర్త

ఇదీ చదవండి: Karthika masam 2021: కార్తిక మాసం విశిష్టత ఏమిటి? ఏం చేయాలి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.