ETV Bharat / lifestyle

Vinayaka Chavithi: విఘ్నాలు తొలగించేవాడే కాదు.. కలిగించేవాడు కూడా!!

author img

By

Published : Sep 10, 2021, 8:00 AM IST

VINAYAKA
పార్వతమ్మ ముద్దుల తనయుడు

వినాయకుని చూడగానే తెలియకుండానే మనలో చిరునవ్వు మెదుల్తుంది. భక్తిభావం కలుగుతుంది. ఇంతకీ గణపతి ప్రసన్నవదనుడేనా! శత్రు భయంకరుడు కూడానా? పార్వతమ్మ ముద్దులతనయుడేనా! పరమాత్మతత్వానికి ఆధారం కూడానా? చూద్దాం!

భండాసురుడి నుంచి కాపాడమని దేవతలు శరణుకోరగా శివుడు నేత్రాగ్నితో యజ్ఞకుండాన్ని రగిలించాడు. అందులోంచి పుట్టిన లలితాపరమేశ్వరి శక్తి సేనల్ని ఆవిర్భవింపచేసి... భండాసురుడి సైన్యాన్ని నిర్వీర్యం చేసింది. అప్పుడా రాక్షసుని సోదరుడు విశుక్రుడు సోమరితనం, నిద్ర, అయోమయం లాంటి ఎనిమిది అవగుణాలతో విఘ్నయంత్రాన్ని సృష్టించి శక్తిసేనలను హరించాడు. సేనాధిపతి వారాహి కంగారుగా అమ్మవారిని చూసింది. ఆమె భర్త కామేశ్వరుని ప్రేమగా చూసింది. శివుడు కూడా ప్రేమగా చూశాడు. ఇద్దరి చూపుల కలయికతో మహాగణపతి ఉద్భవించాడు. మనిషిని నిర్వీర్యంచేసే ఆ విఘ్నయంత్రాన్ని ఛిన్నాభిన్నంచేసి శక్తిసేనలో వీరత్వాన్ని నింపి అమ్మకు విజయాన్ని చేకూర్చాడు. తాము ఒకే సరళరేఖపై ఉన్నప్పుడు మాత్రమే శివుని బాణంతో మరణించేలా వరం పొందిన త్రిపురాసురులను తన తొండంతో సరళరేఖపై పట్టివుంచి తండ్రికి కూడా విజయం కలిగించాడు.

ప్రకృతి, పురుషుల వ్యక్తావ్యక్త సంయోగంతో ఉద్భవించిన వల్లభ గణపతి చేతుల్లో శంఖచక్రాలు, శూలపాశాలు, చెరుకుగడ, నల్లకలువలు, వరికంకులు, గద, దానిమ్మపండు, దంతం ఉంటాయి. ఇవి లక్ష్మీనారాయణ, శివపార్వతులు, రతీమన్మథులు, భూదేవి వరాహస్వామి, పుష్టి పుష్టిపతుల తత్వాలకు సంకేతమై సకల దేవతా స్వరూపుడుగా కనిపిస్తాడు.

వాగీశాద్యా సుమనసః సర్వార్థానముపక్రమే
యం నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననమ్‌

ఏ పనికి ఉపక్రమించినా గణపతిని స్మరించనిదే సాఫల్యం చేకూరదు.

బ్రహ్మదేవుని ఆటంకాలు తొలగించాడు

సృష్టి రచనలో ఆటంకాలు ఎదురవగా పరమాత్మను ధ్యానించాడు బ్రహ్మదేవుడు. అప్పుడు పరమాత్మ ఓంకార రూపంలో దర్శనమిచ్చి వక్రతుండ మంత్రాన్ని ప్రసాదించాడు. వక్రతుండమంటే వంకర తొండం కలిగినవాడనే కాకుండా వక్రాలను తుండం చేసేవాడని కూడా అర్థం.

వ్యాసమహర్షికి లేఖకుడైన వైనం

మహాభారత రచనకు పూనుకున్న వ్యాసమహర్షి దానికెలా రూపమివ్వాలనే సందేహంతో బ్రహ్మదేవుని ప్రార్థించగా, వినాయకుడు మార్గం చూపగలడన్నాడు బ్రహ్మ. వ్యాసుని చిత్తశుద్ధికి ప్రసన్నుడైన గణపతి మహాభారత లేఖనానికి ఒప్పుకుంటూనే ఓ నిబంధన విధించాడు. రచన మొదలయ్యాక తన లేఖిని ఆగదని, నిరంతరాయంగా చెప్తేనే రాస్తానన్నాడు. వ్యాసుడు కూడా తన శ్లోకాలను అర్థంచేసుకుని మాత్రమే రాయాలంటూ ప్రతినిబంధన పెట్టాడు. ఇద్దరూ ఒప్పుకున్నారు. వినాయకుని లేఖన వేగాన్ని అందుకోవడం ఒక్కోసారి వ్యాసునికి కష్టమయ్యేది. అలాంటప్పుడు అసంగతం, విరోధం అనిపించే శ్లోకం చెప్పేవాడు. వినాయకుడు ఆగగానే వ్యాసుడు తర్వాతి శ్లోకాల్ని అల్లేవాడు. ఒకసారి ఘంటం విరిగిపోతే, తన దంతాన్నే విరిచి ఘంటంగా ఉపయోగించాడు. భారతమే కాదు వ్యాసుని అష్టాదశ పురాణాలు, బ్రహ్మసూత్రాలు మొదలైన వాటన్నింటికీ లేఖకుడు వినాయకుడే అంటారు.

నరాకారో మాయా గజాకారో పురుషః
కంఠాధో జగన్మయం కంఠోర్ధ్వంతు చిన్మయం

అంటుంది ముద్గల పురాణం. శరీరాన్ని శాసించేది శిరస్సు. ప్రపంచాన్ని శాసించేది పరమాత్మ. అందుకే విశ్వాన్ని మనిషి శరీరంతో, దాన్ని శాసించే పరమాత్మను ఏనుగుతలతో చూపించాడు.

ఏక శబ్ద ప్రధానార్థో దంతశ్చ బలవాచకః
ప్రధానం సర్వస్మాత్‌ ఏకదంతం ఉపాస్మహే

ఏకదంతుడంటే ఒకే దంతం కలవాడని అర్థం. కానీ బ్రహ్మవైవర్త్య పురాణంలో శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం ఏకదంతుడంటే సర్వ శక్తిమంతుడని అర్థం.

విఘ్న నాయకుడు

విఘ్నాల్ని తొలగించేవాడే కాదు, అవసరమైనప్పుడు కలిగించేవాడు కూడా. పెద్ద విఘ్నాల్ని తొలగించడం కోసం చిన్నచిన్న అడ్డంకుల్ని, ధర్మాన్ని కాపాడేందుకు అధర్మపరులకు ఆటంకాల్ని కలిగిస్తాడు.

మూషిక వాహనుడు

ముష్‌ అనే ధాతువుకు దొంగ అని అర్థం. ఎలా అయితే ఎలుక ఇంట్లోని వస్తువులన్నింటినీ తన కలుగులోకి తీసికెళ్తుందో జీవుడు విషయ వాంఛలన్నింటినీ గుండె గుహలోకి తీసుకెళ్తుంటాడు. అలాంటి జీవుడనే ఎలుకపై అధిష్టించి ఉన్న ఈశ్వరచైతన్యమే గణపతి.

మొదటి పాదయాత్ర

గణాలకు అధిపతి కావాలంటే ముందు గణాల గురించి తెలియాలి. అలా లోకజ్ఞానం కోసం పాదయాత్ర చేసిన నాయకుడు వినాయకుడు.

భార్యాబిడ్డలు

గణపతికి సిద్ధి, బుద్ధి అనే భార్యలు, క్షేముడు, లాభుడు అనే కుమారులు ఉన్నట్లు కథనాలున్నాయి. ఇక్కడ భార్యలంటే శక్తులు, పుత్రులంటే ఆ శక్తి ద్వారా ఉత్పన్నమయ్యే ఫలాలని భావం. పనిలో కౌశలం బుద్ధి, దానితో సిద్ధించేది సిద్ధి. వీటితో పొందే ఫలాలు క్షేమం, లాభం. ఇలా అర్థం చేసుకున్నప్పుడు బ్రహ్మచారి అయిన గణపతి భార్యాబిడ్డల వెనుక ఉన్న తత్త్వం బోధపడుతుంది.

మనోహరుడు, ప్రసన్న వదనుడైన వినాయకుని ‘శంభు కోపఘ్నః’ అనీ, ‘శంభు హాస్యభూః’ అనీ అంటారు. పుత్రుని చూడగానే పరమేశ్వరుని కోపం మాయమై చిద్విలాసం తాండవిస్తుందని భావం. సకల దేవతల్ని విఘ్నాల నుంచి కాపాడిన విఘ్ననాయకుడు మనకు కూడా జ్ఞాన బల ఐశ్వర్య ఆనందాల్ని ప్రసాదించుగాక! నమో విఘ్ననాయక!

నిమజ్జనం ఎందుకు?

ఆకాశస్యధిపో విష్ణుః అగ్నిశ్చైవ మహేశ్వరః
వాయో సూర్యః క్షితిరీశః జలరూపో వినాయకః

ఆయా పండుగల్లో దేవుళ్లకు ఉన్న మూర్తుల్ని పూజించడమే తప్ప విగ్రహాన్ని రూపొందించడం ఉండదు. ఆ సంప్రదాయం వినాయక చవితిలోనే ఉంది. శాస్త్రప్రకారం చెరువు మట్టితో 9 అంగుళాలకు మించని విగ్రహం చేసుకోవాలి. 9 రోజుల పూజ ముగిశాక మట్టిని తెచ్చినచోటే నిమజ్జనం చేయాలి. దీని వెనుక భౌతిక, తాత్త్విక రహస్యాలున్నాయి. వర్షాకాలంలో గ్రామవాసులంతా చెరువు నుంచి మట్టి తీయడంవల్ల పూడిక తీసినట్లవుతుంది. ఇది భౌతిక లాభం. అలాగే భగవంతుడు తయారుచేసిన ఈ శరీరం కూడా ఉన్నన్ని రోజులు ఎంత వైభోగం అనుభవించినా పంచభూతాల్లో కలిసిపోవాల్సిందే తప్ప శాశ్వతం కాదన్న సత్యం బోధపడుతుంది. గణపతి జలరూపానికి ప్రతినిధి కనుక నీళ్లలో లయం చేయడాన వచ్చిన చోటుకే చేరుకుంటారనేది తాత్త్వికార్థం. ఔషధ గుణాలున్న పత్రిని పూజానంతరం నీటిలో కలపడంవల్ల వర్షాకాలం నీటిలో చేరిన సూక్ష్మక్రిములు నశిస్తాయి.

ఇదీ చూడండి: HC ON GANESH IMMERSION: హుస్సేన్ సాగర్​లో గణేష్‌ నిమజ్జనంపై నేడు తొలగనున్న అనిశ్చితి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.