ETV Bharat / city

గణపతిని 21 రకాల ఆకులతో ఎందుకు పూజిస్తారు?

author img

By

Published : Aug 22, 2020, 7:14 AM IST

Updated : Aug 22, 2020, 7:22 AM IST

గొరంత పత్రికే కొండంత వరాలు గుప్పిస్తాడు. మోదక నైవేద్యాలకే మహదానందపడతాడు.. సర్వ విఘ్నాలకూ అధినాయకుడు మన విఘ్నేశ్వరుడు. భాద్రపద శుక్ల చవితి రోజున భక్తి శ్రద్ధలతో వినాయక పూజ జరుపుకోవడం పుణ్యప్రదం.. మోక్షదాయకం. సాధారణంగా ఏ కార్యం మొదలు పెట్టినా గణపతి పూజ చేయాలి. మిగిలిన సందర్భాల్లో పసుపు గణపతిని తీర్చిదిద్ది పూజ తంతు ముగిస్తారు. కానీ వినాయకచవితి రోజున మాత్రం మట్టితో చేసిన గణపతిని 21 రకాల పత్రాలతో పూజించడం అనాదిగా వస్తోంది.

ganesh
ganesh

21 రకాల పత్రులు సాధారణమైన ఆకులు కావు. అవన్నీ ఎన్నో ఔషధ గుణాలు కలిగినవి. వాటితో పూజ చేయడం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరించేస్తుంది. ఇక నవరాత్రులు గణనాథుడిని పూజించి ఆ తర్వాత పత్రితో కలిపి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు. ఇలా చేయడం వెనుకా ఓ కారణం ఉంది. వర్షాకాలంలో ఎక్కడెక్కడి నుంచో నీరు వచ్చి చెరువులు, బావులు, నదుల్లో చేరుతుంది. పైగా అది కలుషితమై ఉండటంతో దానిలోని క్రిమి కీటకాలను నాశనం చేసే శక్తి 21 పత్రాలకు ఉంది. ఆ పత్రాలు నీటిలో కలిసి బ్యాక్టీరియాను తొలగించి ఆక్సిజన్‌ స్థాయులను పెంచుతాయి. ఇదీ వినాయక నిమజ్జనం వెనక ఉండే ‘పర్యావరణ పరిరక్షణ’ రహస్యం. వినాయకుడిని పూజించే ఏకవింశతి పత్ర (21 ఆకుల) పూజ చాలా విశిష్టమైంది. ఈ 21 పత్రాలు వివిధ గ్రంథాల్లో ప్రస్తావించారు.

మాచీ పత్రం: దీనిని తెలుగులో మాచ పత్రి అంటారు. చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. తలనొప్పి, చర్మ సంబంధ సమస్యలు, కండరాల నొప్పులతో బాధపడేవారు వాడితే విశేషమైన ప్రభావం ఉంటుంది.

బృహతీ పత్రం: దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. జీర్ణ, గుండె, చర్మ సంబంధ సమస్యలను నివారించగలదు.

బిల్వ పత్రం: బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివుడికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైందిగా చెబుతారు. డయాబెటిస్‌ నియంత్రణకు, డయేరియా, గ్యాస్టిక్‌ సమస్యలను నివారించగలదు.

దూర్వా పత్రం: దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి. గాయాలు, అలర్జీలు, ఉదర సంబంధ సమస్యలను నివారించే గుణం దీనికి ఉంది.

దుత్తూర పత్రం: దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు ఉంటాయి. కాలిన చర్మానికి, బొబ్బలకు ఈ ఆకు చక్కగా పని చేస్తుంది.

బదరీ పత్రం: బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి. జీర్ణ సంబంధ సమస్యలు, గొంతు సమస్యలు, దగ్గును నియంత్రించగలదు.

అపామార్గ పత్రం: దీనిని ఉత్తరేణి అంటారు. ఆకులు గుండ్రంగా ఉంటాయి. శివునికి ఇష్టమైన ఆకుగా చెబుతారు. పాము కాటుకు, గాయాలు నయం కావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

తులసీ పత్రం: హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి, దగ్గు, జలుబు, జ్వర నియంత్రణకు పనిచేస్తుంది. అనేక అనారోగ్య సమస్యలకు ఏకైక ఇంటి చిట్కా తులసి.

చూత పత్రం: చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని హిందూ కుటుంబాల్లో పండగ వాతావరణం కనిపించదు. రక్త విరేచనాలు, చర్మంపై దద్దుర్లును తగ్గించడంతో పాటు, కీటకాలను ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది.

కరవీర పత్రం: దీనినే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. క్యాన్సర్‌, ఆస్తమా నివారణకు ఉపయోగపడుతుంది.

విష్ణుక్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. జ్ఞాపకశక్తిని పెంచడానికి, జుట్టు పెరుగుదలకు, జలుబు, దగ్గు, జ్వరం, ఆస్తమా, నరాల బలహీనత నివారణకు ఉపయోగపడుతుంది.

దాడిమీ పత్రం: దాడిమీ అంటే దానిమ్మ ఆకు. దానిమ్మ ఫలం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటుందని అందరికీ తెలిసిందే. డయేరియా, కంటి జబ్బులు, చర్మ సంబంధిత సమస్యల నివారణ చక్కగా పనిచేస్తుంది.

దేవదారు పత్రం: దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. అజీర్తి నివారణకు, చర్మ వ్యాధుల నియంత్రణకు చక్కగా పనిచేస్తుంది.

మరువక పత్రం: దీనిని మరువం అని కూడా అంటారు. దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత. జుట్టు రాలడం, జీర్ణ సంబంధ సమస్యలకు పనిచేస్తుంది.

సింధువార పత్రం: సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అని కూడా పిలుస్తుంటారు. జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, చెవి నొప్పుల నియంత్రణకు ప్రభావంగా పనిచేస్తుంది.

అర్క పత్రం: దీనినే జిల్లెడు అంటారు. ఈ చెట్టు ఆకులను తుంచితే పాలు వస్తాయి. శివుడి పూజకు తెల్ల జిల్లెడు ఆకులను వినియోగిస్తారు. చెవి నొప్పి, కాలిన గాయాలు, దగ్గు, దంత సంబంధ సమస్యల నివారణలో ఉత్తమంగా పనిచేస్తుంది.

జాజి పత్రం: ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. ఒళ్లు నొప్పులు, మొటిమలు, చర్మ సంబంధ సమస్యల నివారణకు దివ్య ఔషధం

గండకీ పత్రం: దీనిని దేవ కాంచన అని కూడా అంటారు. శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైనవి. సీతాకోక చిలుక మాదిరి దీని ఆకులు ఉంటాయి. దగ్గు, ఉదర సంబంధ సమస్యలను పరిష్కరించగలదు.

శమీ పత్రం: జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. విజయదశమి రోజు ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పైల్స్‌, కుష్ఠు నివారణకు, దంత సమస్యలకు పనిచేస్తుంది.

అశ్వత్థ పత్రం: రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. ఆలయాల్లో రావి, వేప చెట్లను పూజలు చేయటం మన సంప్రదాయం. రక్తశుద్ధికి, ఆస్తమా సహా వివిధ వ్యాధులను దరిచేరకుండా చేసే ఔషధ గుణం కలిగినది.

అర్జున పత్రం: మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి ఉంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది. శాపం వల్ల కుబేరుడు ఈ చెట్టులా మారిపోయాడని అంటారు. అంతేకాదు, ఇది ఔషధ గుణాలను కలిగి ఉంది. రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతుంది.

Last Updated :Aug 22, 2020, 7:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.