ETV Bharat / international

అక్కడ లీటర్​ పెట్రోల్​ రూ.234, డీజిల్​ రూ.263

author img

By

Published : Jun 16, 2022, 4:24 PM IST

FUEL PRICES
పెట్రోల్​ ధరలు

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​లో పెట్రోల్​ ధరలు భగ్గుమంటున్నాయి. ఇరవై రోజుల క్రితమే లీటర్​ పెట్రోల్​పై రూ.60 పెంచిన ప్రభుత్వం మరోసారి రూ.24 వడ్డించింది. దీంతో లీటర్​ పెట్రోల్​ రూ.234కు చేరింది. రాయితీలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

ఇప్పటికే చమురు ధరలతో అల్లాడిపోతున్న ప్రజలపై మరోమారు భారం మోపింది పాకిస్థాన్​ ప్రభుత్వం. ద్రవ్యలోటును తగ్గించటం, ఐఎంఎఫ్​ రుణాలు పొందటమే లక్ష్యంగా చమురుపై ఇస్తున్న రాయితీలను పూర్తిగా ఎత్తివేసింది. దాంతో లీటర్​ పెట్రోల్​ ధర 29 శాతం పెరిగింది. ఇటీవలే అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి షెహబాజ్​ షరీఫ్​ నేతృత్వంలోని ప్రభుత్వం గడిచిన 20 రోజుల్లోనే మూడు సార్లు చమురుపై రాయితీల్లో కోత విధించటం గమనార్హం.

కొత్త ధరలు బుధవారం అర్ధరాత్రి అమలులోకి వచ్చినట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి మిఫ్తాహ్​ ఇస్మాయిల్​ తెలిపారు. తాజాగా లీటర్​ పెట్రోలుపై రూ.24, హైస్పీడ్​ డీజిల్​(హెచ్​ఎస్​డీ)పై లీటర్​కు రూ.59.16 పెంచినట్లు చెప్పారు. ఇప్పటికే మే 25వ తేదీన లీటర్​ పెట్రోల్​పై రూ.60 పెంచిన ప్రభుత్వం తాజాగా మరోమారు పెంచటం వల్ల వినియోగదారులపై మరింత భారం పడినట్లయింది. ప్రస్తుతం పాక్​లో లీటర్​ పెట్రోల్​ రూ.233.89, హైస్పీడ్​ డీజిల్​ లీటర్​కు రూ.263.31, కిరోసిన్​ లీటర్​కు రూ.211.47కు చేరింది.

"అన్ని పెట్రోలియం ఉత్పత్తుల ధరలు వినియోగదారుల కొనుగోలు ధరకు చేరాయి. రాయితీ అనేది పూర్తిగా ఎత్తేశాం. ఇకపై పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాల్లో ప్రభుత్వం నష్టపోయేదేమీ ఉండదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థతో రుణాలు పొందేందుకు ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నాం. గత ప్రభుత్వాలు ఐఎంఎఫ్​తో చేసుకున్న తప్పుడు ఒప్పందాలతో మా చేతులు కట్టేశారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చమురు ధరలు పెంచక తప్పలేదు. చమురు ధరలు పెంచకపోతే.. రుణ ఎగవేతదారుగా మిగలాల్సి ఉంటుంది. ఈ పెంపుతో మధ్య తరగతి ఇబ్బందులు పడుతుందని తెలుసు. "

- మిఫ్తాహ్​ ఇస్మాయిల్, ఆర్థిక మంత్రి

కొత్త ధరలతో పెట్రోలియం ఉత్పత్తులపై ప్రభుత్వం ఇస్తున్న రాయితీని పూర్తిగా ఎత్తివేసినట్లయింది. 2019లోని ఒప్పందం ప్రకారం 6 బిలియన్​ డాలర్ల రుణం ఇవ్వాలంటే రాయితీలను ఎత్తివేయాలని ఐఎంఎఫ్​ డిమాండ్​ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్​ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు.. జూన్​ 10న ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ప్రకటించిన ఇతర చర్యలపైనా ఐఎంఎఫ్​ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: బంగారానికి దారి చూపిన ఎలుక.. ఆ ఫ్యామిలీ ఫుల్​ ఖుష్!

జిన్‌పింగ్‌ భిన్న పంథా.. 70 ఏళ్లు వచ్చినా నో రిటైర్మెంట్.. మూడోసారీ ఆయనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.