ETV Bharat / international

దివాలా అంచున పాకిస్థాన్​.. శ్రీలంకను మించిన ఆర్థిక సంక్షోభం.. రూ.255కి రూపాయి మారకపు విలువ

author img

By

Published : Jan 27, 2023, 11:43 AM IST

pakistan-crisis-pak-currency-breaks-9-dot-61-percent-against-dollar-biggest-decline-since-1999
శ్రీలంకను మించిపోయిన పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం

పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభం శ్రీలంకను మించిపోయింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్‌లో ఇప్పుడు పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. ఇప్పటికే డాలర్‌తో పోలిస్తే పాకిస్తాన్‌ రూపాయి మారకపు విలువ 255 రూపాయలకు చేరింది. చాలా కాలంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా నెట్టుకొస్తున్న పాక్‌.. పొదుపు చర్యలపైనే భారాన్ని వేసింది. ఎంపీల వేతనాల్లో 15 శాతం కోత విధించింది. విదేశీ పర్యటనలు, లగ్జరీ వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. పాక్‌లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఆకలి చావులు తప్పవన్న భయాందోళనలు నెలకొన్నాయి.

Pakistan Crisis 2023 : గడ్డి తినైనా అణుబాంబు తయారు చేస్తామని 1970వ దశకంలో.. పాకిస్తాన్ అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ప్రకటించాడు. అయితే ఇప్పుడు పాక్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయి. కానీ తినడానికే తిండి దొరకడం లేదు. పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. విదేశీ మారక నిల్వలు తరిగిపోయాయి. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాక్‌ కష్టాలు.. మరింత పెరిగి శ్రీలంక కంటే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. డాలర్‌తో పోలిస్తే పాక్‌ రూపాయి మారకపు విలువ.. ఒక్కరోజులోనే 24రూపాయల మేర క్షీణించి 255కు చేరింది. పాక్‌ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో రూపాయి పతనం కావడం ఇదే తొలిసారి. 1999లో కొత్త ఎక్సేంజ్ రేట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన తర్వాత.. పాక్‌లో ఇదే అతిపెద్ద క్షీణత అని డాన్ వార్తా సంస్థ వెల్లడించింది.

తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు వీలుగా అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎమ్​ఎఫ్​ నుంచి రుణాలు పొందేందుకు పాక్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఐఎమ్​ఎఫ్​ సూచన మేరకు పాకిస్థాన్‌ ద్రవ్యమారకపు రేటుపై నిబంధనలను సడలించింది. దీంతో ఒక్కరోజులోనే పాక్‌ రూపాయి 24 రూపాయల మేర క్షీణించి డాలరుతో పాక్‌ రూపాయి మారకపు విలువ 255 రూపాయలకు పడిపోయింది. తాము నిధులివ్వాలంటే పాకిస్థాన్‌లో కరెంటు సబ్సిడీలను ఉపసంహరించాలనీ, అంతర్జాతీయ విపణి ధరలకు తగ్గట్టు గ్యాస్‌ ఛార్జీలను నిర్ణయించాలనీ, పాక్‌ రూపాయి మారక విలువను మార్కెట్‌ ఆధారంగా నిర్ణయించాలనీ, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్లపై నిషేధం తొలగించాలని ఐఎమ్​ఎఫ్​ గతంలో షరతులు పెట్టింది. ఇప్పుడు విడుదల చేయకపోతే 6.5 బిలియన్‌ డాలర్ల నిధులన్నీ రద్దయిపోతాయి. అందుకే పాక్‌ ఈ కఠిన నిర్ణయాలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. షరతులకు అంగీకరించిన నేపథ్యంలో వచ్చే వారం తమ బృందం పాకిస్తాన్‌లో పర్యటిస్తుందని ఐఎమ్​ఎఫ్​ వెల్లడించింది. షరతుల అమలుపై అధికారులతో చర్చలు జరపడానికి ఐఎమ్​ఎఫ్​ బృందం జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు పాక్‌లో పర్యటిస్తుందని అధికారులు తెలిపారు.

మరోవైపు తీవ్ర ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాక్‌లో విదేశీ మారకపు నిల్వలు పూర్తిగా పడిపోయాయి. ఒక ప్యాకెట్‌ పిండి 3 వేల కంటే ఎక్కువ ధర పలుకుతోంది. అంత మొత్తం చెల్లించేందుకు సిద్ధపడినా.. ఆహార పదార్థాలు దొరకడం లేదు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో దేశం మొత్తం అంధకారంలో కూరుకుపోయింది. దేశంలో విలయ తాండవం చేస్తున్న ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు గత 24 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పాక్‌ సెంట్రల్‌ బ్యాంకు వడ్డీ రేట్లను అమాంతంగా పెంచేసింది.

తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు పాకిస్తాన్‌ పొదుపు చర్యలపై దృష్టి పెట్టింది. ఎంపీల వేతనాల్లో 15 శాతం కోత పెట్టింది. వారి విదేశీ పర్యటనలు, లగ్జరీ వాహనాల కొనుగోలుపై నిషేధం విధించింది. గ్యాస్, విద్యుత్‌ ధరలు పెంచాలని నిర్ణయించింది. నిఘా సంస్థలకు విచ్చలవిడిగా నిధులు విడుదల చేయరాదని తీర్మానించింది. చమురు దిగుమతులు గుదిబండగా మారిన నేపథ్యంలో అన్ని స్ధాయిల్లో పెట్రోల్‌ వాడకాన్ని 30 శాతం తగ్గించుకోవాలని పాక్‌ నిర్ణయించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.