ETV Bharat / international

ఆగని ఒమిక్రాన్.. మరో రెండు కొత్త వేరియంట్​లు

author img

By

Published : Apr 13, 2022, 7:11 AM IST

omicron new variants
ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌

omicron New Variants: ప్రపంచంలో కొవిడ్​ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్త కొత్త వేరియంట్​లు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉత్పరివర్తనం చెందుతూ ఎన్నోరకాల వేరియంట్ల సృష్టికి కారణమవుతోంది. తాజాగా మరో రెండు ఒమిక్రాన్‌ ఉపరకాలు బీఏ.4, బీఏ.5 దక్షిణాఫ్రికాలో బయటపడ్డాయి. రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సంభావ్యతను అర్థం చేసుకునేందుకు మరింత అధ్యయనం చేస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

omicron New Variants: ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉత్పరివర్తనం చెందుతూ కొత్తగా ఎన్నోరకాల వేరియంట్ల సృష్టికి కారణమవుతూనే ఉంది. ఈ క్రమంలో వెలుగు చూసిన బీఏ.2 ఉపరకం ప్రపంచవ్యాప్తంగా 94శాతం ప్రాబల్యం కలిగి ఉన్నట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా మరో రెండు ఒమిక్రాన్‌ ఉపరకాలు బీఏ.4, బీఏ.5 దక్షిణాఫ్రికాలో బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉపరకాల ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. అంతర్జాతీయ డేటాబేస్‌ (GISAID) ప్రకారం.. ఈ రెండు వేరియంట్‌లకు సంబంధించి పలుదేశాల్లో ఇప్పటికే డజన్ల కొద్ది కేసులు నమోదయ్యాయి.

'బీఏ.2 మాదిరిగానే బీఏ.4, బీఏ5 స్పైక్‌ ప్రొఫైల్‌ను కలిగి ఉన్నాయి. ఇప్పటికే బోట్స్‌వానా, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్‌తోపాటు బ్రిటన్‌లోనూ ఈ ఉపరకం కేసులు వెలుగు చూశాయి. దక్షిణాఫ్రికాలో ఈ ఉపరకాల కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. అయితే, ఆస్పత్రుల్లో చేరికలు, మృతులకు సంబంధించి పెరుగుదల లేనందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని దక్షిణాఫ్రికాలోని సెంటర్‌ ఫర్‌ ఎపిడమిక్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ (CERI) డైరెక్టర్‌ టులియో డీ ఒలీవియరా పేర్కొన్నారు. వీటికి సంబంధించి జన్యుపరమైన సమాచారాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసిన ఆయన.. వీటిలోని ఒక స్పైక్‌ ప్రొటీన్‌ డెల్టా, కప్పా, ఎప్సిలాన్‌ వేరియంట్లలో ఉన్నదేనని వివరించారు.

డబ్ల్యూహెచ్ఓ అలర్ట్‌..: బీఏ.4, బీఏ.5లో అధిక మ్యుటేషన్లు ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే సంభావ్యతను అర్థం చేసుకునేందుకు మరింత అధ్యయనం చేస్తున్నామని తెలిపింది. ఇక జనవరి 10 నుంచి మార్చి 30 మధ్యకాలంలో బీఏ.4 వేరియంట్‌ను దక్షిణాఫ్రికా, డెన్మార్క్‌, బోట్స్‌వానా, స్కాట్లాండ్‌, ఇంగ్లాండ్‌ దేశాల్లో గుర్తించినట్లు బ్రిటన్‌ ఆరోగ్య భద్రతా సంస్థ వెల్లడించింది. బీఏ.5 కేసులు మాత్రం గతవారం దక్షిణాఫ్రికాలో వెలుగు చూడగా.. బీఏ.4, బీఏ.5కి సంబంధించి నాలుగు కేసులు గుర్తించినట్లు బోట్స్‌వానా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ వేరియంట్‌ నిర్ధారణ అయిన బాధితులందరూ వ్యాక్సిన్‌ తీసుకున్నవారేనని.. వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని తెలిపింది.

కేంద్ర ఆరోగ్యశాఖ సమీక్ష..: మరోవైపు మన దేశంలోనూ కొత్త వేరియంట్‌ కేసులు వెలుగుచూసినట్టు వార్తలు వస్తున్న వేళ కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కొత్తగా బయటపడిన 'ఎక్స్‌ఈ' వేరియంట్‌పై ఆందోళన నెలకొన్న తరుణంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైరస్ వ్యాప్తి, ప్రాబల్యంపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణతోపాటు కేసులపై నిఘా పెంచాలని అధికారులకు సూచించారు. కొవిడ్‌ చికిత్సకు అవసరమైన ఔషధాల లభ్యతపై సమీక్ష చేసుకోవడంతోపాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్‌, ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌, ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, ఐసీఎంఆర్‌ డీజీ బలరాం భార్గవతోపాటు కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ చీఫ్‌ ఎన్‌కే అరోఢా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'ఎక్స్​ఈ' వేరియంట్​ను తేలిగ్గా తీసుకోవద్దు.. మాస్కుతోనే వైరస్​ కట్టడి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.