ETV Bharat / international

వీసాలు సరే.. వసతి, తిండి ఎలా?.. బ్రిటన్‌లోని భారతీయ విద్యార్థులకు ద్రవ్యోల్బణం సెగ

author img

By

Published : Jan 9, 2023, 6:30 AM IST

indian students in britain
indian students in britain

ఉన్నత చదువుల కోసం బ్రిటన్‌కు వెళుతున్న భారతీయ విద్యార్థులకు అక్కడి ద్రవ్యోల్బణం చుక్కలు చూపిస్తోంది. వసతి, ఆహారం కోసం అవుతున్న ఖర్చులు బెంబేలెత్తిస్తున్నాయి. 21 రోజులు బస చేయడానికి రూ.లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని కొంత మంది విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నత చదువుల కోసం, అత్యుత్తమ విద్యను ఆర్జించడానికి బ్రిటన్‌కు వెళుతున్న భారతీయ విద్యార్థులకు అక్కడి ద్రవ్యోల్బణం చుక్కలు చూపిస్తోంది. ఆకాశాన్నంటుతున్న ధరలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వసతి, ఆహారం కోసం అవుతున్న ఖర్చులు బెంబేలెత్తిస్తున్నాయి. "ఏడేళ్ల క్రితం బ్రిటన్‌లోనే చదివాను. అప్పుడు 2 వారాల ఆహారానికైన ఖర్చు.. ఇప్పుడు 4 రోజులకే సరిపోతుంది. ఈ స్థాయిల్లో ధరలు ఉంటాయని ఊహించలేదు" అని రియాజైన్‌ తెలిపారు. ఈమె ప్రస్తుతం ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ నార్తాంప్టన్‌లో ఎంఎస్సీ చేస్తున్నారు. బ్రిటన్‌లో చదువుతున్న భారతీయులు సహా అంతర్జాతీయ విద్యార్థులకు సరసమైన ధరలకు వసతి సౌకర్యాలు దొరకడం లేదు. దీనికి తోడు పెరుగుతున్న ఆహార ధరలు జీవన వ్యయాన్ని భారీగా పెంచుతున్నాయి.

"గతేడాది అక్టోబరులో 21 రోజులు బస చేయడానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది" అని చాయనిక దూబే ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితం యూకేలో అడుగుపెట్టిన దూబే.. ప్రస్తుతం గోల్డ్‌స్మిత్స్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌లో అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ కల్చరల్‌ పాలసీలో మాస్టర్స్‌ చేస్తున్నారు. 2022లో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిల్లోకి దూసుకెళ్లింది. వినియోగదారుల ధరల సూచీ 8.8శాతానికి పెరిగింది. నవంబరులో జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన లెక్కల ప్రకారం.. ద్రవ్యోల్బణం 9.3 శాతానికి పరుగులు తీసింది.

టాప్‌-అప్‌ రుణాలకు డిమాండ్‌..!
పెరుగుతున్న ధరల కారణంగా పడుతున్న ఆర్థిక భారాన్ని అధిగమించడానికి చాలా మంది టాప్‌-అప్‌ రుణాలను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకుల్లో వీటికి డిమాండ్‌ పెరిగింది. అంతేకాదు విదేశాల్లో చదివే విద్యార్థులకు రుణాల పరిమితినీ రుణసంస్థలు పెంచాయి. అయితే ఖర్చు తగ్గించుకోవటానికి ఇతర దేశాలవైపు చూస్తున్న విద్యార్థులూ లేకపోలేదు "యూకేలోనే బ్యాచిలర్స్‌ చేయాలని ఆరో తరగతి నుంచి నా కల. ప్రస్తుతం ఆ దేశంలోని ఆర్థిక సంక్షోభం దృష్ట్యా కాస్త తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న దేశానికి వెళ్లాలని అనుకుంటున్నా" అని 12వ తరగతి చదువుతున్న స్కందా రాజీవ్‌ తెలిపారు.

చైనాను దాటేశాం.. అయినా..!
బ్రిటిష్‌ హైకమిషన్‌ లెక్కల ప్రకారం.. యూకే జారీ చేస్తున్న ప్రాయోజిత విద్యా వీసాలు అత్యధికంగా అందుకుంటున్న దేశం భారతే. ఈ విషయంలో చైనాను మన దేశం అధిగమించింది. సెప్టెంబరు 2022కు ముగిసిన విద్యాసంవత్సరానికి భారతీయ విద్యార్థులకు 1.27 లక్షలు వీసాలు జారీ అయ్యాయి. అయితే వీసాలు దొరికిన సంబరాన్ని.. ద్రవ్యోల్బణం మింగేస్తోంది. "ప్రస్తుత ద్రవ్యోల్బణ రేట్లతో నా ఖర్చులను కనిష్ఠంగా ఉంచుకోవడం సవాలే. నిత్యావసరాలపైనే దృష్టి పెడుతున్నా" అని ఆస్టన్‌ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ చేస్తోన్న నమన్‌ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.